భైంసా/కుభీర్, డిసెంబర్ 22: భారత రాష్ట్ర సమితికి మహారాష్ట్ర ప్రజలు జై కొడుతున్నారు. దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ముధోల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి ఆధ్వర్యంలో గురువారం బీఆర్ఎస్ విస్తరణ శ్రీకార కార్యక్రమంలో భాగంగా మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా బోకర్ నియోజకవర్గం కీని, పాలజ్ గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడి నాయకులు స్వచ్ఛందంగా బీఆర్ఎస్లో చేరారు. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి వారికి గులాబీ కండువాలు కప్పి, పార్టీలోకి ఆహ్వానించారు. మహారాష్ట్రలోని పాలజ్ గ్రామంలో నాయకుడు సంజయ్ రౌత్‌తోపాటు 50 మంది సన్నిహితులు పార్టీలో చేరారు. కీనిలో జరిగిన సభలో శ్రీనివాస్ ఉప్పువాడ్, గోవింద్, ప్రశాంత్, సాయి, నర్సింగ్‌తోపాటు 50 మంది బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ వ్యవసాయానికి పెద్దపీట వేస్తున్నదని, అందుకే అబ్కీ బార్ కిసాన్ సర్కార్ నినాదంతో తమ పార్టీ ముందుకు సాగుతున్నదని చెప్పారు.
తెలంగాణలో అమలవుతున్న పథకాలను అక్కడి ప్రజలకు వివరించారు. అన్ని రాష్ర్టాల్లోనూ బీఆర్ఎస్ తరహా పాలనను అడుగుతున్నారని పేర్కొన్నారు. దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర దర్యాప్తు సంస్థలను వాడుకొంటూ, విపక్ష పార్టీల నేతలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని విమర్శించారు. మహారాష్ట్రలో ఊరూరా బీఆర్ఎస్ను విస్తరిస్తామని, త్వరలోనే కమిటీలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. జనవరి మొదటి వారంలో నాందేడ్ జిల్లాలో నిర్వహించే బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొంటారని మంత్రి పేర్కొన్నారు.