Revanth Reddy | కాపురం చేసే కళ.. కాలు తొక్కిన్నాడే తెలుస్తది.. అనే పాత సామెత టీపీసీసీ చీఫ్ రేవంత్‌కు అచ్చుగుద్దినట్టు సరిపోతుంది. కాంగ్రెస్ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన నాటినుంచి ఆయన నోటికి, చేతలకు పగ్గాలు లేకుండా పోయాయి. చిన్నంతరం.. పెద్దంతరం.. పదవులు.. హోదాలు.. అనుభవం.. అస్తిత్వం.. దేన్నీ చూడకుండా ఎవరినిపడితే వారిని.. నోటికి ఎంతొస్తే అంత మాట్లాడుతూ హద్దుల్లేకుండా ప్రవర్తిస్తున్నాడు.
అన్నివర్గాలపైనా తన నోటి దురుసును ప్రదర్శిస్తున్నాడు. మూడు గంటల కరెంటే చాలని, రైతు సంక్షేమ పథకాలు ఆపేయాలని అటు అన్నదాతలను అవమానించిన రేవంత్.. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకూ ధమ్కీ ఇస్తున్నాడు. తెలంగాణ ఉద్యమంలో వీరోచితంగా పోరాడిన ఉస్మానియా వర్సిటీ విద్యార్థులను అడ్డా కూలీలని అవహేళన చేశాడు.
చావునోట్లో తలపెట్టి తెలంగాణ సాధించిన కేసీఆర్‌పైనా బూతుపురాణం అందుకున్నాడు. మనకోసం ప్రాణాలకు తెగించి కొట్లాడిన ఉద్యమ నేత కేసీఆర్‌కు శిరచ్ఛేదనం చేస్తామంటూ దుర్మార్గంగా మాట్లాడాడు. తన సొంత పార్టీ కార్యకర్తలను బూటుకాలితో తన్నిన టీపీసీసీ చీఫ్.. హస్తం పార్టీ సీనియర్ నేతలపైనా దురహంకారం ప్రదర్శించి, దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాడు.
నగరంలో బంగారమోలె వ్యాపారం చేసుకుంటున్న వీధివ్యాపారులను నగరం బయటకు తరలిస్తామని అంటున్నాడు. అధికారంలోకి వస్తే రాచకొండలో రైతుల భూములు లాక్కొంటానని చెప్తున్నాడు. నగరంలో సొరంగాలు తవ్వుతామని, తెలంగాణ భవన్‌ను పేల్చేస్తానని విధ్వంసకర వ్యాఖ్యలతో రెచ్చిపోతున్నాడు.
ఎకరం భూమికి నీళ్లు పారేందుకు గంట సమయం సరిపోతుంది. తెలంగాణలోని 58 లక్షల కమతాల్లో 95 శాతం చిన్న సన్నకారు రైతులవే. వీరంతా 3 ఎకరాలలోపు భూమి ఉన్నవాళ్లే. అంటే వ్యవసాయానికి 3 గంటల కరెంట్ ఇస్తే సరిపోతుంది.
-10 జూలై 2023
అధికారులను హెచ్చరిస్తున్నా.. రెడ్ డెయిరీలో పేర్లు రాసిపెడుతున్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకొక్కడిని గుడ్డలిప్పదీసి కొడతాం. అసలు, మిత్తితో చెల్లిస్తాం.
-16 ఆగస్టు 2023
‘రైతుబంధు నిధులను ఆపేయండి. ఎన్నికల సమయంలో రైతులకు రైతుబంధు డబ్బులు ఇవ్వొద్దు. దీంతో పాటు దళితబంధు, బీసీబంధు, గృహలక్ష్మి పథకాలను కూడా ఆపేయాలి. వీటన్నింటిని నెలపాటు వాయిదా వేయాలి’ అంటూ రేవంత్ అక్కసు వెళ్లగక్కాడు.
-25 అక్టోబర్ 2023
‘డీజీపీ నుంచి డీఎస్పీ వరకు, కొన్ని చోట్ల సీఐలు కూడా అతిగా వ్యవహరిస్తున్నారు. అదే విధంగా ఐఏఎస్‌లు కూడా అతి చేస్తున్నారు. ఐఏఎస్‌లు మొదలుకొని ఎమ్మార్వో, ఎంపీడీవో వరకు అన్ని స్థాయిల అధికారుల పనితీరుపై నిఘా పెడుతున్నాం. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వార్తలు రాసిన టీవీలు, పేపర్లలోని రిపోర్టర్లు, యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు పెడతాం’ అంటూ బెదిరింపులకు దిగాడు.
-10 అక్టోబర్ 2023
ఎకరం భూమికి నీళ్లు పారేందుకు గంట సమయం సరిపోతుంది. తెలంగాణలోని 58 లక్షల కమతాల్లో 95 శాతం చిన్న సన్నకారు రైతులవే. వీరంతా 3 ఎకరాలలోపు భూమి ఉన్నవాళ్లే. అంటే వ్యవసాయానికి 3 గంటల కరెంట్ ఇస్తే సరిపోతుంది. రైతులు 10హెచ్‌పీ మోటర్లు పెట్టుకొంటే 3 గంటల కరెంట్ సరిపోతుంది.
– 11 నవంబర్ 2023
పాలకుర్తి సభలో రేవంత్ తనను కలిసేందుకు వచ్చిన వారిని బూటు కాలితో తన్నాడు. సొంత పార్టీ కార్యకర్తలపై బూతు పురాణం అందుకున్నాడు. ఆ సభలో అరుస్తున్న కార్యకర్తలను ఉద్దేశించి రేవంత్ మాట్లాడుతూ.. ‘పిచ్చి లేసిందా? తల తిరుగుతున్నదా?’ అంటూ నోటికొచ్చిన బూతులు తిట్టాడు.
-9 నవంబర్ 2023
పొన్నాల లక్ష్మయ్య పార్టీ మారడంపై రేవంత్ స్పందిస్తూ.. ‘ఈ వయసులో పార్టీ మారేందుకు సిగ్గుండాలి. సచ్చే ముందు ఏం రోగమొచ్చింది? ఆయనకు కాంగ్రెస్ పార్టీ అన్నీ ఇచ్చింది. పీసీసీ అధ్యక్ష పదవి ఇస్తే 40 వేల ఓట్ల తేడాతో ఓడిపోయిండు. రెండోసారి ఇస్తే 50 వేల తేడాతో ఓడిపోయిండు. పార్టీ మారడమే బుద్ధిలేని పని’ అంటూ రంకెలేశాడు.
-13 అక్టోబర్ 2023
‘పాపాలు పండాయ్.. శిశుపాలుడి వంద తప్పులు ముగిశాయి. ఇక కేసీఆర్ శిరచ్ఛేదనమే తరువాయి’ అంటూ స్టేషన్‌ఘన్‌పూర్ సభలో రేవంత్ దుర్మార్గపు వ్యాఖ్యలు చేశాడు.
– నవంబర్ 15 2023
‘తెలంగాణ భవన్‌ను పేల్చేస్తా.. అందులో ఉద్యోగులు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులకు ప్రవేశం లేదు. కాంట్రాక్టర్లు, ఆంధ్ర పెత్తందార్లకే అనుమతి ఉంది’ అంటూ జనగామ సభలో రేవంత్ సంచలన వ్యాఖ్యలు
– నవంబర్ 15 2023
మక్తల్, కామారెడ్డి సభలో సీఎం కేసీఆర్‌పై రేవంత్‌రెడ్డి వ్యక్తిగత దూషణలకు దిగారు. కేసీఆర్ వ్యక్తిత్వాన్ని కించపరిచేలా, ఆయన కుటుంబసభ్యులపై రాయలేని భాషలో బూతుపురాణం అందుకున్నాడు.
-7 నవంబర్ 2023, 10 నవంబర్ 2023
‘తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అక్కర్లేదు. సమైక్యమే బాగుండేది. వలస పాలకులు తెలంగాణకు అన్నీ ఇచ్చిండ్రు. నిధులు ఇచ్చారు, నీళ్లు ఇచ్చారు, ఉద్యోగాలిచ్చారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ ఉద్యమం సాగలేదు. తెలంగాణ ప్రజలు ఎప్పుడూ వీటిని కోరుకోలేదు’ అంటూ రేవంత్ మాట్లాడాడు.
– 10 నవంబర్ 2023
అధికారంలోకి వస్తే రాచకొండలో రైతుల భూములు లాక్కుంటాం. అక్కడ 50 వేల ఎకరాలు సేకరిస్తాం. అమరావతి తరహాలో కొత్త నగరాన్ని నిర్మిస్తాం. నగరంలోని వీధివ్యాపారులందరినీ అక్కడికి తరలిస్తాం.
-8 నవంబర్ 2023
రోడ్లు… ఫ్లైఓవర్లు అనేది ఒక లెవల్ టెక్నాలజీ. అంతకుమించి టన్నెల్ టెక్నాలజీ ఉంది. స్ట్రెయిట్ కనెక్టివిటీ లైన్. దిల్సుఖ్నగర్ నుంచి జూబ్లీహిల్స్ వరకు వెళ్లాలనుకున్నా! బహదూర్‌పుర నుంచి బాలానగర్ వరకు వెళ్లాలనుకున్నా!! అండర్ టన్నెల్ రోడ్డు ద్వారా స్ట్రెయిట్‌గా వెళ్లొచ్చు. బయటి రోడ్లు ఉన్నట్టు కాదు. టన్నెల్ బోరింగ్ మిషన్ (టీబీఎం)తో ఎంత రోడ్డు కావాలంటే అంత రోడ్డు వేసుకోవచ్చు.
-3 నవంబర్ 2023