వీర్నపల్లి, మార్చి 19 : ఎండిపోతున్న పంటలను కాపాడేందుకు రైతన్నకు అండగా బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లిలో బీఆర్ఎస్ నేతలు బుధవారం నిరసనకు దిగారు. మద్దిమల్ల రాయినిచెరువు నుంచి వీర్నపల్లి వరకు బైక్‌ర్యాలీ చేశారు. రైతులతో సంతకాల సేకరణ చేపట్టి, అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. పాదయాత్రగా తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి, సిబ్బందికి వినతిపత్రం ఆందజేశారు. ఆందోళనలో కేడీసీసీబీ చైర్మన్ కొండూరు రవీందర్రావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య పెద్దఎత్తున కార్యకర్తలు,రైతులు పాల్గొన్నారు.
ధర్మారం, మార్చి 19: నంది రిజర్వాయర్‌లో నీటి నిల్వఉంచాలని జలాశయం సమీపంలోని ఎల్లంపల్లి పంప్‌హౌస్ వద్ద పెద్దపల్లి జిల్లా నందిమేడారం రైతులు నిరసన తెలిపారు. నీటిమట్టం తగ్గడం వల్ల వరి పొలాలు ఎండిపోతున్నాయని వాపోయారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు ఇంజినీరింగ్ అధికారులు రైతులతో ఫోన్లో మాట్లాడినా ఆందోళన విరమించలేదు. అన్నదాతల ఆందోళనకు బీఆర్ఎస్ నాయకులు సంఘీభావం తెలిపారు. అప్రమత్తమైన అధికారులు వేంనూర్ పంప్‌హౌస్ రెండో మోటర్ ఆన్‌చేసి రిజర్వాయర్కి మరో 247 క్యూసెక్కులు వదిలారు. నీటిని ఒకే పైపులైన్ ద్వారా తరలిస్తామని అధికారులు చెప్పడంతో రైతులు శాంతించారు.
మూడెకరాల వరి పంటకు అరవై వేలదాక పెట్టుబడి పెట్టిన. వరి మంచిగున్నది. సేను అంతా ఈనింది. కానీ, బాయిల నీల్లు ఎల్లుతలేవు. అప్పులు తెచ్చి ఎవసం జేత్తున్న. రెండు లక్షల రూపాయల దాక ఈసారి పంట పండుతదని అనుకున్న. నీల్లు ఎల్లక మా బతుకులు ఆగమైనయి. ఈ సారి సేను అంత ఎండిపోయింది. ఇక ఈనిన వరిల గొడ్లను మేపుతున్నం. గౌరవెల్లి ప్రాజెక్టు కాలువలు నిర్మించి నీళ్లు ఇస్తే మా పంటలు ఎండిపోయేటివి కావు. గా కాంగ్రెస్ సర్కారు గౌరవెల్లి ప్రాజెక్టు జల్ది పూర్తిజెయ్యాలె. మాకు కాలువల నీళ్లు వస్తనే పంటలు పండుతయి.
పాలమూరు జిల్లా జమిస్తాపూర్‌కు చెందిన రైతు గొల్ల కనకయ్య మూడెకరాల్లో వరి సాగు చేశాడు. పెట్టుబడికి రూ.55 వేలు ఖర్చు చేశాడు. సమీపంలోనే చెరువు ఉందన్న నమ్మకం.. బోరులో నీళ్లు బాగా ఉన్నాయని సాగు మొదలుపెట్టాడు. కానీ చెరువులో నీటిమట్టం తగ్గిపోవడంతో బోరుపై ప్రభావం పడింది. బోరులోనూ నీళ్లు తగ్గాయి. రూ.50 వేలు అప్పు చేసి 550 ఫీట్లు బోరు డ్రిల్లింగ్ చేయించినా చుక్క నీరు రాలే. దీంతో నీళ్లు అందక వరి ఎండి పశువుల పాలైంది.