Vinod Kumar | హైదరాబాద్ : కేంద్రంలో అధికారంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంపై బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వోడాఫోన్ 40 వేల కోట్ల రూపాయల మేర ఇన్కమ్ టాక్స్ కట్టాలని సుప్రీం కోర్టు తీర్పు ఇస్తే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చట్టం ద్వారా దాన్ని తిరస్కరించింది. వోడాఫోన్కు లబ్ది చేకూర్చిన బీజేపీ బీసీల రిజర్వేషన్ల పెంపు కోసం రాజ్యాంగాన్ని ఎందుకు సవరించదు? అని బీజేపీ ప్రభుత్వాన్ని మాజీ ఎంపీ వినోద్ కుమార్ నిలదీశారు. తెలంగాణ భవన్లో మాజీ ఎంపీ మీడియాతో మాట్లాడారు.
ఎన్నో సార్లు తమకు అనుకూలంగా ఉన్న విషయాలపై రాజ్యాంగాన్ని సవరించిన బీజేపీ బీసీల కోసం ఎందుకు సవరించదు? బీసీ కులగణనపై కూడా సుప్రీం తీర్పును దాటవేసేలా పార్లమెంటులో బీజేపీ చట్ట సవరణ తెచ్చింది. బీఆర్ఎస్ హైకోర్టులో ఎందుకు ఇంప్లీడ్ కాలేదని పొన్నం ప్రభాకర్ అంటున్నారు. బీఆర్ఎస్ డ్రామా కంపెనీ కాదు బీసీలతో రాజకీయాలు చేయడానికి. రాహుల్ గాంధీ బీసీ రిజర్వేషన్ల పెంపుపై పార్లమెంటులో కనీసం ప్రైవేట్ మెంబెర్ బిల్లునైనా పెట్టారా..? అని వినోద్ కుమార్ అడిగారు.
తొమ్మిదో షెడ్యూల్లో చేరిస్తే తప్ప బీసీలకు రిజర్వేషన్లు పెరగవు. ఇప్పటికైనా ఢిల్లీలో కాంగ్రెస్ బీజేపీలు కలిసి తొమ్మిదో షెడ్యూల్లో చేర్చడం కోసం ప్రయత్నాలు చేయాలి. బీఆర్ఎస్ సహకరిస్తుంది. డ్రామాలు ఇప్పటికైనా కట్టిపెట్టండి. బీసీలను మోసం చేయాలనే వైఖరిని కాంగ్రెస్ విడనాడాలి. రాష్ట్రం నుంచి ఇద్దరు కేంద్రమంత్రులు ఉన్నారు. మోడీపై ఒత్తిడి తెచ్చి బీసీ రిజర్వేషన్లు పెంచేలా వారు ఎందుకు కృషి చేయడం లేదు. తమిళనాడులో బీసీలకు విద్యా ఉద్యోగాల్లో 69 శాతం రిజర్వేషన్లు ఉన్నాయి తప్ప స్థానిక సంస్థల్లో 50 శాతం మించి లేవు అని వినోద్ కుమార్ స్పష్టం చేశారు.