కీవ్, : ఉక్రెయిన్లో నలుగురు భారతీయులతో వెళ్తున్న వాణిజ్య నౌకపై ఒడెసీ పోర్టు వద్ద శనివారం సైనిక దాడి జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు భారతీయులు గల్లంతైనట్టు కీవ్లోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. గల్లంతైనవారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు తెలిపింది. ఎంవీ ఏజీఎన్ రంగార్ అనే వాణిజ్య నౌక నల్లసముద్రంలోని ఒడెసీ పోర్టులో నిలిపి ఉంచిన సమయంలో ఈ దాడి ఘటన చోటుచేసుకున్నది.
అయితే, నౌకపై ఎవరు బాంబు దాడి చేశారు? అనే వివరాల్ని భారత రాయబార కార్యాలయం అధికారులు తెలుపలేదు. ఉక్రెయిన్ వాణిజ్యానికి నల్ల సముద్రంలోని ఒడెసీ పోర్టు చాలా కీలకం. నాలుగేండ్ల క్రితం రష్యాతో యుద్ధం మొదలైనప్పటి నుండి..ఈ పోర్టుపై అనేకమార్లు మిలిటరీ దాడులు జరిగాయి.