హైదరాబాద్, మే 2 (నమస్తే తెలంగాణ): ఉన్నత విద్య చదువుకొనే పేద విద్యార్థులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన జీవో-7ను వెంటనే ఉపసంహరించుకోవాలని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు. గతంలో మాదిరిగానే ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని కొనసాగించాలని సూచించారు. రూ.10 వేల కోట్ల ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జీవో-7 ద్వారా నిరుపేద కుటుంబాలను ఆర్థికంగా దెబ్బ తీసేలా సీఎం వ్యవహారం ఉన్నదని మండిపడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని కేసీఆర్ మెరుగ్గా కొనసాగించారని, రేవంత్‌రెడ్డి ఎందుకు కొనసాగించడం లేదని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్లో చేరిన అనంతరం ఆయన తొలిసారిగా శనివారం తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడారు.
‘వచ్చే రెండేండ్లలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తరపున ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి ఉంటరో, ఆయన ప్రత్యర్థులు ఉంటరో.. ఇంకా రెండేండ్లు ఈ ప్రభుత్వాన్ని భరించాలి’ అంటూ జీవన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి దొర.. ఏమంత మెరుగైన పాలన అందిస్తున్నడు అని ప్రశ్నించారు. పెట్టుబడి తప్ప ఆయనకేమీ కనిపించదని దుయ్యబట్టారు. రేవంత్‌కు ఫోర్త్త్సిటీ, హైడ్రా తప్ప ఇంకొకటి కనిపించదని మండిపడ్డారు.
రాష్ట్రంలో నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని శాసనసభ వేదికగా చెప్పినా ఇంతవరకు అమలుకాలేదని జీవన్‌రెడ్డి మండిపడ్డారు. రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదని, కేవలం 17 వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారని విమర్శించారు. జాబ్ క్యాలెండర్ ఎంతవరకు వచ్చిందని నిలదీశారు. రాష్ట్రంలో రేవంత్‌రెడ్డిని ఎవరూ నమ్మరనే వరంగల్‌లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీతో రైతు డిక్లరేషన్ ప్రకటన ఇప్పించారని, జాబ్ క్యాలెండర్ కోసం అశోక్‌నగర్‌కు తీసుకొచ్చారని జీవన్‌రెడ్డి వివరించారు. కానీ, ఇప్పుడు రాహుల్‌గాంధీ అశోక్‌నగర్‌కు వస్తారా? రాష్ట్రంలో రైతులకు ఏ లాభం జరిగిందో, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో రాహుల్‌కు తెలియదా? అని ప్రశ్నించారు.
రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీయేనని, ముఖ్యమంత్రి అయ్యేది కేసీఆరే అని జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. ‘రేవంత్‌రెడ్డి పోవాలి.. కేసీఆర్ రావాలి..’ అనేది ప్రజల్లో వస్తున్న నినాదమని, ఇక ఎవరూ ఆపలేరని స్పష్టంచేశారు. కాంగ్రెస్ పార్టీకి 1994లో పట్టిన గతే పడుతుందని, ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా రాకుండా పోతుందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మూలం విద్య అని, అందుకే తెలంగాణ ఉద్యమం వచ్చిందని వివరించారు. అందుకే స్వరాష్ట్రం ఏర్పాటైన తర్వాత విద్య, వైద్యం అందించాలని కేసీఆర్ ఆలోచన చేశారని పేర్కొన్నారు. కేసీఆర్ టిమ్స్ దవాఖాన ఏర్పాటు చేశారని, త్వరలోనే అది అందుబాటులోకి వస్తుందని చెప్పారు. సమావేశంలో బీఆర్ఎస్ నేత అల్లీపురం వెంకటేశ్వరరెడ్డి పాల్గొన్నారు.