Auto Mobiles : భారత ఆటోమొబైల్ రంగం (Indian Automibile Sector) సెప్టెంబర్ (September) నెలలో ఆల్‌టైమ్ రికార్డు సృష్టించింది. పండుగ సీజన్ ప్రారంభం కావడంతో వినియోగదారుల నుంచి బలమైన డిమాండ్ కనిపించింది. దాంతో దేశీయ ఆటోమొబైల్ రిటైల్ అమ్మకాలు (Retail sales) రికార్డు స్థాయిలో 25,36,920 యూనిట్లకు చేరాయి. గత ఏడాది సెప్టెంబర్‌తో పోలిస్తే ఇది 31.82 శాతం అధికంగా ఉందని లెక్కలు చెబుతున్నాయి.
‘ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (FADA)’ తాజాగా విడుదల చేసిన గణాంకాలలో ఈ వివరాలను వెల్లడించింది. ఆగస్టు నెలతో పోల్చినా అమ్మకాలు 4.69 శాతం పెరిగాయి. భారత ఆటో పరిశ్రమ చరిత్రలో ఒకే నెలలో, ముఖ్యంగా సెప్టెంబర్‌లో ఈ స్థాయిలో అమ్మకాలు నమోదు కావడం ఇదే తొలిసారి అని FADA తెలిపింది. అయితే ఈ 31.82 శాతం వార్షిక వృద్ధిని కొంత జాగ్రత్తగా చూడాలని హెచ్చరించింది.
గత ఏడాది సెప్టెంబర్ 2025లో జీఎస్టీ 2.0 అమలు కానుందన్న ఊహాగానాలతో చాలామంది వాహనాల కొనుగోలును వాయిదా వేశారు. దీనివల్ల అప్పుడు అమ్మకాలు తక్కువగా నమోదయ్యాయి. ఈ ‘లో-బేస్ ఎఫెక్ట్’ కారణంగానే ఈ ఏడాది వృద్ధి శాతం భారీగా కనిపిస్తోందని ఫాడా ప్రెసిడెంట్ సాయి గిరిధర్ చెప్పారు. వాస్తవానికి 2027 ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగంలో (ఏప్రిల్-సెప్టెంబర్) మొత్తం అమ్మకాలు 1,55,12,319 యూనిట్లకు చేరడం ఒక ముఖ్యమైన మైలురాయని పేర్కొన్నారు.
గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే ఇది 20.77 శాతం వృద్ధి అని వెల్లడించారు. విభాగాల వారీగా చూస్తే దాదాపు అన్ని కేటగిరీలలోనూ అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. ద్విచక్ర వాహనాలు 33.08% వృద్ధితో 17,90,188 యూనిట్లు అమ్ముడు పోయాయి. ప్యాసింజర్ వాహనాలు (కార్లు) 32.10% పెరుగుదలతో 4,27,213 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి. ఇక వాణిజ్య వాహనాలు 37.62% వృద్ధితో 1,03,557 యూనిట్లు అమ్ముడయ్యాయి. సెప్టెంబర్ నెలలో ఈ విభాగం లక్ష మార్కును దాటడం ఇదే మొదటిసారి.
అదేవిధంగా త్రిచక్ర వాహనాలు 22.25% వృద్ధితో 1,32,570 యూనిట్లుగా నమోదయ్యాయి. ట్రాక్టర్లు 13.75% పెరుగుదలతో 76,906 యూనిట్లు విక్రయమయ్యాయి. ఈ అమ్మకాల్లో మరో ఆసక్తికరమైన అంశం ఎలక్ట్రిక్ (ఈవీ), ప్రత్యామ్నాయ ఇంధన వాహనాల వాటా గణనీయంగా పెరగడం. ప్యాసింజర్ వాహనాల్లో ప్రత్యామ్నాయ ఇంధన వాహనాల వాటా 41 శాతానికి చేరి, పెట్రోల్ వాహనాల వాటా (41.27%) కు దాదాపు సమానంగా నిలిచింది. ఇదే విభాగంలో ఎలక్ట్రిక్ వాహనాల వాటా 8.45 శాతానికి పెరిగింది.
అన్ని కేటగిరీలలో కలిపి మొత్తం ఈవీ రిటైల్ అమ్మకాలు ఆల్-టైమ్ నెలవారీ గరిష్ఠంగా 3.34 లక్షల యూనిట్లకు చేరాయి. దాంతో మొత్తం వాహన అమ్మకాలలో ఈవీల వాటా సుమారు 13 శాతానికి చేరుకుంది. రాబోయే పండుగ సీజన్‌పై డీలర్లు పూర్తి ఆశాభావంతో ఉన్నారు. ఇప్పుడు పితృ పక్షం కారణంగా కొనుగోళ్లు వాయిదా వేసుకున్న వారు నవరాత్రులు, దసరా పండుగల సందర్భంగా వాహనాలు కొంటారని వారు భావిస్తున్నారు.