Jajula Surender | హైదరాబాద్ : ఎల్లారెడ్డి నియోజకవర్గానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు విహారయాత్రకు వచ్చినట్టు వచ్చారని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జాజుల సురేందర్ విమర్శించారు. పంట నష్టం జరిగిన ప్రాంతాల్లో సీఎం రేవంత్ పర్యటించలేదని ఆయన మండిపడ్డారు. తెలంగాణ భవన్లో జాజుల సురేందర్ మీడియాతో మాట్లాడారు.
నిన్న కామారెడ్డి జిల్లాలోని ఎలారెడ్డి నియోజకవర్గంలో సీఎం పర్యటించారు. సీఎం పర్యటనతో తమకు ఉపశమనం దొరుకుతుందని ప్రజలు, రైతులు ఆశించారు. సీఎం పర్యటనకు ముందే నాతో సహా బీఆర్ఎస్ నేతలను హౌజ్ అరెస్టు చేశారు. ఇదేనా ప్రజా పాలనా..? వరదలు వచ్చి తొమ్మిది రోజులు గడిచింది. ఎల్లారెడ్డి నియోజవర్గంలో కొండాపూర్‌లో రెండు చెరువులు తెగిపోయి అనేక తండాలు జల దిగ్భంధంలో చిక్కుకున్నాయని మాజీ ఎమ్మెల్యే తెలిపారు.
పోచారం డ్యామ్ బ్యాక్ వాటర్ తగ్గిపోయి నష్టం తగ్గింది కానీ ప్రభుత్వం చేసిందేమి లేదు. ఎల్లారెడ్డి నియోజకవర్గానికి సీఎం, మంత్రులు విహార యాత్రకు వచ్చినట్టు వచ్చారు. ఎల్లారెడ్డి నియోజక వర్గం రైతులంటే అంత చులకనా..? ఓ పది లక్షల నష్టం జరిగిన చిన్న బ్రిడ్జిని చూడటానికి సీఎం వచ్చారు. పంట నష్టం జరిగిన ప్రాంతాల్లో సీఎం పర్యటించలేదు. దాదాపు 20 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగినా సీఎం సరిగా స్పందించలేదు. కేంద్ర నిధులపైనే సీఎం ఆధారపడ్డారు. ఇక్కడ వరదలు వచ్చి ప్రజలు అల్లాడుతుంటే సీఎం బీహార్ యాత్రలో మునిగి తేలారు. కేసీఆర్ హయాంలో గంటల్లో అధికారులు స్పందించే వారు.. కేసీఆర్ భాదితులకు ఉపశమనం కలిగించేవారు అని జాజుల సురేందర్ తెలిపారు.
సీఎం ఫోటోలు దిగేందుకే వచ్చినట్టుంది. సమీక్షలు కాదు సత్వర చర్యలు కావాలి. దాదాపు 18 వేల మంది రైతులు ఎల్లారెడ్డి నియోజకవర్గంలో నష్టపోయారు. నష్టపోయిన రైతులకు ఎకరాకు లక్ష రూపాయల పరిహారం ఇవ్వాలి. రబీ సీజన్లో రైతులకు ఉచిత ఎరువులు ఇవ్వాలి. సీఎం పర్యటనలో కాంగ్రెస్ నేతలు జిందాబాద్‌లు కొడుతున్నారు. సీఎం పరామర్శకు వచ్చారా..? ఏదైనా ప్రోగ్రామ్‌కు వచ్చారా? రైతులంటే రేవంత్ రెడ్డికి అంత నిర్లక్ష్యమా..? యూరియా కోసం లైన్లలో నిలబడ్డ రైతులను సీఎం సినిమా టిక్కెట్లకు నిలబడ్డ వారితో సీఎం పోల్చడం సిగ్గు చేటు. సీఎం రైతులను కించపరిచారు. రైతులకు యూరియా బతుకు దెరువు.. ఇంత తీవ్ర మైన సమస్యపై సీఎం అంత అవమానంగా మాట్లాడుతారా..? రైతులు రేవంత్‌కు బుద్ది చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో రైతులు ఓట్లేస్తేనే రేవంత్ అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు అదే రైతులు ఎపుడు ఎన్నికలు వస్తాయా కాంగ్రెస్‌కు గుణపాఠం ఎప్పుడు చెబుదామా అని ఆలోచిస్తున్నారు. రైతులను అపహాస్యం చేస్తే ఎవరైనా మూల్యం చెల్లించుకోవాల్సిందే. వరద బాధితులకు తగిన విధంగా సాయం అందకపోతే రైతులతో కలిసి బీఆర్ఎస్ ఉద్యమిస్తుంది అని జాజుల సురేందర్ హెచ్చరించారు.