హైదరాబాద్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ): జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అరాచకాలపై బీఆర్ఎస్ నేతలు మంగళవారం ఒక్కరోజే ఎన్నికల సంఘానికి 60కి పైగా ఫిర్యాదులు చేశారు. ఉప ఎన్నికలో అడ్డదారిలో గెలవడం కోసం కాంగ్రెస్ నాయకులు దౌర్జన్యాలు, బెదిరింపులు, బోగస్ ఓటర్లతో రిగ్గింగ్‌కు పాల్పడ్డారని తెలిపారు.
కొన్ని ఫిర్యాదులను ఈమెయిల్లో పంపిన బీఆర్ఎస్, కొన్నింటిని నేరుగా ఎన్నికల అధికారులకు అందజేసింది. వెంగళరావునగర్ డివిజన్లోని 203వ బూత్ వద్ద కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఓటర్లకు డబ్బులు పంచి పెట్టారని తెలిపింది. పోలింగ్ బూతుల వద్ద డ్యూటీలో ఉన్న పోలీసులు కాంగ్రెస్ నాయకుల చట్టవ్యతిరేక చర్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించింది.
కాంగ్రెస్ కార్యకర్తల అక్రమ కార్యకలాపాలను గమనించి కూడా స్పందించని పోలీసు అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసింది. కాంగ్రెస్ నేతలు పంపిణీ చేసిన నగదు మొత్తాన్ని ఆ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఎన్నికల ఖర్చులో వేయాలని కోరింది. కాంగ్రెస్ డబ్బు పంపిణీపై ఎన్నికల పరిశీలకుడి ద్వారా దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేసింది.