హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): ఆర్థిక నిర్వహణ అంటే.. ఆర్థిక వనరులను సమర్థంగా నిర్వహించే ప్రక్రియ. ఆర్థిక లక్ష్యాలను సాధించడం, ఆదాయాన్ని గణనీయంగా పెంచడం, వ్యయాలను తగ్గించడం, ఆర్థిక స్థిరత్వాన్ని మెరుగుపర్చడం, ఆర్థిక రిస్క్‌ను తగ్గించడం.. వీటిని పక్కాగా నిర్వహించింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం. పదేండ్ల పాలనలో ఆదాయ, వ్యయాలను అంచనా వేసింది. అవసరమైన శాఖలకు నిధులు కేటాయించి, ఆర్థిక లక్ష్యాలను సాధించింది. తలసరి ఆదాయాన్ని జాతీయ సగటును మించి పెంచింది. మిషన్ భగీరథ పథకం కింద పైప్లైన్ల ద్వారా ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు అందించింది. మిషన్ కాకతీయ పథకంతో చెరువులను బాగుచేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తాగు, సాగునీరు అందించి ఉత్తర తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసింది. సచివాలయం, కలెక్టరేట్లు, కమాండ్ కంట్రోల్ సెంటర్ వంటి భవనాలు నిర్మించింది. కొవిడ్ కష్టకాలాన్ని సైతం అధిగమించి అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టింది. ఈ క్రమంలో తొమ్మిదిన్నరేండ్ల కాలంలో కేసీఆర్ ప్రభుత్వం రూ.3,85,340 కోట్ల అప్పులు చేయాల్సి వచ్చింది. పదేండ్లలో చేసిన రుణఫలానికి అనేక గొప్ప ప్రాజెక్టులు, భవనాలు కండ్లముందు కనిపిస్తున్నాయి.
ఏడాదిలోపే రేవంత్ 77,118 కోట్ల అప్పు
రేవంత్‌రెడ్డి సర్కారు ఏడాది పాలన ముగియకముందే రూ.77,118 కోట్ల రుణభారాన్ని తెలంగాణ ప్రజలపై మోపింది. గత ఏడాది డిసెంబర్ 7న అధికారం చేపట్టిన నాటి నుంచి ఈ నెల 12 వరకు అంటే 341 రోజుల్లో రేవంత్‌రెడ్డి సర్కారు రూ.77,118 కోట్ల అప్పులు చేసింది. తెలంగాణ జనాభా సుమారు 4 కోట్ల కాగా, ఒక్కో బిడ్డ తలపై రూ.19,279 అప్పుల భారాన్ని కాంగ్రెస్ సర్కారు పెట్టింది. రేవంత్ సర్కారు ఒక్క రోజుకు రూ.226 కోట్లు, వారానికి రూ.1,562 కోట్లు, నెలకు రూ.6,780 కోట్ల రుణాలు సేకరిస్తున్నది. ఒక్క ఆర్బీఐ నుంచే 52,118 కోట్ల అప్పులు చేసిన రేవంత్ సర్కారు.. ఆ రుణాలు సరిపోక వివిధ కార్పొరేషన్లు, స్వయం ప్రతిపత్తి సంస్థలకు రూ.25 వేల కోట్ల మేర గ్యారెంటీలు ఇచ్చింది. ఏడాది పాలన పూర్తికాకముందే రూ.77,1188 కోట్ల అప్పు చేసిన కాంగ్రెస్ సర్కారు.. ఏడాదికి సుమారు రూ.1 లక్ష కోట్ల చొప్పున ఐదేండ్లలో రూ.5 లక్షల కోట్ల రుణం సమీకరించే అవకాశం ఉన్నట్టు ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్ సర్కారు తీసుకున్న రూ.77,118 కోట్ల అప్పుతో రాష్ట్రంలో ఒక కొత్త ప్రాజెక్టు కట్టింది లేదు.. ఒక్క ఇటుకనూ పేర్చింది లేదు.. అని నిఫుణులు విస్మయం వ్యక్తంచేశారు. ఒక్క కొత్త పథకం కూడా ప్రవేశపెట్టలేదని వాపోతున్నారు. కేసీఆర్ సర్కారు ఏడాదికి రెండుసార్లు రైతుబంధు ఇవ్వగా, రేవంత్ సర్కారు వానకాలం రైతుబంధు ఇప్పటికీ ఇవ్వలేదని గుర్తుచేస్తున్నారు.