హైదరాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ): ‘రైతులకు 24 గంటల కరెంట్ అవసరం లేదు.. మూడు గంటల కరెంట్ చాలు’ అని విద్యుత్తు నియంత్రణ మండలి (ఈఆర్సీ) ఎదుట కాంగ్రెస్ నేత, రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి చేసిన వ్యాఖ్యలు రేవంత్ ప్రభుత్వ రైతు వ్యతిరేక ముఖాన్ని బట్టబయలు చేశాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇది కోదండరెడ్డి వ్యక్తిగత అభిప్రాయం కాదని, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మనసులోని ఆలోచన అని ఆరోపించారు. రైతులకు మూడు గంటల కరెంటు చాలు అన్న కాంగ్రెస్ ప్రభుత్వ వ్యాఖ్యలపై శుక్రవారం ఒక ప్రకటనలో హరీశ్‌రావు మండిపడ్డారు. అమెరికా వేదికగా రేవంత్‌రెడ్డి చెప్పిన మాటలను ఇప్పుడు అమలు చేసే దిశగా కుట్రలు జరుగుతున్నాయని విమర్శించారు. ‘పొలం అంటే ఏమిటో.., బోరు ఆగిపోతే పంట ఎలా ఎండిపోతుందో.., రైతు రాత్రింబవళ్లు ఎలా కష్టపడుతాడో.. తెలియని వాళ్లు మాత్రమే మూడు గంటల కరెంట్ చాలని మాట్లాడగలరు’ అని ఎద్దేవా చేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుకు 24 గంటల నాణ్యమైన ఉచిత కరెంట్ ఇచ్చి తెలంగాణ వ్యవసాయాన్ని దేశానికి ఆదర్శంగా నిలబెట్టిందని గుర్తుచేశారు. కానీ, కాంగ్రెస్ మాత్రం అదే రైతును మళ్లీ చీకట్లలోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నదని మండిపడ్డారు. ‘రుణమాఫీ అటకెకించారు. రైతుబంధు బంద్ చేశారు. పంట బోనస్ బోగస్ చేశారు. ఎరువుల సరఫరాలో ఫెయిల్ అయ్యారు. పంట కొనుగోళ్లు చేయక రైతుల ప్రాణం తీస్తున్నారు. ఇవి చాలదన్నట్టు కేసీఆర్ ఎంతో శ్రమించి అమలు చేసిన 24 గంటల కరెంట్‌ను ప్రణాళిక ప్రకారం ఖతం పట్టిస్తున్నారు. రైతు డిసమ్ వెనుక దాగి ఉన్న కాంగ్రెస్ అసలు కుట్ర ఇదేనా?’ అని హరీశ్‌రావు నిలదీశారు. కరెంట్ కోతలతో రైతులకు వాతలు పెట్టాలని చూస్తున్న రేవంత్ కుట్రలను యావత్ తెలంగాణ రైతాంగం గమనిస్తున్నదని, రైతు వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పే రోజు దగ్గరలోనే ఉన్నదని హెచ్చరించారు.