హైదరాబాద్, అక్టోబర్ 9 (నమస్తేతెలంగాణ): ‘42 శాతం రిజర్వేషన్లు ఇస్తామన్న కాంగ్రెస్ సర్కారు బీసీలకు ద్రోహం చేసింది.. చెల్లని జోవో ఇచ్చి నమ్మించి వంచించింది’ అని మాజీ మంత్రి గంగుల కమలాకర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాజ్యాంగ సవరణతోనే బీసీ రిజర్వేషన్ల పెంపు సాధ్యమనే విషయాన్ని విస్మరించి కాంగ్రెస్ సర్కార్.. నమ్మించి గొంతు కోసిందని నిప్పులు చెరిగారు. సర్కారు తప్పుదారిలో వెళ్తుందని, ఆర్డినెన్స్, జీవోలు కోర్టులో నిలబడవని అసెంబ్లీలో తామిచ్చిన సూచనలను పిల్లి శాపనార్థాలంటూ ఆనాడు సీఎం, మంత్రులు అపహాస్యం చేశారని గుర్తుచేశారు.
ఇప్పుడు హైకోర్టు స్టేను సాకుగా చూపుతూ బీఆర్ఎస్పై నెపం నెట్టి తప్పించుకునేందుకు యత్నిస్తున్నదని దుయ్యబట్టారు. రాహుల్ ప్రధాని అయిన తర్వాతే 42 శాతం కోటాకు చట్టబద్ధత వస్తుందని ఢిల్లీలో చెప్పిన రేవంత్‌రెడ్డి.. బీసీ సమాజాన్ని తప్పుదోవ పట్టించేందుకు జీవో ఇచ్చి మరో డ్రామాకు తెరలేపారని విమర్శించారు. ‘ఇప్పటికైనా ఆయనకు బీసీ బిల్లులపై చిత్తశుద్ధి ఉంటే నాటకాలను కట్టిపెట్టి ఢిల్లీకి కదలాలి.. వెంటవచ్చేందుకు మేమూ సిద్ధమే’ అని స్పష్టం చేశారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, బీఆర్ఎస్ నాయకులు కురువ విజయ్‌కుమార్, శుభప్రద్‌పటేల్‌తో కలిసి గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.
అసెంబ్లీ ఎన్నికల ముందు కామారెడ్డి డిక్లరేషన్‌లో కాంగ్రెస్ బీసీలకు అలవికానీ హామీలిచ్చి ఇప్పుడు మోసం చేస్తున్నదని ధ్వజమెత్తారు. బీసీ బిల్లులను అసెంబ్లీలో ఆమోదించి తూతూ మంత్రంగా రాష్ట్రపతికి పంపిందని ఆరోపించారు. ఆమోదం కోసం ఏనాడూ చిత్తశుద్ధితో ప్రయత్నించలేదని విమర్శించారు. 56 సార్లు ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి.. ఏ ఒక్కరోజూ బీసీ రిజర్వేషన్లను తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలని కేంద్రాన్ని ఎందుకు అడగలేదు? అఖిలపక్షాన్ని ఎందుకు తీసుకెళ్లలేదు? అని ప్రశ్నించారు. 1992లో తమిళనాడు సీఎం జయలలిత ఢిల్లీకి వెళ్లి పట్టుబట్టి, కేంద్రం మెడలు వంచి బీసీ రిజర్వేషన్లను సాధించారని గుర్తుచేశారు. కానీ సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం ఏనాడూ నిబద్ధతతో వ్యహరించలేదని, ఏ ఒక్కరోజూ అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లలేదని చెప్పారు.
బీసీ రిజర్వేషన్లపై బీఆర్ఎస్ ఏనాడు దాగుడుమూతలు ఆడలేదని గంగుల కమలాకర్ స్పష్టంచేశారు. రాజ్యాంగ సవరణ ద్వారానే సాధ్యమని అసెంబ్లీలోనూ, ప్రజాక్షేత్రంలోనూ చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. జీవోలు, ఆర్డినెన్స్‌లు చెల్లబోవని ఎప్పటి నుంచో హితబోధ చేస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. కేసీఆర్ సూచనల మేరకు తమిళనాడు వెళ్లి అధ్యయనం చేసి వచ్చామని గుర్తుచేశారు. గతంలో మహారాష్ట్ర, బీహార్ రాష్ట్రాల మాదిరిగా పొరపాట్లు చేయొద్దని ప్రభుత్వానికి సూచించామని పేర్కొన్నారు. కానీ పిల్లి శాపనార్థాలు పెడుతున్నారని, బీసీలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఇదే కాంగ్రెస్ పెద్దలు తమను దెప్పిపొడిచారే తప్పా తమ సలహాలను పరిగణనలోకి తీసుకోలేదని వివరించారు. అందుకే ఇప్పుడు కోర్టుల్లో కొట్టేసే పరిస్థితి వచ్చిందని చెప్పారు.
ఇది ముమ్మాటికీ కాంగ్రెస్ సర్కార్‌దే బాధ్యతని తేల్చిచెప్పారు. ఒక్క జీవోతోనే రిజర్వేషన్లు సాధ్యమైతే 22 నెలలు ఎందుకు ఆగారని గంగుల కమలాకర్ నిలదీశారు. ఇప్పటికైనా ఎన్నికల నిర్వహణకు తొందరపడకుండా బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. బీసీలు అన్యాయాైన్నెనా సహిస్తారు గానీ, అవమానాన్ని సహించబోరని హెచ్చరించారు. సీఎం రేవంత్‌రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీకి వెళ్లి రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించిన తర్వాతే హైదరాబాద్‌కు రావాలని సవాల్ విసిరారు. వెంటనే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి ఈ అంశంపై ఐదు రోజులు చర్చించాలని డిమాండ్ చేశారు. ఒక్క శాతం కోటాకు వెనక్కిపోయినా జరగబోయే పరిణామాలకు బాధ్యత వహించాల్సి ఉంటుందని తీవ్రస్థాయిలో హెచ్చరించారు.
బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ తప్పుడు విధానాలు అవలంబించిందని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆరోపించారు. బీసీ కోటాపై ‘ఆపరేషన్ సక్సెస్.. పేషెంట్ డెడ్’ అన్న చందంగా కాంగ్రెస్ వైఖరి ఉన్నదని తూర్పారబట్టారు. బీసీ బిల్లులను రాష్ట్రపతికి పంపించి చేతులు ముడుచుకొని కూర్చున్నారే తప్ప.. ఏనాడూ ఆ పార్టీ సభ్యులు పార్లమెంట్లో ప్రస్తావించనేలేదని మండిపడ్డారు. ఢిల్లీకి వెళ్లి జంతర్‌మంతర్ దగ్గర దీక్షల పేరిట డ్రామాలాడారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్, బీజేపీ కలిస్తేనే చట్టబద్ధత సాధ్యమని తెలిసినా పూటకో మాట చెప్పి బలహీనవర్గాల బిడ్డలను ఆగం చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇప్పటికైనా బీసీ కోటాకు చట్టబద్ధత కల్పించాలని, లేదంటే బీసీల ఆగ్రహజ్వాలాల్లో కాంగ్రెస్ సర్కారు మాడిమసైపోతుందని హెచ్చరించారు.
కామారెడ్డి డిక్లరేషన్‌ను నమ్మి ఓటేసిన పాపానికి బీసీల నోట్లో కాంగ్రెస్ సర్కారు మట్టిగొట్టిందని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగానికి పాతరేసి రేవంత్‌రెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని విరుచుకుపడ్డారు. ఇంతకాలంగా 42 శాతం కోటా పేరిట భ్రమలు కల్పించి ఇప్పుడు నట్టేటా ముంచిందని విమర్శించారు. జీవో ఇచ్చి న్యాయపరమైన చిక్కులకు అవకాశం కల్పించిందని ధ్వజమెత్తారు. నిబద్ధత, నిజాయతీ ఉంటే రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. మంత్రులు, నాయకులు కోర్టుకు వెళ్లి బలప్రదర్శనకు దిగడం దుర్మార్గమని పేర్కొన్నారు. బీసీల ఓట్లు కొల్లగొట్టేందుకు కాంగ్రెస్ నేతలు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. మోసం చేసిన కాంగ్రెస్‌పై బీసీ సమాజం తిరగబడాలని పిలుపునిచ్చారు.
రాహుల్‌గాంధీని ఖుషీ చేసేందుకు, కుర్చీలను కాపాడుకొనేందుకు సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు డ్రామాలకు తెరలేపారని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ ధ్వజమెత్తారు. రాష్ట్రపతి, గవర్నర్ వద్ద బీసీ బిల్లులు పెండింగ్‌లో ఉండగా జీవో ఎలా తెచ్చారని ప్రశ్నించారు. మహారాష్ట్ర ఎన్నికలప్పుడు కులగణన, ఇప్పుడు బీహార్ ఎన్నికల కోసం జీవో 9ను జారీ చేసి డ్రామాలాడారని నిప్పులు చెరిగారు. బీసీ కోటాపై స్టే వస్తుందని తెలిసినా బీసీ మంత్రులను ముందుంచి కోర్టులో నాటకాన్ని రక్తి కట్టించారని విమర్శించారు. బీసీ రిజర్వేషన్లపై పిటిషన్ వేసింది కాంగ్రెస్ నాయకులు కాదా? ఆత్మసాక్షిగా చెప్పాలని నిలదీశారు. నకిలీ జీవోలు తెచ్చి బీసీలు, అగ్రవర్ణాల మధ్య కాంగ్రెస్ సర్కారు వైషమ్యాలు సృష్టిస్తున్నదని ఆరోపించారు. ఇప్పటికైనా చిత్తశుద్ధితో ముందుకెళ్లి 42 శాతం కోటా సాధించాలని డిమాండ్ చేశారు. బీసీలను మోసం చేస్తున్న కాంగ్రెస్‌కు తగిన బుద్ధిచెప్తామని స్పష్టంచేశారు. పార్టీ అధినేత కేసీఆర్‌తో చర్చించి కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు.