హైదరాబాద్, మార్చి 19 (నమస్తే తెలంగాణ): అశాస్త్రీయ పన్ను విధానం, ఆచరణ సా ధ్యంకాని పెనాల్టీలతో వ్యాపారాలు చేయలేక, బతికేందుకు మరో మార్గంలేక ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని క్రషర్ య జమానులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఐదు నెలల్లో ఇద్దరు క్రషర్ల నిర్వాహకులు ఆత్మహత్యలకు పాల్పడటం పరిస్థితి తీవ్రతను సూచిస్తున్నది. వివిధ కారణాలతో ఇప్పటివరకు 261 క్రషర్లను మూసివేసిన అధికారులు, మిగిలిన వాటికీ నోటీసులిచ్చి వేధిస్తున్నారని నిర్వాహకులు వాపోతున్నారు.
క్రషర్లతోపాటు తమ ఇండ్లకు కూడా అక్రమంగా విద్యుత్తు సరఫరా ను నిలిపివేసి భయపెడుతున్నారని చెబుతు న్నారు. ఇప్పటివరకు సుమారు 110 వినతిపత్రాలు సమర్పించినా ప్రభుత్వం తమ గోడు వినేందుకు సమయం ఇవ్వడం లేదని, ఈ పరిస్థితుల్లో క్రషర్లను తెగనమ్ముకొని చావే శరణ్య మని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. మైనింగ్ శాఖ ఇచ్చిన పెనాల్టీ నోటీసుతో గుండెపోటుకు గురై ఐదు నెలల క్రితం షాద్‌నగర్‌కు చెందిన ఓ క్రషర్ నిర్వాహకుడు మృతి చెందగా, తాజాగా నాగర్‌కర్నూల్‌లో యజమాని బలవన్మరణానికి పాల్పడ్డాడు. తెల్లారితే ఉగాది పండుగనగా అధికారుల వేధింపులు తాళలేక శ్రీనివాస్‌రెడ్డి అనే క్రషర్ యజమాని బుధవారం ఆత్మహత్యకు పాల్పడటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నది.
మైన్స్ అండ్ మినరల్స్ శాఖ నిబంధనల ప్రకారం కంకర, రోబోశాండ్ వంటి నిర్మాణ సామగ్రిని ఉత్పత్తి చేసే స్టోన్ క్రషర్లకు గతంలో టన్నుకు రూ.55 చొప్పున రాయల్టీ విధించేవారు. క్రషర్ల ద్వారా ఉత్పత్తయ్యే మెటీరియల్‌లో దాదాపు 90% వరకు మున్సిపల్, గ్రామ పంచాయతీల రోడ్లు, ప్రభుత్వ భవనాల నిర్మాణానికే వినియోగిస్తున్నారు. మిగతా 10% మాత్రమే ప్రైవేట్ భవనాలకు విక్రయిస్తున్నా రు. ప్రభుత్వ పనులకు సరఫరా అయ్యే మెటీరియల్‌కు సంబంధించి ప్రభుత్వం క్రషర్ల రా యల్టీని మినహాయించి కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తే సరిపోతుంది.
ప్రైవేట్ భవనాలకు ఇచ్చే మెటీరియల్‌కు అనుమతుల జారీ సందర్భం గా బిల్డర్ల నుంచి వసూలు చేసే అవకాశం ఉం టుంది. దీనివల్ల గనుల శాఖ ప్రత్యేకంగా యజమానుల నుంచి రాయల్టీ వసూలు చేయాల్సిన అవసరం ఉండదు. గతంలో ఇదే విధానం ఉండగా, కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వ చ్చినప్పటి నుంచి పరిస్థితి మారింది. కొందరు అధికారులు అత్యుత్సాహంతో క్రషర్ యజమానులను దొంగలుగా చిత్రీకరిస్తూ, తప్పుడు నివేదికలు ఇస్తున్నారనే ఆరోపణలున్నాయి. రోజుకో నిబంధన తెస్తూ క్రషర్లు నడువకుండా చేస్తున్నారని నిర్వాహకులు వాపోతున్నారు.
కొద్దిరోజులు చదరపు మీటర్ల ప్రకారం కొలతలు వేసి రాయల్టీని నిర్ధారించగా, ఇటీవల విద్యుత్తు వినియోగాన్ని బట్టి రాయల్టీ చె ల్లించాలనే నిబంధన తెరపైకి తెచ్చారు. గతంలో టన్నుకు రూ.55గా ఉన్న రాయల్టీని రూ.197 కి పెంచారు. క్రషర్ల వద్ద సీసీ కెమేరాలు ఏర్పాటుచేసి అక్కడి కార్యకలాపాలను రికార్డుచేస్తున్నారు. చిన్న తేడా వచ్చినా కోట్లకు కోట్లు పెనాల్టీ వేసి, అవి కట్టకపోతే మూసివేస్తున్నారు. నాగర్‌కర్నూల్‌లో ఒకే క్రషర్కు ఏకంగా రూ.74కోట్ల పెనాల్టీ విధించారంటే వారి పన్ను ల విధానం ఎలా ఉందో ఊహించుకోవచ్చు. అంతేకాదు, సదరు క్రషర్ యజమాని ఇల్లు కూడా క్రషర్ సమీపంలోనే ఉండటంతో క్రషర్తోపాటు ఆయన ఇంటికి కూడా విద్యుత్తు సరఫరా నిలిపివేశారు.
దొంగలను వేటాడి ప్రభుత్వ ఖజానాను నింపుతున్నామని ప్రభుత్వానికి గొప్పలు చెప్పుకొంటున్న కొందరు మైనింగ్ శాఖ అధికారులు.. వరంగల్, నిజామాబాద్ జిల్లాలను మాత్రం అవి మన రాష్ట్రంలో లేవనే చందంగా వదిలివేశారనే ఆరోపణలున్నాయి. ఈ రెండు జిల్లాల్లోని అనేక క్రషర్లకు కనీసం పర్యావరణ అనుమతులు కూడా లేకుండానే కొనసాగుతున్నాయని, ఎన్ని ఫిర్యాదులు అందినా పట్టించుకోవడంలేదని సమాచారం. అధికారపార్టీకి అంటకాగుతున్నవారి క్రషర్లపై మాత్రం ఈగను కూడా వాలనివ్వని అధికారులు, రెం డు-మూడు దశాబ్దాల నుంచి వ్యాపారం చేసుకుంటున్నవారిని రకరకాల నిబంధనల పేరుతో వేధింపులకు గురిచేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం ఇప్పటికైనా అధికారుల అరాచక విధానాలను అరికట్టి మైనింగ్ రంగాన్ని కాపాడాలని స్టోన్ క్రషర్ల యజమానులు కోరుతున్నారు.
తాము ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు తీసుకొని దశాబ్దాలుగా వ్యాపారాలు చేస్తున్నామని, ఎలాంటి చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడటం లేదని తెలంగాణ స్టోన్ క్రషర్స్ యజమానుల సంఘం నాయకులు కమలాకర్‌రెడ్డి స్పష్టంచేశారు. ‘మేము చేస్తున్నదేమైనా డ్రగ్స్ వ్యాపారమా? గుడుంబా వ్యాపారమా? ఎందుకింత నిర్బంధం, ఎం దుకీ అధికారుల అరాచకం’ అని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. ఆత్మహత్య చేసుకున్న శ్రీనివాస్‌రెడ్డి ఇంటికి విద్యుత్తు కనెక్షన్ తొలగించడం వల్ల నెలన్నర నుంచి ఆయన కుటుంబం చీకట్లో బతుకుతున్నదని చెప్పా రు.
రూ.74 కోట్ల పెనాల్టీ వేసినప్పటి నుంచి ఆయన నిద్రాహారాలు మాని తీవ్ర ఆవేదన చెందారని, తన సర్వం అమ్ముకున్నా ఈ పె నాల్టీలు చెల్లించలేనని బాధపడేవాడని చె ప్పారు. శ్రీనివాస్‌రెడ్డి కుటుంబానికి ప్రభు త్వం నష్టపరిహారం చెల్లించి ఆయన కు టుంబాన్ని ఆదుకోవాలని కోరారు. బీహార్, జార్ఖండ్ తదితర రాష్ర్టాల నుంచి వచ్చిన అధికారులు ముఖ్యమంత్రి వద్ద మార్కులు కొట్టేసేందుకు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. అక్రమంగా పెనాల్టీలు వేసిన అధికారులు, విద్యుత్ కనెక్షన్ తొలగించిన అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేకపోతే తాము శ్రీనివాస్‌రెడ్డి ఇచ్చిన మర ణ వాంగ్మూలం ఆధారంగా న్యాయపోరా టం చేస్తామని హెచ్చరించారు.