Vinod Kumar | హైదరాబాద్ : తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వెంటనే జోక్యం చేసుకుని పూర్తి స్థాయిలో జడ్జిట నియామకానికి చర్యలు చేపట్టాలని బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. జడ్జిలు పూర్తి స్థాయిలో ఉంటేనే తెలంగాణకు న్యాయం జరుగుతుందన్నారు. తెలంగాణ భవన్లో వినోద్ కుమార్ మీడియాతో మాట్లాడారు.
సరిగ్గా ఆరు సంవత్సరాల క్రితం లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో హైకోర్టు ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలిపాను. 2019 డిసెంబర్ 31 నాడు తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు వచ్చింది. కేసీఆర్ హయాంలోనే మేము పార్లమెంట్లో ఒత్తిడి చేసిన ఫలితంగా హైకోర్టు జడ్జిల సంఖ్యను 42కు పెంచారు. తెలంగాణ హైకోర్టుకు 42 మంది జడ్జిలు ఉండాలని నిర్ణయం తీసుకున్నా.. ఎప్పుడూ 23 మందికి మించి భర్తీ చేయడం లేదు. తెలంగాణ జడ్జిల్లో ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన వారు ఎవ్వరూ లేరు. పూర్తి స్థాయిలో జడ్జిలను నియమిస్తే దళిత, గిరిజన వర్గాలకు కూడా న్యాయం జరుగుతుంది అని వినోద్ కుమార్ పేర్కొన్నారు.
హైకోర్టులో పెండింగ్ కేసుల సంఖ్య నానాటికి పెరిగి పోతోంది.. జడ్జిలు పూర్తి స్థాయిలో ఉంటే తప్ప కేసులు తొందరగా పరిష్కారం కావు. సామాజిక న్యాయం న్యాయ వ్యవస్థలో కూడా పాటించాల్సిందే. వేరే రాష్ట్రాల నుంచి తెలంగాణ హైకోర్టులో నలుగురు జడ్జిలు ఉన్నారు. జడ్జిలు పూర్తి స్థాయిలో ఉంటేనే తెలంగాణకు కూడా న్యాయం జరుగుతుందన్నారు వినోద్ కుమార్.
శామీర్ పేటకు మెట్రో రైల్ ప్రాజెక్టు వస్తే ట్రాఫిక్ సమస్య పరిష్కారం కాదు. ఉత్తర తెలంగాణ జిల్లాల ప్రజల కష్టాలు పోవాలంటే నాగపూర్ తరహాలో జేబీఎస్ నుంచి శామీర్ పేట వరకు డబుల్ డెక్ ఫ్లై ఓవర్‌ను ఏర్పాటు చేయాలని వినోద్ కుమార్ డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి..
Siricilla | అమ్మాయికి న్యూ ఇయర్ విషెస్ చెప్పాడని విద్యార్థిపై దాడి.. మనస్తాపంతో ఆత్మహత్య
MLC Kavitha | రేపు ఇందిరా పార్క్ వద్ద బీసీ మహాసభ : ఎమ్మెల్సీ కవిత
CM Revanth Reddy | పది రోజులపాటు విదేశాల్లోనే.. సంక్రాంతి తర్వాత సీఎం ఫారిన్ టూర్