హైదరాబాద్, జూన్ 12 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీకి ఈ ఏడాది చివరిలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో మూడోసారి మళ్లీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావటమే లక్ష్యంగా పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ తనదైన వ్యూహ చతురతతో ముందుకు సాగుతున్నారు. ఈ నెలలో 9 రోజుల్లో బీఆర్ఎస్ నిర్వహించిన 4 బహిరంగ సభల్లో పార్టీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేస్తూనే బీఆర్ఎస్ పాలనలో జరిగిన మేలును ప్రజల ముందు ఉంచుతున్నారు.
బీఆర్ఎస్ తన 9 ఏండ్ల పాలనలో తెలంగాణ ముఖచిత్రాన్ని ఏవిధంగా మార్చిందో.. దాని వెనక ఉన్న తపనను ఆవిష్కరిస్తున్నారు. అదే సమయంలో విపక్షాలు చేస్తున్న అసత్య ఆరోపణల ఆంతర్యాన్ని కేసీఆర్ తనదైన శైలిలో ప్రజలకు వివరిస్తున్నారు. కేవలం 9 రోజుల్లో సీఎం కేసీఆర్ ఉత్తర, దక్షిణ తెలంగాణను చుట్టివచ్చారు. నిర్మల్ బహిరంగసభలో ఆదివాసీ, పట్టణప్రాం త ప్రజల సమస్యల పరిష్కారానికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో వివరించారు. నాగర్‌కర్నూల్ బహిరంగసభలో ఉమ్మడి పాలమూరులో నాడు గంజి కేంద్రాలు వెలసినచోట పంట కొనుగోలు కేంద్రాలు రావటానికి బీఆర్ఎస్ సర్కార్ పడిన తపనను వివరించారు. అలాగే మంచిర్యాలలో నిర్వహించిన బహిరంగసభలో రూ.700 కోట్లను సింగరేణి కార్మికులకు బోనస్ రూపం లో అందించబోతున్న తీపి కబురును చెప్పారు. దివ్యాంగులకు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రస్తుతం అందిస్తున్న ‘ఆసరా’ పింఛన్‌ను మరో వెయ్యి పెంచుతామని, అది వచ్చే నెల నుంచే అమల్లోకి తెస్తామని సీఎం ప్రకటించారు. ఇలా 4 భారీ బహిరంగసభల్లో ఇప్పటి దాకా ప్రభుత్వం చేసిన పనులను వివరిస్తూనే విపక్షాల ఆరోపణలపై నిప్పులు చెరిగారు. ఈ నాలుగు సభల్లో జన ప్రభంజనం బీఆర్ఎస్ మూడోసారి అధికారంలోకి రావటాన్ని ఎవరూ ఆపలేరని తేల్చిచెప్పింది.
ఆపద మొక్కులకు ఆగం కావద్దు
పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఇటీవల జడ్చర్లలో చేసిన వ్యాఖ్యలపై 4 బహిరంగ సభల్లో సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశా రు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణిని బంగాళాఖాతంలో కలుపుతాం అని రేవంత్ చేసిన వ్యాఖ్యల వెనుక ఉన్న ఆంతర్యాన్ని ప్రజలకు వివరించారు. ధరణి వల్ల కలిగిన ప్రయోజనాలను ప్రత్యేకించి రైతులకు రైతుబంధు, రైతుబీమా, పంట కొనుగోలుకు ధరణి ఏ రకంగా దోహదం చేస్తున్నదో విస్తృతంగా గ్రామాల్లో చర్చపెట్టాలని ప్రజల్లో ఆలోచనలు రేకెత్తించారు. ఆపద మొక్కులు మొక్కి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ గతానుభవాలను ప్రజల ముందు ఉంచారు. అదే సమయంలో కేంద్రంలో బీజేపీ అప్రజాస్వామిక విధానాల వల్ల దేశానికి జరుగుతున్న నష్టాన్ని వివరించారు.
ఫలిస్తున్న బీఆర్ఎస్ ద్విముఖ వ్యూహం
తొమ్మిదేండ్లలో బీఆర్ఎస్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఆవిష్కరించటం, ప్రభుత్వంపై విపక్షాలు చేస్తున్న విమర్శలకు దీటుగా బదులు ఇవ్వటం ద్వారా ఇటు గులాబీ శ్రేణులను సన్నద్ధం చేయటం, మరోవైపు ప్రజల్లో విపక్షాలు నాటుతున్న అనుమానాల్ని పటాపంచలు చేయటమనే కేసీఆర్ ద్విముఖ వ్యూహం ఫలిస్తున్నది. సీఎం కేసీఆర్ వేస్తున్న మెరుపు అడుగులకు రాష్ట్రంలోని కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు దిక్కుతోచని వాతావరణం నెలకొన్నది. రేవంత్‌రెడ్డి రేపిన ధరణి చిచ్చు ఇద్దరు నాయకులు, ఇరవై శిబిరాలుగా ఉన్న కాంగ్రెస్ పార్టీని కకావికలం చేస్తున్నది.