హైదరాబాద్, జూలై 16 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. మంగళవారం అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను కలిసి జంపింగ్‌లపై చర్యలు తీసుకోవాలని కోరింది. ఇప్పటికే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై ఫిర్యా దు చేసిన బీఆర్ఎస్.. తాజాగా మరో 9 మంది పై ఫిర్యాదు చేసింది.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి,సంజయ్‌కుమార్, కాలే యాద య్య, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, ప్రకాశ్‌గౌడ్, అరికెపూడి గాంధీ, గూడెం మహిపాల్‌రెడ్డికి టీపీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పారు. వీరిపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఇప్పటికే స్పీడ్ పోస్టు, ఈ మెయిల్, వాట్సాప్ ద్వారా స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది.
అయినా మరోసారి స్వయంగా స్పీకర్‌ను కలిసి ఫిర్యాదు చేసింది. పార్టీ ఫిరాయించిన వారిపై 3 నెలల్లో చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పు చెప్పిందని స్పీకర్‌కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు గుర్తుచేశారు. దానం నాగేందర్‌పై మార్చిలోనే ఫిర్యాదు చేసినా ఇంత వరకు చర్య తీసుకోలేదని గుర్తు చేశారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడాలని కోరారు.
స్పీకర్‌గా తనకున్న అధికారాలను ఉపయోగించుకొని వారి పై అనర్హత వేటు వేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ చేస్తున్న అన్యాయమైన, అక్రమ చేరికల అంశాన్ని స్పీకర్ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం పార్టీ ఫిరాయింపుల అంశంలో 3 నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని ఉన్నదని.. ఇదే విషయాన్ని స్పీకర్‌కు గుర్తు చేశామని వెల్లడించా రు.
మణిపూర్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యే పార్టీ మారిన సంఘటనలో సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా ఆయనపై అనర్హత వేటు వేశారని, స్పీకర్ కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ పరిధిలోనే ఉన్నారని తెలిపారు. లేదంటే పదవికి అగౌరవంగా ఉంటుందన్న విషయాన్ని తెలియజేశామని చెప్పారు.మణిపూర్ ఎమ్మెల్యే విషయంలో స్పీకర్ 3 నెలల్లో గా నిర్ణయం తీసుకోకపోతే సుప్రీం జోక్యం చేసుకొని వారంలోగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌ను కోరిందని గుర్తుచేశామని వివరించారు.
రాజ్యాంగాన్ని కాపాడాలని రాహుల్ ఫోజులు
ఓ పక్క రాజ్యాంగాన్ని కాపాడుతామని ఢిల్లీలో రాహుల్‌గాంధీ ఫోజులు కొడుతున్నారని,రాష్ట్రంలో అదే కాంగ్రెస్‌పార్టీ అదే రాజ్యాంగాన్ని తుంగలో తొకేలా వ్యవహరిస్తున్నదని కేటీఆర్ మండిపడ్డారు. దేశంలోని ఇతర ప్రాంతాల్లో పార్టీ ఫిరాయింపుపై గగ్గోలుపెట్టే రాహుల్‌గాంధీ.. తెలంగాణలో మాత్రం ఫిరాయింపులను వెన్నుతట్టి మరీ ప్రోత్సహిస్తున్నారని ధ్వజమెత్తారు.
కర్ణాటకలో రూ.50 కోట్లకు ఒకో కాంగ్రెస్ ఎమ్మెల్యేను బీజేపీ కొనేందుకు ప్రయత్నిస్తున్నదని ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామ య్య ఆరోపించారని, మరి తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు ఎన్ని కోట్లు చేతులు మారుతున్నాయో పరిశీలించాలని స్పీకర్‌ను కోరినట్టు తెలిపారు. కాంగ్రెస్ అభ్యర్థులు పార్టీ మారబోమని గోవాలో రాహుల్‌గాంధీ శపథం చేయించిన సందర్భాన్ని కూడా గుర్తుచేశామని వివరించారు.
స్పీకర్ స్వయంగా ఓ టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఒక పార్టీపై గెలిచిన అభ్యర్థులు ఇంకో పార్టీలోకి వెళ్లొద్దనే అంశాన్ని స్పష్టం చేశారని, ఆయన గొప్ప ఆలోచన విధానాన్ని అభినందిస్తున్నట్టు తెలిపామని వెల్లడించారు. ఇంటర్వ్యూల్లోనే కాకుండా తాము ఇచ్చిన ఫిర్యాదుపైనా చర్య లు తీసుకోవాలని కోరినట్టు చెప్పారు. స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే సుప్రీంకోర్టు వెళ్తామని స్పష్టం చేశారు.
మా ఎమ్మెల్యేలకు ప్రాణభయం
రేవంత్‌రెడ్డి పాలనలో దుర్మార్గమైన పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయని,పార్టీ మార ని తమ పార్టీ ఇద్దరు మ్మెల్యేలకు స్థానికంగా ఉండే ఇద్దరు డీఎస్పీలు ఫోన్‌చేసి మీకు ప్రాణ భయం ఉన్నదనే విషయాన్ని పరోక్షంగా హెచ్చరించారని కేటీఆర్ అన్నారు. ప్రాణగం డం ఉందని పార్టీ మారేలా ఒత్తిడి తెస్తూ బెదిరిస్తున్నారని, మరి కొంతమంది ఎమ్మెల్యేల వ్యాపారాలపై దాడులు చేస్తామని హెచ్చరిస్తున్నారని ఆరోపించారు.
తమ పార్టీ ఎమ్మెల్యేలు మర్రి రాజశేఖర్‌రెడ్డి, మల్లారెడ్డి ఆస్తులు, భవనాలపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. టౌన్‌ప్లానింగ్ అధికారులు కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారాలున్న ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి బెదిరిస్తున్నారని వెల్లడించారు. స్పీకర్‌ను కలిసిన వారిలో మాజీమంత్రులు పద్మారావు, సునీతాలక్ష్మారెడ్డి, సబితాఇంద్రారెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, కల్వకుంట్ల సంజయ్, చింత ప్రభాకర్, కాలేరు వెంకటేశ్,ముఠా గోపాల్, మాధవరం కృష్ణారా వు, మర్రి రాజశేఖర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయండి
బీఆర్ఎస్ టికెట్‌పై గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీశ్‌రావు, ఇతర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న అసెంబ్లీ పరిధిలో అభివృద్ధి ఆగిపోయిందని, దీనిపై ప్రశ్నిస్తే అధికారులతో కేసులు పెట్టిస్తున్నారని ఆరోపించారు. అల్వాల్ సర్కిల్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపితే కమిషనర్ కేసు పెట్టారని గుర్తు చేశారు. మౌలాలిలో కాంగ్రెసోళ్లు దాడికి యత్నించారని స్పీకర్‌కు ఫిర్యాదు చేశామని, దీనిపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ మల్కాజిగిరి డీసీపీని ఆదేశించారని తెలిపారు.