హైదరాబాద్, ఆగస్టు 18, (నమస్తే తెలంగాణ) : ‘ఉమ్మడి రాష్ట్రంలో ‘నేను రాను బిడ్డో సరార్ దవాఖానకు’ అనే భయాందోళన ఉండేది. కానీ తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రభుత్వం వైద్యారోగ్య సేవలను మెరుగుపర్చి ‘నేను వస్తానమ్మో సరార్ దవాఖానకు’ అన్న నమ్మకాన్ని తెచ్చిపెట్టింది’ అని వైద్యారోగ్య శాఖ మాజీ మంత్రి సీ లక్ష్మారెడ్డి తెలిపారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ పాలనలో వైద్యరంగానికి బడ్జెట్లో నిధులను మూడింతలు పెంచి విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిందని వివరించారు. కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్ పథకాల ద్వారా ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాల రేటును నాడు గణనీయంగా పెంచామని వివరించారు.
దీనివల్ల మాతా శిశు మరణాల రేటు రికార్డు స్థాయిలో తగ్గిందని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో కేవలం 5 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉంటే, బీఆర్ఎస్ పాలనలో వాటి సంఖ్యను ఏకంగా 34కు పెంచామని తెలిపారు. గతంలో జిల్లా దవాఖానల్లో ఐసీయూ సదుపాయం కూడా ఉండేది కాదని తెలిపారు. కొవిడ్ కంటే ముందు రాష్ట్రంలో కేవలం 1,400 ఆక్సిజన్ పడకలు మాత్రమే ఉంటే బీఆర్ఎస్ ప్రభుత్వం వాటిని 34 వేలకు పెంచిందని తెలిపారు. ఉచిత డయాలసిస్, ఉచిత డయాగ్నస్టిక్స్ సేవలు, ప్రతి నియోజకవర్గంలో 100 పడకల దవాఖానలు, బస్తీ దవాఖానలు తీసుకొచ్చిన ఘనత కేసీఆర్‌దేనని చెప్పారు. 2,000 పడకలకు విస్తరించే నిమ్స్ ప్రణాళిక బీఆర్ఎస్ ప్రభుత్వమే ప్రారంభించిందని గుర్తుచేశారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఆలోచన నుంచి పుట్టిందే సనత్‌నగర్ టిమ్స్ దవాఖాన అని సీ లక్ష్మారెడ్డి పునరుద్ఘాటించారు. ఆ దవాఖానకు సంబంధించిన సమగ్ర ఆలోచన, స్థలాల గుర్తింపు, భూసేకరణ, సమస్యల పరిషారమంతా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే పూర్తయ్యాయని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్‌కు పేరొస్తుందనే కారణంతోనే ఆ దవాఖాన పనులను ఆలస్యం చేశారని ఆరోపించారు. ఏడాదిలోనే పూర్తవ్వాల్సిన పనులను రెండేండ్లపాటు పొడిగించి ఇప్పుడు ఆలస్యంగా ప్రారంభించి గొప్పలు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. కేసీఆర్‌పై దుష్ప్రచారాలను ఆపాలని కాంగ్రెస్ నేతలను హెచ్చరించారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, గాదరి కిషోర్‌కుమార్, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు ఎర్రోళ్ల శ్రీనివాస్, వాల్యానాయక్, బీఆర్ఎస్ నాయకులు గోసుల శ్రీనివాస్‌యాదవ్, అభిలాశ్ రంగినేని తదితరులు పాల్గొన్నారు.