కామారెడ్డి, మార్చి 19: పట్టణంలో చెత్త సేకరణపై అధికారులకు చిత్తశుద్ధి లేకుండా పోయింది. బల్దియా పరిధిలోని ప్రధాన కూడళ్లలో చెత్త కుండీలు ఏర్పాటు చేయకపోవడంతో ప్రజలు చెత్తను ఎక్కడ పడితే అక్కడే పారవేస్తున్నారు. దీంతో రోడ్డుపై చెత్త పేరుకుపోతున్నది. పట్టణమంతా దుర్గంధభరితంగా తయారవుతున్నది. మూడు, నాలుగు రోజులపాటు చెత్త ఎక్కడికక్కడే ఉన్నా.. దాని గురించి అధికారులు పట్టించుకోవడం లేదు. ఆయా కాలనీల ప్రజలు ఫిర్యాదు చేసినా.. నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. సానిటరీ ఇన్స్పెక్టర్ సెలవులో ఉండడం, ఇన్చార్జి లేకపోవడంతో అన్ని పనులూ మున్సిపల్ కమిషనర్ చూసుకోవాల్సి వస్తున్నది. దీంతో పనులు సరిగ్గా కావడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.
అధికారులు, పాలకవర్గం మధ్య సమన్వయ లోపం..
తొమ్మిదిన్నరేండ్ల బీఆర్ఎస్ పాలనలో బల్దియా పాలకవర్గానికి, అధికారులకు మధ్య సత్సంబంధాలు కొనసాగేవి. దీంతో ఎక్కడ కూడా పారిశుద్ధ్య లోపం లేకుండా పట్టణాన్ని శుభ్రంగా ఉంచేవారు. కానీ ఏడాది కాలంగా పాలకవర్గం లేకపోవడంతో అధికారులు అలసత్వం వహించారనే ఆరోపణలు ఉన్నాయి. కొత్త పాలకవర్గం ఏర్పడి నెల రోజులు అవుతున్నా.. ఇప్పటికీ మార్పు మాత్రం కనిపించడం లేదు. గత సోమవారం జిల్లాకేంద్రంలో 5కే రన్ నిర్వహించిన సందర్భంగా అధికారులు, పాలకవర్గం మధ్య సమన్వయ లోపంతో సమయానికి ఎవరూ రాలేదు. అదనపు కలెక్టర్ మధుమోహన్ బల్దియా కార్యాలయానికి రాగా.. పట్టణంలో పారిశుద్ధ్య లోపంపై మున్సిపల్ చైర్పర్సన్ ఆయనతో మొరపెట్టుకున్నారు. బల్దియా కమిషనర్ రాజేందర్‌రెడ్డి సమస్యలు పట్టించుకోవడం లేదని, ఏది అడిగినా.. తనకు తెలియదని సమాధానం చెబుతున్నారని వాపోయారు. కొందరు కౌన్సిలర్ల ఫోన్లు కూడా లిఫ్ట్ చేయడం లేదన్నారు. కమిషనర్ ఒంటెద్దు పోకడపై నిరసన వ్యక్తంచేస్తూ బీఆర్ఎస్, బీజేపీ కౌన్సిలర్లు సమావేశం నుంచి వాకౌంట్ కూడా చేశారు. ఇప్పటికైనా అధికారులు, పాలకవర్గం అభివృద్ధిపై దృష్టి సారించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు
చెత్త కుండీలు ఏర్పాటు చేయకపోవడంపై ఆగ్రహం..
కాలనీల్లో చెత్త కుండీలు ఏర్పాటు చేయకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. వీధుల్లో మూలమలుపుల వద్ద చెత్త వేయడంతో దుర్గంధం వ్యాపించి, ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. సిబ్బంది తక్కువగా ఉండడంతో చెత్త సేకరణ సాధ్యం కావడం లేదనే విమర్శలు కూడా ఉన్నాయి. కార్మికులు తక్కువగా ఉండడంతో చెత్త పేరుకుపోతున్నది. దోమలు, ఈగలు వృద్ధి చెంది అవి ఇండ్లలోకి వస్తున్నాయి. ఫలితంగా ప్రజలు జ్వరాలు, ఇతర రోగాల బారిన పడుతున్నారు.
గతంలో ‘స్వచ్ఛ తెలంగాణ’..
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో స్వచ్ఛ తెలంగాణ పేరుతో పట్టణాల్లో ‘పట్టణ ప్రగతి’ నిర్వహించేవారు. కార్యక్రమంలో భాగంగా ప్రజలకు ఆరోగ్యం, పరిశుభ్రతపై అవగాహన కల్పించేవారు. రోడ్లపై చెత్త వేయకుండా చెత్త కుండీల్లోనే వేయాలని, ఇంటికి వచ్చే ఆటో, ట్రాక్టర్‌కు చెత్త అందజేసి, పట్టణాన్ని పరిశుభ్రంగా ఉండాలని సూచించేవారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పడిన అనంతరం శుభ్రతపై ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదని పట్టణ ప్రజలు విమర్శస్తున్నారు. పేరుకు మాత్రమే అభివృద్ధి చేస్తున్నామని చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో ఎలాంటి చర్యలూ లేవని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
చెత్త పేరుకుపోతున్నది..
ఫారెస్టు ఆఫీసు దగ్గర చెత్త కుప్పలా పేరుకపోతున్నది. అధికారులకు పలుమార్లు విన్నవించినప్పటికీ ఎలాంటి స్పందనా లేదు. చెత్త పేరుకుపోయి దోమలు, ఈగలు ఆలడంతో చాలా ఇబ్బంది పడుతున్నాం.
-చింతల ప్రసాద్‌గౌడ్, ఫారెస్టు ఆఫీస్ రోడ్
కార్మికుల నిరసనతో ఇబ్బందులు
పట్టణంలో సరిపడా కార్మికులు ఉన్నప్పటికీ ఈనెల జీతాలు రాలేదు. దీంతో పారిశుద్ధ్య సిబ్బంది యూనియన్ నాయకులతో కలిసి నిరసన తెలుపుతున్నారు. ఫలితంగా పట్టణంలో చెత్త పేరుకుపోయింది. ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకుంటా. ప్రజలు చెత్తను చెత్త డబ్బాల్లోనే వేసి పరిశుభ్రతకు సహకరించాలి.
-రాజేందర్‌రెడ్డి, కమిషనర్, కామారెడ్డి మున్సిపాలిటీ