సిద్దిపేట, మార్చి 19( నమస్తే తెలంగాణ ప్రతినిధి) : నర్మెటలో రైతుమేళాలో ప్రొటోకాల్ పాటించకపోవడం ఉద్రిక్తతకు దారితీసిం ది. రైతుమేళాకు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, మంత్రులు తుమ్మల నాగేశ్వరరా వు, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, గడ్డం వివేక్, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ తన్నీరు హరీశ్‌రావు, మెదక్ ఎంపీ రఘునందన్, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్, యాదవరెడ్డి తదితర నేతలు హాజరయ్యారు.
ప్రారంభోత్సవ ఫ్లెక్సీ లో స్థానిక ఎమ్మెల్యే హరీశ్‌రావు ఫొటో ఏర్పాటుచేయకపోవడంపై బీఆర్ఎస్ కార్యకర్తలు ఆగ్రహాంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. హరీశ్‌రావు మంత్రుల వద్దకు రాగానే ఆయనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఇరువర్గాల నినాదాలు, తోపులాట మధ్యనే రైతుమేళాను ప్రా రంభించారు. ఈ క్రమంలో పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తలను చెదరగొట్టారు. ఎమ్మెల్యే హరీశ్‌రావు, మంత్రులు తుమ్మల, పొన్నం సముదాయించడంతో గొడవ సద్దుమనిగింది.
రుణమాఫీ చేయకుండా రైతుభరోసా ఇవ్వకుండా మూడు సీజన్లుగా వడగండ్ల పరిహారం, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వకుండా ఎందుకీ రైతుమేళాలు అంటూ హరీశ్‌రావు మండిపడ్డారు. రైతులకు న్యాయం చేస్తానని దేవుళ్ల మీద ఒట్టేసిన ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి అన్నదాతల సమస్యలను వెంటనే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు నర్మెట రైతుమేళాకు హాజరైన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావుకు ఆయన వినతిపత్రం అందజేశారు. రైతుమేళా ఏర్పాటుచేసిన నర్మెటలో 725 రైతులుంటే సగం మందికి రుణమాఫీ కాలేదని.. ఈ ఒక్క గ్రామంలోనే రూ.3కోట్ల నగదు చెల్లించాల్సి ఉన్నదని, సిద్దిపేట నియోజకవర్గంలో రూ.300 కోట్ల రుణమాఫీ పెండింగ్ ఉన్నదని తెలిపారు.
నూటికి నూరు శాతం రుణమాఫీ చేస్తామని సగం మందికి కూడా చేయలేదని లేఖలో పేరొన్నారు. సిద్దిపేట నియోజకవర్గంలో 2024 సంవత్సరం వానకాలం రైతు భరోసా డబ్బులు రూ.70 కోట్లు, యాసంగి పంటకు రూ.30 కోట్ల వరకు ఇవ్వాలని హరీశ్‌రావు తెలిపారు. 2025 యాసంగికి సంబంధించి రూ.70 కోట్ల దాకా ప్రభుత్వం చెల్లించాల్సి ఉన్నదని పేర్కొన్నారు. మూడు సీజన్లకు కలిపి సిద్దిపేట నియోజకవర్గానికి రూ.170 కోట్ల దాకా ప్రభుత్వం రైతుబంధు భరోసా డబ్బులు బాకీ పడ్డదని, ఈ లెకన రాష్ట్రవ్యాప్తంగా రూ.25 వేల కోట్ల వరకు జమ చేయాల్సి ఉన్నదని వెంటనే చెల్లించాలని లేఖ ద్వారా డిమాండ్ చేశారు. బడ్జెట్ ప్రసంగంలో చెప్పినట్టు ఈ యాసంగి నుంచి ప్రతి ఎకరాకు పంట బీమా పథకం అమలుచేయాలని కోరారు.