హైదరాబాద్, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ): క్యాతనపల్లి, జనగామ మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ అనేక రకాల అరాచకాలకు పాల్పడిందని బీఆర్ఎస్ లీగల్ సెల్ సభ్యురాలు లలితారెడ్డి ఆధ్వర్యంలో పలువురు మహిళా నేతలు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేతలు పోలీసుల సాయంతో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని మండిపడ్డారు. కౌన్సిలర్లను కిడ్నాప్ చేసి, దాడులకు పాల్పడుతూ ఇష్టారాజ్యంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కౌన్సిలర్ల ప్రమాణస్వీకారం పూర్తికాకుండానే చైర్మన్, వైస్చైర్మన్ల ఎన్నిక పూర్తయిందని అన్నారు. ఈ విషయాలన్నింటినీ ఎన్నికల సంఘానికి చేసిన ఫిర్యాదులో పేర్కొన్నామని తెలిపారు. క్యాతనపల్లిలో మంత్రి వివేక్, ఎంపీ వంశీకృష్ణ కౌన్సిల్లో ఎలా కూర్చుంటారని ప్రశ్నించారు. నిధులు రావాలంటే తమకు ఓట్లు వేయాలని కాంగ్రెస్ నేతలు కౌన్సిలర్లను బెదిరించి, దౌర్జన్యం చేశారని చెప్పారు. మహిళలు అని కూడా చూడకుండా తప్పతాగి దాడికి పాల్పడ్డారని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్, అనిల్, రాజిరెడ్డిపై పోలీసులు అక్రమ కేసులు పెట్టారని ఎన్నికల సంఘానికి తెలిపామని అన్నారు.