INDIA bloc : సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా కోరుతూ ప్రతిపక్ష ఇండియా బ్లాక్ కూటమి నేతలు ఢిల్లీలో మంగళవారం ర్యాలీ చేపట్టిన సంగతి తెలిసిందే. పార్లమెంట్ నుంచి ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయం అయిన నిర్వచన్ సదన్ వరకు ఈ ర్యాలీ జరగాలి. ఇందుకోసం కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్, కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ వంటి అగ్రనేతలు పాల్గొన్నారు.
ర్యాలీ కోసం నేతలు ఆకాశవాణి భవన్కు చేరుకున్నారు. అక్కడ్నుంచి పార్లమెంట్ సమీపంలోని మకర్ ద్వార్ నుంచి నేతలు ఈసీఐ కార్యాలయానికి వెళ్తుండగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. భవనానికి చేరుకోకుండానే ఇండియా బ్లాక్ నేతల్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో నేతలంతా నీతి అయోగ్ కార్యాలయం వద్ద నిరసనకు దిగారు. రోడ్డుపైనే దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ సహా కూటమి నేతలు ఈసీఐ, సీఈసీపై విమర్శలు చేశారు. ప్రభుత్వం ఓట్ చోరీకి పాల్పడిందని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని డిమాండ్ చేశారు.
సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఒక సమయంలో నేతలు బారికేడ్లు ఎక్కి ఈసీఐ కార్యాలయం వద్దకు దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. మరోవైపు ర్యాలీ సాగే మార్గాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి, ఆందోళనకారుల్ని అడ్డుకుంటున్నారు. ఈసీఐ భవనం వద్ద కూడా పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. పార్లమెంట్, ఆకాశవాణి భవన్, విజయ్ చౌక్ సహా అనేక ప్రాంతాల్లో భద్రత కొనసాగుతోంది. తమను ఆందోళన చేయకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని, పరిస్థితి ఎమర్జెన్సీని తలపిస్తోందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.
ఎన్నికల సంఘం స్వతంత్రతను కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటోందని కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. మోదీ, అమిత్ షా అనుచరుడిలా సీఈసీ జ్ఞానేష్ కుమార్ వ్యవహరిస్తున్నారని, ఆయనను తొలగించాల్సిందే అని ఖర్గే డిమాండ్ చేశారు.