Telangana | హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, నవంబరు 13 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ పరిధిలో తొలి పారిశ్రామికవాడ… ఆపై పటాన్చెరు… బాలానగర్… ఉప్పల్… జీడిమెట్ల… నాచారం… కాటేదాన్… ఇలా చెప్పుకుంటూ పోతే! నగరం నలువైపులా పరిశ్రమలే. కాలానుగుణంగా ఇప్పుడు ఇవన్నీ జనావాసాల మధ్యకు వచ్చేశాయి. ముఖ్యంగా ప్రణాళికాబద్ధంగా వీటి ఏర్పాటు జరగకపోవడంతో పర్యవేక్షణ-నియంత్రణ క్లిష్టతరమైంది. ఫలితంగా చుట్టూ కాలుష్య కాసారాల మధ్య నగరం ఇరుక్కుపోయింది. అందుకే హుస్సేన్‌సాగర్ మొదలు 54 నాలాలతో పాటు మూసీనది కూడా రసాయన వ్యర్థాలతో జీవం కోల్పోయాయి. అందుకే ఈ పరిశ్రమల్ని ఔటర్ రింగు రోడ్డు అవతలికి తరలించాలనేది ఉమ్మడి ఏపీ నుంచి దశాబ్దాలుగా నానుతున్న ప్రతిపాదన.
తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం దీనికో పరిష్కారాన్ని గుర్తించింది. ఒకేచోట పారిశ్రామికవాడ ఏర్పాటు చేయడం ద్వారా నియంత్రణ సులువు కావడంతోపాటు పర్యవేక్షణ పకడ్బందీగా ఉంటుందని భావించింది. అందులో భాగంగానే దాదాపు 20వేల ఎకరాల్లో ఫార్మాసిటీకి రూపకల్పన చేసి దాదాపు 14వేల ఎకరాల పైచిలుకు భూసేకరణ కూడా పూర్తి చేసింది.
నగరం చుట్టూ పరిశ్రమలు
హైదరాబాద్ పరిధిలో తొలి పారిశ్రామికవాడగా ఆజామాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డు సమీపంలో ఉంది. తొలుత ఇక్కడే పరిశ్రమలు కొలువుదీరాయి. కాలక్రమేణా అది నగరం నడిబొడ్డుగా మారింది. దీంతో జనావాసాల మధ్య కాలుష్యకారక పరిశ్రమలు ఉండొద్దని ఆందోళనలు మొదలు కావడంతో క్రమేణా వాటిని తరలించారు. చార్మినార్-జూపార్కు ప్రాంతంలో దశాబ్దాల కిందటే ఉన్న రైస్, ఆయిల్ మిల్లులనూ జనావాసాలు పెరగడంతో తరలించారు. పారిశ్రామికవృద్ధిలో భాగంగా నగరం చుట్టూ బీహెచ్ఈఎల్, హెచ్ఎంటీ, ఈసీఐఎల్, హెచ్ఏఎల్, బీడీఎల్ ఇలా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు వచ్చాయి. ఇందులో భాగంగా వచ్చిన ఐడీపీఎల్‌తో ఫార్మా రంగం పురుడుపోసుకుంది.
అందుకే దానిని మదర్ ఆఫ్ ఫార్మాగా అభివర్ణిస్తారు. వీటి తర్వాత ఉప్పల్, పటాన్చెరు, జీడిమెట్ల, కాటేదాన్, నాచారం… వివిధ తయారీరంగాలకు చెందిన పారిశ్రామికవాడలు ఒక్కొక్కటిగా పుట్టుకొచ్చాయి. కాలానుగుణంగా ఇవి విస్తరించాయి. పటాన్చెరు పారిశ్రామికవాడను తీసుకుంటే రామచంద్రాపురం మొదలు ఇస్నాపూర్ వరకు విస్తరించింది. జీడిమెట్ల పారిశ్రామికవాడ ఇటు బాలానగర్‌ను ఆనుకొని పదుల కిలోమీటర్లు విస్తరించింది. ఈ వాడల విస్తరణతో కాలుష్యసమస్య కూడా తీవ్రతరమైంది. ఉమ్మడి రాష్ట్రంలో పారిశ్రామిక కాలుష్యం, రసాయన వ్యర్థాల నిర్వహణపై నియంత్రణ, పర్యవేక్షణ లేకపోవడంతో భూగర్భజలాలు మొదలు జీవనది వరకు కాలుష్య కార్ఖానాలుగా తయారయ్యాయి. ఈ క్రమంలోనే పరిశ్రమలను ఔటర్ రింగు రోడ్డు అవతలికి తరలించాలనే ప్రతిపాదన, డిమాండు ఉమ్మడి ఏపీలో నుంచే ఉంది. ఆ మేరకు గతంలో కొన్ని ప్రయత్నాలు జరిగినా అవి పెద్దగా సఫలీకృతం కాలేదు.
పారిశ్రామిక ప్రగతి కోసమే ఫార్మాసిటీ
ఇప్పటికే ఉన్న పరిశ్రమలు విస్తరణకు సిద్ధమైనా.. కాలుష్యకోణంలో వాటికి అనుమతినిచ్చే పరిస్థితి లేదు. కొత్త పరిశ్రమలను ఇప్పుడున్న వాడల్లో ఏర్పాటు చేయడమూ వీలు కాదు. అందుకే కేసీఆర్ ప్రభుత్వం శాశ్వత పరిష్కారంగా ఫార్మా సిటీకి రూపకల్పన చేసింది. ఇందుకోసం సుమారు 20వేల ఎకరాల భూసేకరణ లక్ష్యంగా పెట్టుకున్నది. ఇందులో 14వేల ఎకరాలకు పైగా ఇప్పటికే సేకరించింది. 300కు పైగా కంపెనీలు పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొచ్చాయి. మొదటి దశ అనుమతులు కూడా వచ్చాయి. ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో జీరో డిశ్చార్జితో పరిశ్రమల ఏర్పాటుకు అవకాశం ఉన్నందున.. వాటన్నింటినీ ఒకేచోట ఏర్పాటు చేసి పకడ్బందీ పర్యవేక్షణ చేపట్టడం వల్ల కాలుష్య సమస్యను నియంత్రించేందుకు అవకాశం ఉంటుందని బీఆర్ఎస్ ప్రభుత్వం ఆశించింది. కానీ గత ఏడాది డిసెంబరులో అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కారు ఫార్మాసిటీపై పూటకో మాట… రోజుకో ప్రకటన చేసింది.
చివరకు హైకోర్టులో ఫార్మా సిటీ ఉంటుందని అంగీకరించింది. అయినప్పటికీ హైదరాబాద్ మహానగరం చుట్టూ ఔటర్ రింగు రోడ్డు-రీజినల్ రింగు రోడ్డు మధ్యలో ఫార్మా క్లస్టర్లు ఏర్పాటుకు నిర్ణయించింది. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని దుద్యాల-హకీంపేట-లగచర్ల-పోలేపల్లి వంటి ఏడు ప్రాంతాల్లో 1,376 ఎకరాల భూసేకరణకు సిద్ధమైంది. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం డప్పూర్, వడ్డీపూర్, మల్గి గ్రామాల పరిధిలో మరో ఫార్మా క్లస్టర్‌కు రంగం సిద్ధం చేశారు. నల్గొండ జిల్లాలోని చిట్యాల మండలంలో ఇంకో క్లస్టర్.. ఇలా మిగిలిన మహబూబ్‌నగర్, యాదాద్రి-భువనగిరి, మెదక్, సిద్దిపేట, రంగారెడ్డి… అన్ని జిల్లాల్లోనూ క్లస్టర్లను ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఒకో క్లస్టర్లో మూడు, నాలుగు ఫార్మా విలేజ్లను ప్రతిపాదిస్తున్నందున వాటి కోసం ఒక్కోచోట కనీసంగా రెండు వేల ఎకరాల భూసేకరణ అనివార్యమని అధికారులు చెబుతున్నారు. అంటే అన్ని జిల్లాల్లో మరో 20వేల ఎకరాలకు పైగా భూమిని సేకరించాల్సి ఉంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత సాగు విస్తీర్ణం గణనీయంగా పెరగడంతో పడావు పడిన భూములు లక్షలాది ఎకరాల్లో సాగుకు నోచుకున్నాయి. ఈ తరుణంలో ఏకంగా 20వేల ఎకరాల భూములను ఇవ్వడమంటే రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. పైగా క్లస్టర్లు ఏర్పడిన ప్రతిచోటా కాలుష్య భయం వారిని వెన్నాడుతుంది. దీంతో కొన్ని దశాబ్దాలుగా నగరం చుట్టూ అలుముకున్న కాలుష్యం ఇప్పుడు ఔటర్ చుట్టూ అలుముకునే సంకేతాలు కనిపిస్తున్నాయనే ఆందోళన వ్యక్తమవుతుంది.
సమస్య మళ్లీ మొదటికి
ఫార్మా సిటీ సాకారం అవుతుందనుకున్న తరుణంలో రేవంత్ సర్కారు వచ్చింది. సమస్య మళ్లీ మొదటికొచ్చింది. ఫార్మాసిటీని చిలువలు పలువలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి పాత పంథాలోనే అడుగులు వేస్తానంటుంది. ఫార్మాసిటీని కోల్డ్ స్టోరేజీలోకి పంపించి… హైదరాబాద్ మహానగరం చుట్టూ పది ఫార్మా క్లస్టర్లు ఏర్పాటు చేస్తానంటుంది. మళ్లీ వీటి కోసం ఇంకో 20వేల ఎకరాల భూసేకరణకు సిద్ధమైంది. అన్నిచోట్లా ఫార్మా కంపెనీల ఏర్పాటుకు నిర్ణయించిన సర్కారు…అసలు కాలుష్య అంశాన్ని పరిగణలోనికి తీసుకుంటుందా? ఇప్పటికే ఫార్మాసిటీ కోసం వేలాది ఎకరాలను త్యాగం చేసిన రైతులు ఉండగానే మరోవైపు అన్ని జిల్లాల్లోనూ వేలాది మంది రైతుల భూములను గుంజుకునేందుకు ప్రయత్నించడం అవసరమా? ఈ దిశగా రేవంత్ ప్రభుత్వం ఎందుకు ఆలోచించడంలేదు? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.