CM Revanth Reddy | హైదరాబాద్, జనవరి 1 (నమస్తే తెలంగాణ): సంక్రాంతి తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి వరుసగా విదేశీ యాత్ర చేపట్టనున్నారు. పది రోజుల పాటు మూడు దేశాల్లో పర్యటిస్తారు. ఫారిన్ టూర్‌ను ముగించుకొని గణతంత్ర దినోత్సవాలకు ముందురోజు తిరిగి ఆయన రాష్ర్టానికి రానున్నారు. తొలుత ఈ నెల 14న సీఎం రేవంత్ ఆస్ట్రేలియా పర్యటనకు బయల్దేరనున్నారు. నాలుగు రోజులపాటు ఆ దేశంలోనే పర్యటిస్తారు. అనంతరం అక్కడి నుంచి 19వ తేదీన సింగపూర్‌కు వెళ్తారు.
రెండు రోజులపాటు సింగపూర్‌లో ఉంటారు. ఆ తర్వాత అక్కడి నుంచి స్విట్జర్లాండ్‌కు వెళ్తారు. దావోస్‌లో ఈ నెల 20-24 తేదీల మధ్య జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొంటారు. అనంతరం 24వ తేదీ రాత్రి లేదా 25న హైదరాబాద్‌కు చేరుకోనున్నట్టు సీఎంవో వర్గాలు తెలిపాయి. మొత్తంగా సంక్రాంతి నుంచి గణతంత్ర దినోత్సవం వరకు సీఎం విదేశీ పర్యటన జరగనున్నది. ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, సీఎస్ శాంతికుమారి, ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్, ప్రభుత్వ సలహాదారు జితేందర్ రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి తదితరులు సీఎం వెంట వెళ్లనున్నట్టు సమాచారం.
గతేడాది ఐదు దేశాల్లో సీఎం పర్యటించారు. మొదట స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జనవరి 15-18వ తేదీ వరకు జరిగిన డబ్ల్యూఈఎఫ్ సదస్సులో పాల్గొన్నారు. ఆ తర్వాత బ్రిటన్‌కు వెళ్లారు. రెండు రోజుల పాటు లండన్‌లో పర్యటించారు. అక్కడి నుంచి 21న దుబాయ్‌కు వెళ్లారు. రెండు రోజుల అనంతరం తిరిగి హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఆగస్టులో రెండో విడత విదేశీ యాత్ర చేపట్టారు. ఆగస్టు 3-14 వరకు అమెరికా, దక్షిణ కొరియా దేశాల్లో సీఎం పర్యటన సాగింది. ప్రభుత్వం ఏర్పడిన తొమ్మిది నెలల్లోనే సీఎం రేవంత్‌రెడ్డి ఐదు దేశాల్లో పర్యటించారు. ఇప్పుడు మూడో విడత విదేశీ పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు.