Vinod Kumar | హైదరాబాద్ : బీసీ రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో చేర్చాల్సిందే అని బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. తొమ్మిదో షెడ్యూల్లో చేర్చనిది రిజర్వేషన్ల పెంపు సాధ్యం కాదు అని ఆయన స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి తెలంగాణ భవన్లో మాజీ ఎంపీ వినోద్ మీడియాతో మాట్లాడారు.
బీసీ రిజర్వేషన్ల పెంపుపై రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. బీసీ బిల్లును రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపింది. ఈ లోపే ఆర్డినెన్స్‌ను గవర్నర్‌కు పంపి నిర్ణయం కోసం వేచి చూస్తున్నారు. సీఎం, మంత్రులు బీసీ బిల్లు ఆమోదం కోసం ఢిల్లీ వెళ్లి ధర్నా చేయాలని కేబినెట్లో నిర్ణయించారు. ఈ నేపథ్యంలో స్థానిక ఎన్నికలు జరుగుతాయా..? జరగవా..? అని అందరూ చర్చించుకుంటున్నారు. ఆర్డినెన్స్ ఎపుడూ ఆమోదానికి నోచుకోదని మాకు ముందే తెలుసు. కాంగ్రెస్, బీజేపీ కలిసి బీసీలను ఎందుకు మోసం చేయాలని చూస్తున్నాయని మాజీ ఎంపీ వినోద్ కుమార్ ప్రశ్నించారు.
50 శాతానికి మించి రిజర్వేషన్లు ఉండరాదని ఇందిరా సహానీ కేసులో సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. తొమ్మిదో షెడ్యూల్లో చేర్చనిది రిజర్వేషన్ల పెంపు సాధ్యం కాదు. తొమ్మిదో షెడ్యూల్లో కీలక అంశాలను చేర్చడం అనేది రాజ్యాంగం అమల్లోకి వచ్చిన సంవత్సరం తర్వాత నెహ్రు ప్రధానిగా ఉన్నప్పటి నుంచి ప్రారంభం అయింది. మాది మొదట్నుంచి తొమ్మిదో షెడ్యూల్లో బీసీ రిజర్వేషన్ల పెంపును చేర్చాలని మా వాదన. నిన్న మా బీసీ లీడర్లు కూడా అదే చెప్పారు. మోదీ, రాహుల్ తలచుకుంటే పార్లమెంటులో రిజర్వేషన్ల పెంపును గంటలో ఆమోదించవచ్చు. మోదీకి చిత్తశుద్ధి లేదు. రాహుల్ గాంధీ అడగరు. రాహుల్ గాంధీ ప్రతిపక్షనాయకుడిగా పార్లమెంటులో బీసీ రిజర్వేషన్ల కోసం ప్రైవేట్ బిల్లును ప్రవేశ పెట్టవచ్చు అని వినోద్ కుమార్ తెలిపారు.
బీజేపీ కొత్త అధ్యక్షుడు రాంచందర్ రావు బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని సీఎంగా చేస్తామంటున్నారు. బీసీలకు రిజర్వేషన్లు పెంచని వారు బీసీని సీఎం చేస్తారా..? రాజ్యాంగం 243 డికి సవరణ చేస్తే బీసీల రిజర్వేషన్లు పెంచవచ్చు. మోదీకి చిత్తశుద్ధి ఉంటే ఈ పని చేయవచ్చు. జీవో, ఆర్డినెన్స్‌ల ద్వారా బీసీ రిజర్వేషన్ల పెంపు సాధ్యం కాదు. గతంలోనే కేసీఆర్ బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ల పెంపు కోసం అసెంబ్లీ తీర్మానం కేంద్రానికి పంపారు. కేసీఆర్ పంపిన తీర్మానం, రేవంత్ రెడ్డి పంపిన బిల్లును పార్లమెంటులో చర్చించి ఆమోదించవచ్చు అని వినోద్ కుమార్ సూచించారు.
రేవంత్ రెడ్డి ఢిల్లీలో ధర్నాలు చేయాల్సిన అవసరం లేదు. రాహుల్ గాంధీతో మాట్లాడి మోదీపై ఒత్తిడి పెంచవచ్చు. ధర్నాలు డ్రామాలు కాదు.. రాహుల్‌ను వెంట తీసుకుని రేవంత్ పీఎం దగ్గరకు వెళ్ళాలి. 243 డి కింద రాష్ట్ర ప్రభుత్వాలు పంపిన ఎన్నో బిల్లులను పార్లమెంటు చట్టాలుగా చేసింది. కేసీఆర్ హయంలో పంపిన తీర్మానంతో రేవంత్ రెడ్డి పంపిన బిల్లును కలిపి పార్లమెంటు ఆమోదించాలి. బీసీలకు న్యాయవ్యవస్థలో కేసీఆర్ రిజర్వేషన్లు లేకున్నా ఎన్నో అవకాశాలు కల్పించారు. అడ్వొకేట్ జనరల్ పదవిని బీసీలకు ఇచ్చిన ఘనత కేసీఆర్‌దే. చిత్తశుద్ధి ఉంటే చట్టాలతో పని లేదని కేసీఆర్ నిరూపించారు. మోదీ, రాహుల్ గాంధీ తలచుకుంటే పార్లమెంటులో ఏ బిల్లునైనా ఆమోదించవచ్చు అని వినోద్ కుమార్ అన్నారు.