నేటి దేశ రాజకీయాల్లో నాయకుడే సర్వం అనే ట్రెండ్ కొనసాగుతున్నది. నాయకులే రాజకీయ ఎజెండాను నిర్దేశిస్తున్నారు. పరిపాలన నుంచి మొదలుకొని ఎన్నికల్లో గెలుపోటముల వరకు అన్నీ నాయకుడే!. బెంగాల్లో మమతా బెనర్జీ అయినా, ఢిల్లీలో కేజ్రీవాల్ అయినా, తమిళనాడులో స్టాలిన్ అయినా, కేరళలో విజయన్ అయినా, ఏపీలో జగన్ అయినా ఆయా రాష్ర్టాల రాజకీయమంతా వారి చుట్టూనే తిరుగుతున్నది. విమర్శలు, ప్రతివిమర్శలు, నిందలు, నేరారోపణలు, రాజకీయ వేధింపులు.. అన్నీ వీరి సెంట్రిక్‌గానే సాగుతున్నాయి. వీరు లేకుండా రాష్ట్రంలో రాజకీయం లేదు. స్వపక్షమైనా, విపక్షమైనా వీరి నామస్మరణ లేకుండా ఒక్క రోజు కూడా గడువదు. రాజకీయాల్లో హుందాతనం నశించి.. నేలబారుతనం పెరిగినా వివిధ పక్షాలు వీరిని నమిలేద్దామన్నంత కుట్రలు పన్నినా.. ప్రజల్లో వీరిపై ఆదరణ చెక్కుచెదరడం లేదు.
ఒక వ్యక్తి ఇంతటి అసాధారణ శక్తి సాధించడం ఆషామాషీ ఏం కాదు. వీరేం అర్ధరాత్రి బుద్ధి పుట్టి, తెల్లారి రాజకీయాల్లోకి రాలేదు. నాలుగు డబ్బులు పోగేసుకొని రాజకీయాలు చేయలేదు. ఈ నాయకులంతా ప్రజల ముందు తమకంటూ ఒక ఐడెంటిటీ సాధించుకొని, ఆ పునాది మీద తమ ఇమేజ్ను అంచెలంచెలుగా పెంచుకున్నారు.
తెలంగాణలో కేసీఆర్ ఉద్యమకాలంలో తెలంగాణకు పర్యాయపదంలా మారడమే ఆయన ప్రధాన ఐడెంటిటీ. కానీ ఆ తర్వాత పరిపాలనలో సంక్షేమాన్ని, వ్యవసాయరంగాన్ని అద్భుతంగా తీర్చిదిద్ది చేతికి ఎముక లేని అసామాన్యుడనే పేరు సాధించుకున్నారు. అదే ప్రజల హదయాల్లో ఆయనను ఉన్నతంగా నిలబెట్టింది. ఆ రోజులు స్వర్ణయుగమని ప్రజలు కీర్తించారు. ఇవాళ ప్రజలు ఏ కష్టం వచ్చినా కేసీఆర్‌ను తలుచుకుంటున్నారంటే అది ఆయన స్వయంకృషి మాత్రమే. ఓ నలుగురిని పోగేసుకొని జిందాబాద్‌లు కొట్టించుకోవడం కాదు.
రాజకీయాలైనా.. ఎన్నికలైనా అధికారం కోసం అర్రులుచాచే ప్రధాన పార్టీలు ఏ నాయకుడిని తమ ప్రత్యర్థిగా భావిస్తున్నాయనేదే కీలకం. అతడే అసలైన ప్రజానాయకుడు! మిగిలిన వాళ్లంతా ఉపపాత్రలు.. ఉత్తుత్తి పాత్రలు!! ప్రజల కోసం రాజకీయం చేసిన వారిని పదవులు అవే వరించాయి. పదవుల కోసమే రాజకీయం అనుకున్న వారికి ప్రజలే కర్రుకాల్చి వాత పెట్టారు. అందుకే ప్రజాదరణ కలిగిన నాయకుడు కేంద్రంగానే రాజకీయాలు పరిభ్రమిస్తుంటాయి అనడానికి దేశ రాజకీయాల్లో అనేక ఉదాహరణలు ఉన్నాయి.
కాంగ్రెస్‌నే తీసుకుంటే.. పార్టీ ఇందిరను బహిష్కరిస్తే ఆమె కాంగ్రెస్ ఐ పార్టీ పెట్టుకున్నారు. ప్రజలు ఆ పార్టీనే ఆదరించారు. కారణం ఇందిరపై అభిమానం. ఇక కమ్యూనిస్టు పార్టీలైతే ఏబీసీడీల్లో ఎన్ని అక్షరాలున్నాయో అన్నిసార్లు విడిపోయాయి. చివరకు ఇద్దరు ప్రధాన నాయకుల ఆధ్వర్యంలోని రెండు పార్టీలు మాత్రమే మిగిలాయి. అందున ఆనాడు జ్యోతిబసు, ఇప్పుడు విజయన్ మాత్రమే ప్రజల దృష్టిలో పాలకులుగా నిలువగలిగారు. ఇవాళ బీజేపీగా పిలిచే పార్టీ ఒకనాడు జనసంఘ్. తర్వాత జనతాపార్టీ. ఎన్నిసార్లు చీలినా పార్టీ మొత్తం వాజపేయి వెంట నడిచింది. ఆయన కేంద్రంగానే పార్టీ పుట్టి, పెరిగి దేశాన్ని ఏలే స్థాయికి వచ్చింది. ఇక్కడ ప్రజలు ఆనాడు వాజపేయిని, ఇప్పుడు మోదీని మాత్రమే చూశారు తప్ప పార్టీని పెద్దగా పట్టించుకోలేదు. ఎన్టీఆర్ టీడీపీని చీల్చిన నాదెండ్ల ప్రజాస్వామ్య తెలుగుదేశం పార్టీ పెట్టారు. అయితే ప్రజలు ఎన్టీఆర్ వెంటే నడిచారు.
బీఆర్ఎస్ విషయానికి వస్తే పార్టీ తొలినాళ్లలో రైతునాగలి, బస్సు తదితర గుర్తులతో పోటీ చేసింది. ప్రతి ఎన్నికకూ గుర్తు మారిపోయేది. అయితే ఎన్నిసార్లు ఎన్ని గుర్తులు మారినా ప్రజలు కేసీఆర్ వెంటే నడిచారు. అంటే పార్టీలు, గుర్తులు అని కాకుండా నాయకుల సామర్థ్యం, వారి చరిత్రను మాత్రమే ప్రజలు చూస్తున్నారు. అనేక మంది అంగుష్ట మాత్రులు, పౌండ్రక వాసుదేవులు తాము అంతటివారమేనని విర్రవీగి అధినేతలను అనుకరించాలనుకొని భంగపడటం దేశ రాజకీయాలకు కొత్తేమీకాదు.ఏ పార్టీకైనా సిద్ధాంతాలు, క్యాడర్ కూడా ముఖ్యమే అయినప్పటికీ, నేటి రాజకీయాల్లో క్రౌడ్‌పుల్లర్, ఓట్ గెయినర్ మాత్రం నాయకుడే అని చెప్పకతప్పదు.
ప్రజా సుఖే సుఖం రాజ్ఞః ప్రజానాం చ హితే హితం!
నాత్మ ప్రియం హితం రాజ్ఞః ప్రజానాం తు ప్రియం హితం!!
హనుమకొండ, ఏప్రిల్ 25(నమస్తే తెలంగాణ ప్రతినిధి)/(స్పెషల్ టాస్క్బ్యూరో): దేశంలో ఇప్పుడు కొత్త ట్రెండ్ నడుస్తున్నది. పార్టీల కన్నా నాయకుల చుట్టే ఇప్పుడు రాజకీయమంతా తిరుగుతున్నది. ప్రజలు కూడా ఆ నాయకులనే నమ్ముతున్నారు. ప్రత్యర్థి పార్టీలకు, రాజకీయ శత్రువులకు టార్గెట్ కూడా ఆ నాయకుడే. ఎన్నికల్లో గెలిపించినా, ఓడించినా భారం అంతా ఆ లీడర్‌దే. ప్రత్యర్థుల విమర్శలు, ఆరోపణలకు కేంద్రం ఆ నాయకుడే. ఎన్నికలు, పరిపాలన, రాజకీయం, సంక్షేమం, అభివృద్ధి.. ఎన్నికల అజెండా ఏదైనా సరే ప్రజలు ముందుగా చూసేది విశ్వసనీయతకు కేరాఫ్‌గా నిలిచే ఆ నాయకుడినే. ప్రజలకు తాము మెచ్చిన నాయకుడు ఏది చెప్తే అదే అంతా!
సమైక్య రాష్ట్రంలో అరవై ఏండ్లపాటు ఉనికి కోల్పోయిన తెలంగాణకు.. ప్రత్యేక రాష్ట్రంలో పాలన చేపట్టిన కేసీఆర్ కుదేలైన ప్రతీ రంగాన్ని వనరులు, శక్తి కూడదీసుకొని సగర్వంగా నిలబెట్టారు. తెలంగాణలోని ప్రత్యేక పరిస్థితులు, సమస్యలు, వసతులు, పల్లెలు, పట్టణాలు, సామాజిక, ఆర్థిక స్థితిగతులను సమగ్రంగా అధ్యయనం చేసి అందుకు అనుగుణంగా సమ్మిళితాభివృద్ధిని సాధించారు. అలా తొమ్మిదిన్నరేండ్ల బీఆర్ఎస్ పాలనలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానానికి ఎగబాకింది. అయితే, ఆరు గ్యారెంటీల అబద్ధపు హామీలతో పగ్గాలు చేపట్టిన రేవంత్ ప్రభుత్వంలో తెలంగాణ ఇప్పుడు తెర్లయ్యింది. రెండున్నరేండ్ల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ బిడ్డలు అరిగోస పడుతున్నారు. కేసీఆర్ పాలనలో సుసంపన్నంగా వర్ధిల్లిన తెలంగాణ ఇప్పుడు అప్పుల పాలైంది. సామాజిక సంక్షేమం కాటగలిసింది. తలసరి తలకిందులవుతుండగా, జీఎస్డీపీ నేలచూపులు చూస్తున్నది. కబ్జాలే రాజ్యమేలగా.. హైడ్రా పంజాతో సామాన్యుల గూడు ఛిద్రమవుతున్నది. ఉద్యోగాలు లేక నిరుద్యోగులు రోడ్డెక్కుతుండగా.. భరోసా లేని ఈ బతుకు వద్దంటూ రైతన్న, నేతన్న ఉరికొయ్యకు వేలాడుతున్నారు. తల్లి కోడిలా కంటికిరెప్పగా కాపాడుకొన్న కేసీఆర్ సారే మళ్లీ రావాలంటూ ప్రతీ ఒక్కరూ తమ ఆకాంక్షను బయటపెడుతున్నారు. ఏ టీవీ చూసినా.. ఏ పత్రిక తిరగేసినా.. రేవంత్ అప్రజాస్వామిక పాలనపై తెలంగాణ బిడ్డలు సమరశంఖం పూరిస్తున్నారు. మొత్తంగా తెలంగాణ రాజకీయాలకు, ప్రగతిశీల కార్యక్రమాలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. ఓ నిర్ణేతగా మారారని అంటున్నారు. జగిత్యాలలో ఇటీవల జరిగిన ప్రజా ఆశీర్వాద సభ.. కేసీఆర్‌పై తెలంగాణ బిడ్డలు చూపిస్తున్న అభిమానాన్ని మరోమారు గుర్తుచేసింది.
తెలంగాణలో ఎలాగైతే కేసీఆర్ చుట్టూ రాజకీయాలు నడుస్తున్నాయో.. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న పశ్చిమబెంగాల్‌తో పాటు ఇటీవల పోలింగ్ ముగిసిన తమిళనాడు, అసోం, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల్లోనూ ఆయా రాష్ర్టాల ప్రస్తుత ముఖ్యమంత్రులు కేంద్రంగానే ఎన్నికల రాజకీయం నడుస్తున్నది. పార్టీలు ఏవైనా ఆయా రాష్ర్టాల ప్రజలు అక్కడి బలమైన నాయకుల వెంటే నడుస్తున్నారు. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కేరళ సీఎం పినరయి విజయన్, డీఎంకే సారథి, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ, పుదుచ్చేరి సీఎం ఎన్ రంగస్వామితో పాటు ఆమ్ఆద్మీ పార్టీ కన్వీనర్ కేజ్రీవాల్, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్, జార్ఖండ్ సీఎం, జార్ఖండ్ ముక్తి మోర్చా అధ్యక్షుడు హేమంత్ సొరేన్ తదితర శక్తిమంతమైన నేతల చుట్టే ఎన్నికల రాజకీయం నడుస్తున్నది. వారిని లక్ష్యంగా చేసుకొనే ప్రత్యర్థి పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. మొత్తంగా ఆ రాష్ట్ర రాజకీయ చిత్రంలో వీరే కథానాయకులు. ఇక, ఇటీవల ఎన్నికలు జరిగిన రాష్ర్టాల్లో ప్రజానాయకులు ఆయా ప్రాంతీయ అస్తిత్వం విషయంలో రాజీలేని పోరాటం ద్వారా ప్రజల మన్ననలు చూరుగొంటున్నారు. పశ్చిమబెంగాల్లో మమతాబెనర్జీ పదేపదే ప్రాంతీయత అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. తమిళనాడులో స్టాలిన్ ద్రావిడ గుర్తింపును బలంగా ముందుకు తీసుకెళుతున్నారు. ఇండస్ వ్యాలీ లిపిని ఎన్నికల ప్రచారంలోకి తెచ్చారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు భాషల విధానాన్ని స్టాలిన్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పదేపదే ప్రస్తావించారు. కేరళలో పినరయి విజయన్ ఇదే అమలు చేశారు. కేరళను ‘కేరళం’గా పేరు మార్పు ప్రయత్నాలు ఇందులో భాగమే. అసోంలో హిమంత బిశ్వశర్మ జాతీయవాదానికి, ప్రాంతీయను కలిపి రాజకీయంగా కొత్త తరహా గుర్తింపు తెచ్చుకున్నారు. పుదుచ్చేరి సామాన్యుడు ఎన్ రంగస్వామి ప్రజల్లో ఒకడిగా కొనసాగుతూనే ఉన్నారు. వీరితో పాటు అఖిలేశ్, కేజ్రీవాల్, హేమంత్ సొరేన్ ఆయా రాష్ర్టాల ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు.
పశ్చిమబెంగాల్లో ఎన్నికలు ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్రమోదీ వర్సెస్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నట్టుగా మారాయి. వీరిద్దరు తప్ప ఏ నాయకుడి ప్రస్తావన ఉండటం లేదు. బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ రాకతోనే కొత్త రాజకీయం మొదలైంది. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా టీఎంసీ అధినేత్రి మమతాబెనర్జీ లక్ష్యంగానే అక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి. అప్పుడు వామపక్ష పార్టీలు, ఇప్పుడు బీజేపీ.. అన్ని పార్టీలకు మమతాబెనర్జీతోనే రాజకీయ పోరాటం చేయాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయి. పరిపాలనలో, రాజకీయంలో తనదైన ప్రత్యేకశైలితో వరుసగా మూడుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో మమత పార్టీ ఘన విజయం సాధించింది. రెండుసార్లు వామపక్ష పార్టీలను, ఒకసారి బీజేపీని ఎదుర్కొని ఆమె నిలబడ్డారు. ఇప్పుడు బెంగాల్ రాజకీయాలు మొత్తం ‘దీదీ’ కేంద్రంగానే నడుస్తున్నాయి.
పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి దేశంలోనే తనకంటూ ప్రత్యేక రాజకీయ నాయకుడిగా గుర్తింపు పొందారు. పుదుచ్చేరి అంటే తమిళనాడుకు అనుబంధ ప్రాంతమనే భావన ఇప్పటికీ ఉన్నది. తమిళనాడులో చేసే ఆర్భాటపు రాజకీయాలకు భిన్నంగా రంగస్వామి సామాన్యుడిగా ప్రత్యేకతను కొనసాగిస్తున్నారు. ఎన్డీఏ కూటమిలోనూ ఆలిండియా ఎన్ఆర్ కాంగ్రెస్ నాయకుడిగా ప్రత్యేకతను నిలబెట్టుకొంటున్నారు. ప్రజలకు అందుబాటులో ఉండడం, సైకిల్‌పై తిరుగుతూ, హోటళ్ల వద్ద ఆగి అందరితో కలుపుగోలుగా ఉండడం రంగస్వామి సహజ బలం.
శిబు సోరెన్ వారసత్వాన్ని నిలుపుతూ రాజకీయాల్లోకి వచ్చిన జార్ఖండ్ సీఎం, జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) అధినేత హేమంత్ సోరెన్ అతి తక్కువ కాలంలోనే బలమైన నేతగా ఎదిగారు. 2013లో కాంగ్రెస్, ఆర్జేడీ మద్దతుతో 38 ఏండ్ల వయసులోని తొలిసారి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే, 2014లో అనూహ్యంగా అధికారం చేజారిపోయింది. 2019 ఎన్నికల్లో గెలిచి రెండోసారి సీఎం అయ్యారు. ఈడీ అరెస్టుతో సీఎం పదవికి రాజీనామా చేశారు. అయితే, 2024లో ప్రజలు బంపర్ మెజారిటీతో ఆయన్ని మళ్లీ సీఎం చేశా రు. సామాన్య ప్రజల సమస్యలను నేరుగా విన డం, క్షేత్రస్థాయిలో పర్యటనలు చేయడం ద్వా రా ప్రజలతో అనుబంధాన్ని సోరెన్ పెంచుకొన్నారు. ఇదే ఆయన్ని ‘గ్రౌండ్ లీడర్’గా నిలబెట్టింది. అందుకే జార్ఖండ్‌లో ఎన్నికలు సోరెన్ కేంద్రంగానే ఉంటాయని విశ్లేషకులు చెప్తారు.
యూపీఏ-2 పాలనలో చోటుచేసుకొన్న వరుస కుంభకోణాలు, నిర్భయ లాంటి ఘటనలతో విసిగిపోయిన దేశ ప్రజల్లో ఆవేశాగ్నిని రగిలించిన అన్నా హజారే ఉద్యమం మాటున 2013లో తొలిసారి రాజకీయ రంగంలోకి అడుగుపెట్టిన కేజ్రీవాల్‌కు అప్పట్లో ఢిల్లీ ఓటర్లు 28 సీట్లు కట్టబెట్టారు. కాంగ్రెస్ మద్దతుతో స్వల్పకాలం పాటు ప్రభుత్వాన్ని నడిపినా తాను ప్రజలకు స్వేచ్ఛగా సేవ చేయలేకపోతున్నాననే కారణం చూపి సీఎం పదవికి రాజీనామా చేశారు. ఇది గమనించిన రాజధాని ఓటర్లు రెండుసార్లు అధికారాన్ని కట్టబెట్టారు. ఉచిత పథకాలు, విద్యారంగంలో సంస్కరణలు, మొహల్లా క్లినిక్‌లు కేజ్రీవాల్ పాలనకు సొంత బ్రాండ్‌ను ఏర్పాటు చేశాయి. మద్యం కుంభకోణం కొంతకాలం నీడలా మారినా.. ప్రజల సమస్యలను నేరుగా వినే నాయకుడిగా, సమస్యలను త్వరితగతిన పరిష్కరించే ‘ప్రజల మనిషి’గా కేజ్రీవాల్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది.
ఆధునిక భావజాలం, యువత దృష్టికోణం, అభివృద్ధి ఆలోచనల కలయికగా ఎదిగిన నాయకుడు అఖిలేశ్ యాదవ్. సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడిగా కీలకమైన ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించారు. అఖిలేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో రాష్ట్రంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి పెద్దపీట వేశారు. ఎక్స్‌ప్రెస్‌వేలు, రహదారులు, పట్టణాభివృద్ధి ప్రాజెక్టులు వేగంగా అమలు చేసి, యూపీకి ఆధునిక రూపం తీసుకువచ్చారు. విద్య, ఆరోగ్య రంగాల్లో కూడా పలు కార్యక్రమాలు చేపట్టి, పేదలకు మెరుగైన సేవలు అందేలా కృషిచేశారు. డిజిటల్ ఇండియా దిశగా విద్యార్థులకు ల్యాప్‌టాప్‌ల పంపిణీ వంటి నిర్ణయాలు యువతలో ఆయనకు క్రేజ్‌ను తీసుకొచ్చాయి. మరో ఏడాదిన్నరలో జరిగే యూపీ ఎన్నికలు అఖిలేశ్ కేంద్రంగానే జరుగుతాయనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చిన డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ తమిళనాడు రాజకీయాల్లో శక్తిమంతమైన నాయకుడిగా ఎదిగారు. అన్నాదురై, ఎం కరుణానిధి తర్వాత ద్రావిడ ఉద్యమ పరంపరను కొనసాగించే నాయకుడిగా గుర్తింపు పొందారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన స్టాలిన్ కేంద్రంగానే ఇప్పుడు తమిళనాడు ఎన్నికలు జరుగుతున్నాయి. స్టాలిన్ బలంగా కొనసాగిస్తున్న ద్రావిడ రాజకీయ అనివార్యత వల్లే తమిళనాడులో జాతీయ పార్టీల ప్రభావం చూపే పరిస్థితి ఉండడం లేదు. ఇటీవల జరిగిన పోలింగ్‌లో జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ పాత్ర తమిళనాడులో నామమాత్రమే. బీజేపీకి ప్రత్యామ్నాయంగా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ఆధ్వర్యంలోని కూటమిలో డీఎంకే కీలక పాత్ర. స్టాలిన్ లేకుంటే ఈ కూటమికి మనుగడ లేదనే చెప్పొచ్చు.
వామపక్ష పార్టీల్లో వ్యక్తి ప్రాధాన్యత ఉండదు. ఆ పార్టీల విధానానికి భిన్నంగా ఇప్పుడు కేరళలో ఎన్నికల రాజకీయం ఉన్నది. ఇక్కడ వామపక్ష పార్టీల నేతృత్వంలోని ఎల్డీఎఫ్, కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూడీఎఫ్ మధ్య ప్రధాన పోటీ. వరుసగా రెండోసారి ఒకే కూటమి అధికారంలోకి రావడం గత ఎన్నికల్లోనే మొదటిసారి జరిగింది. ఎల్డీఎఫ్ ముఖ్యమంత్రి పినరయి విజయన్ నాయకత్వంతోనే ఇది సాధ్యమైంది. 2016లో విజయన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కేరళలో, ఎల్డీఎఫ్ కూటమిలో కొత్త సమీకరణలు నెలకొల్పారు. వామపక్ష పార్టీ విధానాలకు భిన్నంగా ‘కెప్టెన్ కొనసాగాలి (విజయన్)’ అనే నినాదంతో ఎల్డీఎఫ్ గత ఎన్నికల్లో ప్రచారం నిర్వహించింది. ఎల్డీఎఫ్ కూటమిని విజయన్ రెండోసారి అధికారంలోకి తెచ్చారు. 80 ఏండ్ల విజయన్ నాయకత్వంలోనే వామపక్ష కూటమికి ఇటీవలి ఎన్నికల్లోనూ పోరాడింది.
నరేంద్రమోదీ, అమిత్‌షా ఆధిపత్యంలోని బీజేపీలో అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. బీజేపీ మిగిలిన రాష్ర్టాల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీపై ఆధారపడి ఎన్నికల రాజకీయం చేస్తున్నది. అసోంలో మాత్రం మోదీకి సమానంగా హిమంత పేరును బీజేపీ వాడుతున్నది. జాతీయవాదానికి, ప్రాంతీయ వాదాన్ని జోడించి ఎన్నికల రాజకీయాలకు హిమంత కొత్త పంథా తెచ్చారు. అసోం గుర్తింపును కాపాడాలని, జనాభా దాడి అనే హిమంత మాటలు స్థానిక, జాతీయవాదిగా హిమంత గుర్తింపును పెంచాయి. యువ ఓటర్ల మద్దతుపై ధీమాగా ఉండే హిమంత అభివృద్ధితోపాటు సంక్షేమ పథకాల అమలుతో అన్ని వర్గాల్లో సొంత బలం పెంచుకున్నారు. అసోం ఎన్నికల్లో ప్రతిపక్ష కాంగ్రెస్, ఇతర పార్టీలు ఇప్పుడు హిమంత కేంద్రంగానే రాజకీయ వ్యూహాలు అమలు చేస్తున్నాయి.
ప్రాంతీయ పార్టీల ఆధిపత్యం ఉన్న రాష్ర్టాల్లో ప్రజాదరణ ఉన్న నాయకుడితో ప్రజలకు బలమైన అనుబంధం కొనసాగుతున్నది. ఎన్నికల రాజకీయంలో ఈ ‘బంధం’ బాగా ప్రభావితం చేస్తున్నది. తమిళనాడులో అన్నాదురై, ఎం కరుణానిధి, ఎంజీ రామచంద్రన్, ఉమ్మడి ఏపీలో ఎన్టీఆర్ ఇలా ప్రత్యేక నాయకులుగా నిలబడ్డారు. జాతీయ పార్టీలకు సవాలుగా మారి నిలబడ్డ మొదటి తరం ఇది. 20వ శతాబ్దం ఆరంభంలో తెలంగాణలో ఈ ఒరవడి మరోసారి మొదలైంది. 60 ఏండ్ల స్వరాష్ట్ర కలను సాకారం చేసే లక్ష్యంతో గులాబీ దళపతి కల్వకుంట చంద్రశేఖర్‌రావు 2001లో చేపట్టిన ఉద్యమం దీనికి నాంది పలికింది. ప్రాంతీయ పార్టీల ఉనికి బలోపేతం చేసిన చారిత్రక సందర్భం అది. స్వరాష్ట్ర ఉద్యమంతో కేసీఆర్ వెంట మొదలైన తెలంగాణ ప్రజల ప్రయాణం ఇప్పటికీ అలాగే కొనసాగుతున్నది. సొంత రాష్ట్రం సాకారంతో కేసీఆర్‌తో ప్రజల బంధం మరింత బలోపేతమైంది. ఉత్తమ పాలనతో దేశంలోనే తెలంగాణను అగ్రగామిగా నిలిపిన కేసీఆర్‌తోనే తెలంగాణ సమాజం ఉంటున్నది. కేసీఆర్ తెలంగాణకు పర్యాయపదంగా మారారు. జాతీయ పార్టీల కుట్రలను తిప్పికొట్టిన ఆయన తెలంగాణ సమాజాన్ని కంటికిరెప్పలా కాపాడుతూ ఓ యోధుడిలా నిలబడ్డారు. ఎన్నికలు, రాజకీయాలు, సంక్షేమ పథకాలు ఇలా తెలంగాణలో ఇప్పుడు ఏవైనా సరే కేసీఆర్ కేంద్రంగానే జరగాల్సిన అనివార్యత ఏర్పడింది.