హైదరాబాద్, ఫిబ్రవరి 14 (నమస్తేతెలంగాణ): పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కార్యకర్తలు అద్భుతంగా పోరాడారని, ఫలితాలు గొప్పగా రాని నల్లగొండ జిల్లాలోనూ విజయం కోసం వీరోచితంగా శ్రమించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కితాబునిచ్చారు. ఎన్నికల్లో 30 మున్సిపాలిటీలకు పైగా వస్తాయనుకున్నామని చెప్పారు. కానీ, కాంగ్రెస్ విచ్చలవిడిగా డబ్బుల పంపిణీ, అధికార దుర్వినియోగంతో అడ్డదారిలో గెలిచిందని విమర్శించారు. హంగ్ వచ్చిన చోట్ల 17 మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్కు విజయావకాశాలున్నాయని స్పష్టంచేశారు. శనివారం హైదరాబాద్ నందినగర్‌లోని తన నివాసంలో కేటీఆర్ మీడియాతో ఇష్టాగోష్ఠిగా ముచ్చటించారు. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల ఫలితాలు, తాజాగా జారీ చేసిన ఎక్స్ అఫీషియో మార్గదర్శకాలు, ఫార్ములా -ఈ కార్ రేస్ కేసు తదితర అంశాలపై స్పందించారు.
మున్సిపల్ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలపై కాంగ్రెస్ అసంతృప్తిగానే ఉన్నదని, ఆ పార్టీ ఆశించినట్టుగా 75 నుంచి 80 శాతం స్థానాలు గెలుచుకోలేదని చెప్పారు. తాము ఊహించిన దానికంటే బీఆర్ఎస్ శ్రేణులు వీరోచిత పోరాటం చేశారని ప్రశంసించారు. స్థానిక ఎన్నికల్లో లోకల్ అంశాలు ప్రభావం చూపుతాయని తెలిపారు. కాంగ్రెస్ మరో మూడేండ్లు అధికారంలో కొనసాగనున్నందున ఆ పార్టీకి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. గతంలో బీఆర్ఎస్ అప్రతిహతంగా విజయాలు నమోదు చేసిందని గుర్తుచేశారు. రోడ్డు వేస్తారేమోనని, మోరీ కడుతారేమోనని ఆశించి ప్రజలు అధికార పార్టీ వైపు మొగ్గుచూపారని స్పష్టంచేశారు. కానీ మొత్తంగా చూస్తే ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకత స్పష్టంగా ప్రతిబింబించిందని చెప్పారు. ఓటర్లకు ఎన్నికలపై స్పష్టత ఉంటుందని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో తమ పార్టీకి వ్యతిరేకంగా ఓటేసిన వారే ప్రస్తుత ఎన్నికల్లో తిరిగి తమవైపు మళ్లారని ప్రస్తావించారు.
స్థానిక ఎన్నికలు గీటురాయి కాదు
స్థానిక ఎన్నికల్లో అక్కడి సమస్యలు, ఇతర అంశాల ఆధారంగానే ప్రజలు తీర్పు ఇస్తారని, లోకల్‌బాడీ ఎన్నికలు అసెంబ్లీ ఎలక్షన్స్‌కు గీటురాయి కాదని కేటీఆర్ వివరించారు. ఇందుకు ఎన్నో ఉదంతాలున్నాయని ఉదహరించారు. ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ కుప్పంలో కూడా పోయిందని, చివరికి అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయాలు నమోదు చేసుకున్నదని గుర్తుచేశారు. ఒక ఎన్నికకు, మరో ఎన్నికకు పొంతన ఉండదని అభిప్రాయపడ్డారు. స్థానిక ఎన్నికల్లో ఒక్కోసారి సానుభూతి కూడా పనిచేయదని చెప్పారు. తన నియోజకవర్గమైన సిరిసిల్లలోని ఓ వార్డులో ఇలాంటి ఫలితమే వచ్చిందని గుర్తుచేశారు. మూడుసార్లు ఓడిపోయిన ఓ మహిళా అభ్యర్థి కాంగ్రెస్ తరఫున బరిలో దిగారని, కానీ ఒక మంచిపేరున్న పిల్లాడిని ఆమెపై పోటీకి పెడితే 70 ఓట్లతో విజయం సాధించాడని చెప్పారు. సిరిసిల్లలో కాంగ్రెస్ పార్టీ 20 చోట్ల డిపాజిట్లు కోల్పోయిందని తెలిపారు. 1,800-2,000 ఓట్లు ఉన్న కొన్ని వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు వెయ్యికి పైగా ఓట్లు సాధించారని చెప్పారు.
అడ్డగోలుగా మాట్లాడిన వారికి ఈ ఫలితాలే సమాధానం
పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పని అయిపోయిందని, ఇక లేవదని అడ్డగోలుగా మాట్లాడిన వారికి మొన్న పంచాయతీ, ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల ఫలితాలే సమాధానమని కేటీఆర్ వ్యాఖ్యానించారు. తాము లోకల్‌బాడీ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించామని పునరుద్ఘాటించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం నాలుగు స్థానాలకే పరిమితమైందని గుర్తుచేశారు. ‘రేవంత్‌రెడ్డి మల్కాజిగిరి ఎం పీగా, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఎన్ని స్థానాలు గెలిచారు?’ అని ప్రశ్నించారు. ప్రస్తుత బల్దియా ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎన్ని డివిజన్లు, మున్సిపాలిటీలు సాధించామో బేరీజు వేసుకోవాలని చెప్పారు. మేడ్చల్‌లో 10 స్థానాలకు ఒక్కటి కూడా కాంగ్రెస్ గెలుచుకోలేదని, ప్రజలు అన్నీ గమనిస్తున్నారని పేర్కొన్నారు.
బీజేపీకి గతం కంటే తక్కువ ఓట్లు
బీజేపీకి గతంలో వచ్చిన ఓట్ల కంటే ప్రస్తుతం తక్కువ వచ్చాయని కేటీఆర్ పేర్కొన్నారు. ‘బీజేపీ జాతీయ అధ్యక్షుడితో పాటు మహారాష్ట్ర సీఎం, హోం మంత్రి అమిత్‌షా, ఇతర కీలకనేతలను తీసుకొచ్చి ప్రచారం చేయించారు. మంచి ఫలితాలు సాధిస్తామని హడావుడి చేశారు. కానీ ఫలితాలు ఎలా వచ్చాయో మీరందరూ చూస్తున్నారు’ అని వ్యాఖ్యానించారు. జాతీయస్థాయి నేతలతో ప్రచారం చేయించినా ఒక్క మున్సిపాలిటీని కూడా గెలుచుకోలేదని చురకలంటించారు. గతంతో పోలిస్తే ఆ పార్టీ తక్కువ స్థానాల్లో గెలిచిందని, కానీ ఆ పార్టీ నాయకులు ఫర్మార్మెన్స్ బాగున్నదని చెప్పుకోవడం విడ్డూరంగా ఉన్నదని ఎద్దేవాచేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు 25 శాతం ఓట్లు సాధించామని చెప్పుకోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. గత మున్సిపల్ ఎన్నికలతో పోల్చితే ఆ పార్టీకి 10 శాతం ఓట్లు తగ్గాయని వెల్లడించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అధినేతలు, పెద్ద లీడర్లు తిరిగితే పెద్దగా ప్రయోజనం ఉండదని అభిప్రాయపడ్డారు. స్థానిక అభ్యర్థుల ప్రభావం, అక్కడి సమస్యలు, అధికారంలో ఉన్న పార్టీకి అనుకూల వాతావరణం ఉంటుందని విశ్లేషించారు. కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ విషయంలో సీపీఐ ఎవరితో వెళ్లాలో వారి ఇష్టమని, కాంగ్రెస్‌తో కలిసినా తమకేం ఇబ్బందిలేదని తెలిపారు. అయితే సింగరేణి కార్మికులకు మెస్సేజ్ ఇచ్చేందుకే సీపీఐకి మద్దతిచ్చేందుకు సిద్ధమయ్యామని స్పష్టంచేశారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే పోటీ
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే ముఖాముఖి పోటీ నెలకొన్నదని కేటీఆర్ చెప్పారు. బీజేపీ అంతగా ప్రభావం చూపలేదని, ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్‌లాంటి చోట్ల మాత్రమే కొంత మెరుగైన ఫలితాలు సాధించిందని గుర్తుచేశారు. వరంగల్‌లో ఆ పార్టీ ప్రభావం నామమాత్రమేనని చెప్పారు. ఖమ్మంలో బీజేపీకి ఏమాత్రం పట్టులేదని స్పష్టంచేశారు. అయితే కొన్నిచోట్ల అభ్యర్థుల బలంతోనే గెలిచిందని పేర్కొన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్లో టికెట్ రాని వారు ఆ పార్టీ తరఫున బరిలో నిలిచి విజయం సాధించారని తెలిపారు.
ఎక్స్ అఫీషియోపై కలెక్టర్లది ఓ మాట..సీఎస్‌ది మరోమాట
మున్సిపల్ అధ్యక్షులు, కార్పొరేషన్ మేయర్ల ఎన్నిక ప్రక్రియలో ఎక్స్ అఫీషియో సభ్యులకు సంబంధించిన ఓటు వినియోగంపై గందరగోళం కనిపిస్తున్నదని, నిబంధనల విషయంలో ప్రభుత్వానికి సైతం స్పష్టతలేదని కేటీఆర్ పేర్కొన్నారు. ‘ఈ అంశంలో కలెక్టర్లు ఓమాట చెప్తే చీఫ్ సెక్రటరీ మరోమాట చెప్తున్నరు. ప్రస్తుత నిబంధనలపై ప్రభుత్వానికి స్పష్టత లేకపోవడం దురదృష్టకరం’ అని వాపోయారు.
బీఆర్ఎస్లోకి పలువురు కౌన్సిలర్లు
బెల్లంపల్లి మున్సిపాలిటీకి చెందిన పలువురు కౌన్సిలర్లు కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. శనివారం హైదరాబాద్ నందినగర్‌లోని తన నివాసంలో కేటీఆర్ వారికి గులాబీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. 20వ వార్డు నుంచి గెలిచిన కాంగ్రెస్‌కు చెందిన కుమారస్వామి, 30వ వార్డు స్వతంత్ర కౌన్సిలర్ బీఆర్ఎస్లో చేరారు. బీజేపీకి చెందిన 34వ వార్డు కౌన్సిలర్ రామ్మూర్తి కేటీఆర్‌ను కలిశారు. ఆయన ప్రస్తుతానికి బీఆర్ఎస్లో అధికారికంగా చేరలేదు. అయితే పార్టీ విధానాలకు ఆకర్షితులై పూర్తిస్థాయిలో మద్దతు ప్రకటించారు. తాజా చేరికలతో బెల్లంపల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ బలం పెరిగింది.
విచారణకు ఎన్నిసార్లు పిలిచినా వెళ్తా
ప్రస్తుతం ప్రభుత్వం మరోసారి ఫార్ములా-ఈ కార్ రేసు కేసును తెరపైకి తెస్తున్నదని కేటీఆర్ తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే నాలుగుసార్లు పిలిచి వాళ్లు చేసిందేమీలేదని, మరోసారి తమాషా కోసమే పిలువబోతున్నారనే సమాచారం ఉన్నదని చెప్పారు. ‘ఏసీబీ అధికారులు ఎన్నిసార్లు విచారణకు పిలిచినా వెళ్తా.. నిజాన్ని స్పష్టంగా చెప్తా.. నాకేం ఇబ్బందిలేదు’ అని కుండబద్దలుకొట్టారు. ఈ కేసులో ఎలాంటి పసలేదని పోలీసు, ఏసీబీ అధికారులు సీఎంకు చెప్పారని, కానీ ముఖ్యమంత్రి రాజకీయ కక్షతో ఈ కేసును వాడుకుంటున్నారని విమర్శించారు. ఏదేమైనా భయపడబోనని స్పష్టంచేశారు. జైలులో పెట్టినా బెదిరేదిలేదని తేల్చిచెప్పారు.
స్థానిక ఎన్నికల్లో అక్కడి సమస్యలు, ఇతర అంశాల ఆధారంగానే ప్రజలు తీర్పునిస్తరు. లోకల్‌బాడీ ఎన్నికలు అసెంబ్లీ ఎలక్షన్స్‌కు గీటురాయి కాదు. ఇందుకు ఎన్నో ఉదంతాలున్నయ్. ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ కుప్పంలో కూడా పోయింది. కానీ చివరికి ఏమైంది? అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయాలు నమోదు చేసుకున్నది. ఒక ఎన్నికకు, మరో ఎన్నికకు పొంతన ఉండదు. స్థానిక ఎన్నికల్లో ఒక్కోసారి సానుభూతి కూడా పనిచేయదు.-కేటీఆర్
పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పని అయిపోయిందని, ఇక పనైపోయిందని అడ్డగోలుగా మాట్లాడిన వారికి మొన్న పంచాయతీ, ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల ఫలితాలే సమాధానం. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం నాలుగు స్థానాలకే పరిమితమైంది. రేవంత్‌రెడ్డి మల్కాజిగిరి ఎంపీగా, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఎన్ని స్థానాలు గెలిచారు? -కేటీఆర్