హైదరాబాద్, మే 25 (నమస్తేతెలంగాణ): ‘యూత్ డిక్లరేషన్ పేరిట అనేక హామీలిచ్చి దగా చేసిన కాంగ్రెస్ సర్కార్‌పై బీఆర్ఎస్ ఉద్యమిస్తుంది. ఈ నెల 30న కేటీఆర్ నేతృత్వంలో తెలంగాణ భవన్లో సమావేశమై కార్యాచరణ ప్రకటిస్తాం. వచ్చే నెల మొదటి వారంలో ‘చలో సరూర్‌నగర్’ పేరిట సరూర్‌నగర్‌లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తాం’ అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్ వెల్లడించారు. శనివారం హైదరాబాద్ తెలంగాణ భవన్లో మాజీ హోంమంత్రి మహమూద్‌అలీ, శాసనసభ విప్ వివేకానంద్‌గౌడ్, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్, ముఠా గోపాల్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, అంజయ్య, పార్టీ నేత పటోళ్ల కార్తీక్‌రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల కోసం కాంగ్రెస్ బోగస్ డిక్లరేషన్‌ను తెరపైకి తెచ్చిందని ఆరోపించారు. గద్దెనెక్కిన వెంటనే 2 లక్షల ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని హామీ ఇచ్చి రెండున్నరేండ్లు దాటినా అమలుచేయకుండా నిరుద్యోగులను నిండా ముంచిందని ధ్వజమెత్తారు.
విదేశీ విద్యానిధి పథకం కింద స్కాలర్షిప్లు పెంచుతామని చెప్పి మోసం చేసిందని మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని అటకెక్కించి పేద ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ విద్యార్థులను అరిగోస పెడుతున్నదని విమర్శించారు. సుప్రీంకోర్టు తీర్పును సాకుగా చూపి చేతులు దులుపుకొన్నదని దుయ్యబట్టారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై విద్యార్థులు రోడ్డెక్కితే ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. కేసీఆర్ పదేండ్ల పాలనలో విద్యారంగంపై ప్రత్యేక శ్రద్ధపెట్టారని తలసాని శ్రీనివాస్‌యాదవ్ పేర్కొన్నారు. వెయ్యికి పైగా గురుకులాలు నిర్మించి పేద పిల్లలకు నాణ్యమైన విద్యనందించారని, ఓవర్సీస్ స్కాలర్షిప్ కింద విదేశాలకు వెళ్లే విద్యార్థులకు రూ.20 లక్షల చొప్పున అందించిన ఘనత ఆయనకే దక్కిందని కొనియాడారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగాన్ని చిన్నచూపు చూస్తున్నదని మండిపడ్డారు.
విద్యావ్యవస్థను భ్రష్టు పట్టించిన సర్కార్: సబితాఇంద్రారెడ్డి
రేవంత్ సర్కార్ రెండున్నరేండ్ల పాలనలో విద్యావ్యవస్థను భ్రష్టు పట్టించిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గత పాలకుల ఆనవాళ్లను చెరిపేయాలని కలలుగంటున్న సీఎం రేవంత్‌రెడ్డి.. అదే కాంగ్రెస్ సీఎం వైఎస్సార్ తెచ్చిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి తూట్లు పొడవడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. కేసీఆర్ ఈ పథకానికి ఠంఛన్‌గా నిధులిచ్చేవారని గుర్తుచేశారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల పేరిట పేద, మధ్య తరగతి పిల్లలు, తల్లిదండ్రులను మభ్యపెడుతున్నదని మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకంపై ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. బకాయిలను ప్రభుత్వమే చెల్లిస్తుందా? లేదా? అని ప్రశ్నించారు. లేదంటే బీఆర్ఎస్ విద్యార్థుల తరఫున పోరాటం చేసి సర్కార్ మెడలు వంచుతుందని హెచ్చరించారు. జాబ్ క్యాలెండర్ కోసం నిరుద్యోగ యువత ఎదురు చూస్తున్నదని గుర్తుచేశారు. ఇప్పటికైనా హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. యూనివర్సిటీలకు నిధులిస్తామని ప్రకటనలు గుప్పిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి ఆచరణలో మాత్రం ఘోరంగా విఫలమయ్యారని ఆరోపించారు. రాష్ట్రంలో అన్ని రంగాలను, పాలనను గాలికొదిలి భూముల చుట్టే పాలకులు పరిభ్రమిస్తున్నారని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ హామీలపై నిలదీస్తాం: ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి
కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక చేత నాడు నిరుద్యోగులకు ఇప్పించిన హామీలపై సర్కార్‌ను ఎండగడుతామని ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి స్పష్టంచేశారు. యూత్ డిక్లరేషన్‌లో అనేక హామీలిచ్చి మోసం చేసిన కాంగ్రెస్ సర్కార్ వైఖరికి నిరసనగా జూన్ నెలలో సరూర్‌నగర్ స్టేడియంలో భారీ బహిరంగసభ నిర్వహించనున్నట్టు వెల్లడించారు. మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన రేవంత్‌రెడ్డి రెండున్నరేండ్లుగా అదే పరంపర కొనసాగిస్తున్నారని దుయ్యబట్టారు. నిరుద్యోగులను మోసంచేసిన ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ ఎట్టిపరిస్థితుల్లో వదిలిపెట్టబోదని హెచ్చరించారు.