– ఖమ్మం కలెక్టర్ దివాకర టి.ఎస్
కారేపల్లి, అక్టోబర్ 06 : కారేపల్లి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర.టి.ఎస్ మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో కొనసాగుతున్న నూతన భవన నిర్మాణ పనులను పరిశీలించి, పనుల పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిర్మాణ పనులను నాణ్యతా ప్రమాణాలతో నిర్ణీత గడువులో పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. అనంతరం తరగతి గదులను సందర్శించిన కలెక్టర్ విద్యార్థులతో మాట్లాడారు. వారి చదువు, పాఠశాలలో అందుతున్న సౌకర్యాలు, వసతి, భోజనం తదితర అంశాలపై ఆరా తీశారు. విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రత్యేక అధికారి జి.ఝాన్సీ సౌజన్య పాఠశాలలోని సమస్యలు, అవసరమైన మౌలిక వసతులపై కలెక్టర్కు వివరించారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు.