హైదరాబాద్, మార్చి 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో అందరికీ నాణ్యమైన ఇవ్వాలంటే పటిష్టమైన పంపిణీ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. అందులో భాగంగా లో-వోల్టేజ్ సమస్య తలెత్తకుండా చూసేందుకు కొత్త సబ్స్టేషన్లు, లైన్లు నిర్మించాలి. ఇదే పనిని గత కేసీఆర్ సర్కార్ చేసి చూపింది. విద్యుత్తు పంపిణీకి బలమైన పునాదులు వేసింది. విద్యుత్తు వ్యవస్థను విస్తరించింది. అందుకే ఇప్పుడు రాష్ట్రంలో విద్యుత్తు పీక్ డిమాండ్ అమాంతం పెరిగినా, వినియోగం అత్యధిక స్థాయికి చేరినా ఆ నెట్వర్క్ తట్టుకుని నిలబడగలుగుతున్నది. 2014లో తెలంగాణ వ్యాప్తంగా వినియోగించిన రోజువారీ విద్యుత్తు 128 మిలియన్ యూనిట్లు మాత్రమే. ఇప్పుడు అది 341 మిలియన్ యూనిట్లు దాటినా గ్రిడ్ సవ్యంగా సేవలందించగలుగుతున్నది. అందుకు కేసీఆర్ సర్కార్ వేసిన పునాదులే కారణం. అవే ఇప్పుడు రాష్ట్ర విద్యుత్తు సంస్థలకు శ్రీరామరక్షలా నిలిచాయి. కానీ, ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ ఈ దిశగా ఆలోచన చేయడం లేదు. విద్యుత్తు పంపిణీ వ్యవస్థలను విస్తరించడం లేదు. ఈ నిర్లక్ష్యం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులొస్తాయని విద్యుత్తు రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
సమైక్య రాష్ట్రంలో వివక్ష..
రాష్ట్ర విభజనకు ముందు విద్యుత్తు రంగంలో తెలంగాణ తీవ్ర వివక్షకు గురైంది. విద్యుత్తు డిమాండ్‌కు తగినట్టు లైన్లు, సబ్స్టేషన్లు లేకపోవడం, మన దగ్గరే పుష్కలంగా బొగ్గు నిక్షేపాలున్నా థర్మల్ విద్యుత్తు కేంద్రాలు నిర్మించకపోవడంతో ఏ రంగానికీ సరిగా కరెంట్ అందేది కాదు. లో-వోల్టేజీతో వ్యవసాయ మోటర్లు కాలిపోయి పంటలకు నీళ్లు అందక రైతులు నిత్యం రోడ్డెక్కేవారు. రాత్రిపూట వ్యవసాయ మోటర్లను నడిపేందుకు వెళ్లి కరెంట్ షాకులు, పాముకాట్లు, తేలుకాట్లకు ఎందరో రైతులు బలైపోయారు. పవర్ హాలిడేస్‌తో పరిశ్రమలు వారంలో మూడు రోజులు పనిచేసేవి కావు. స్థూలంగా ఇదీ నాటి తెలంగాణ దైన్య స్థితి.
రూ.వేల కోట్లు వెచ్చించి పటిష్ట వ్యవస్థ
రాష్ట్ర విభజన తర్వాత ఈ ఈ దుస్థితికి తెరపడింది. తెలంగాణ సర్వతోముఖాభివృద్ధికి విద్యుత్తు రంగమే జీవనాడి అని గుర్తించిన కేసీఆర్ సర్కార్.. ఆ రంగం అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టింది. అందులో భాగంగా దాదాపు రూ.35 వేల కోట్లు వెచ్చించి విద్యుత్తు నెట్వర్క్, పంపిణీ వ్యవస్థను పటిష్టం చేసింది. కొత్త విద్యుత్తు ప్లాంట్ల నిర్మాణం, నెట్వర్క్ విస్తరణకు రూ.97,321 కోట్లు వెచ్చించింది. గృహ, వ్యవసాయ విద్యుత్తు వినియోగదారులకు సబ్సీడీ కింద బడ్జెట్లో రూ.50 వేల కోట్లు కేటాయించడం ద్వారా విద్యుత్తు సంస్థలకు సహకారం అందజేయడంతో రాష్ట్ర తలసరి విద్యుత్తు వినియోగం జాతీయ సగటు కంటే 70% పెరిగింది.
కాంగ్రెస్ పాలనలో కకావికలం
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక విద్యుత్తు వ్యవస్థ కకావికలమైంది. గత 28 నెలల పాలనలో 3 సబ్స్టేషన్ల నిర్మాణం మాత్రమే పూర్తయింది. వీటిలో 400 కేవీ, 220 కేవీ, 132 కేవీ సబ్స్టేషన్లు ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి. ఇదే సమయంలో కొత్తగా కేవలం 563 కి.మీ. లైన్లు మాత్రమే వేశారు. వరంగల్‌లో టెక్స్టైల్ పార్కుకు డెడికేటెడ్ సబ్‌స్టేషన్‌తోపాటు వరంగల్ హెల్త్‌సిటీ, హైదరాబాద్‌లోని మూడు టిమ్స్ దవాఖానలకు సబ్స్టేషన్లు ఏర్పాటు చేయాల్సి ఉన్నది. కానీ, ఆ దిశగా కాంగ్రెస్ సర్కార్ ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. కాళేశ్వరం ప్రాజెక్టులో మూడో టీఎంసీ ఎత్తిపోతకు అవసరమైన విద్యుత్తు వ్యవస్థ నిర్మాణాన్ని పెండింగ్‌లో పెట్టింది.
