Gandra Venkata Ramana Reddy | హైదరాబాద్ : రాష్ట్రంలో ఇసుక దోపిడీ విచ్చలవిడిగా జరుగుతోందని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇండ్ల పేరిట ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని తెలిపారు. బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి గండ్ర వెంకట రమణారెడ్డి తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు.
భూపాలపల్లి నియోజకవర్గం టేకుమట్ల మండలంలో ఇసుక దోపిడీపై మేము ధర్నా చేశాం. అయినా ప్రభుత్వ యంత్రాంగం నుంచి స్పందన లేదు. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా..? కొందరు కాంగ్రెస్ నేతలు దొంగే దొంగ అన్నట్టు ఇసుక దోపిడీకి వ్యతిరేకంగా మేము ధర్నా చేస్తుంటే పోటీ ధర్నాలు చేస్తున్నారు. మేము ప్రజల పక్షాన పోరాడుతుంటే పోలీసులు అడ్డుకుంటున్నారు. భూపాలపల్లి నియోజకవర్గమే కాదు.. మొత్తం గోదావరి పరివాహక ప్రాంతంలో కాంగ్రెస్ నేతల ప్రోద్భలంతో ఇసుక దోపిడీ జరుగుతోంది. ఈ దోపిడీ ఇలాగే కొనసాగితే మా ప్రాంతం ఎడారిగా మారడం ఖాయం. ఇకనైనా ప్రభుత్వం మేలుకోవాలి అని గండ్ర వెంకటరమణా రెడ్డి హెచ్చరించారు.
గ్రామ పంచాయతీలకు నిధులు కేటాయించక పోవడంతో పల్లెల్లో చీకట్లు అలముకున్నాయి. ఓటమి భయంతోనే రేవంత్ రెడ్డి స్థానిక ఎన్నికలు నిర్వహించడం లేదు. నిన్న ఢిల్లీలో సీఎం స్థానిక ఎన్నికలపై చేతులెత్తేశారు. పెద్ద గ్రామపంచాయతీకి రూ. 5 లక్షలు, చిన్న గ్రామ పంచాయతీలకు రూ. 3 లక్షలు కేటాయించాలి. సద్దుల బతుకమ్మ, దసరా పండగలకు పల్లెలకు వచ్చే జనం సౌకర్యం కోసమైనా గ్రామాల్లో సౌకర్యాలు మెరుగు పరచాలి. మంత్రి సీతక్క వెంటనే స్పందించాలి అని గండ్ర వెంకటరమణారెడ్డి స్పందించారు.
సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నపుడు మాట్లాడినట్టే మాట్లాడుతున్నారు. పల్లెలలో వసతులపై సీఎంకు శ్రద్ధ లేదు. సింగరేణి లాభాల్లో కార్మికులకు వాటాపై ప్రభుత్వం ఇంకా ఎందుకు ప్రకటన చేయడం లేదు. కేసీఆర్ సీఎంగా ఉన్నపుడు ఇలా ఎప్పుడైనా జరిగిందా..? ఢిల్లీకి సీఎం 55 సార్లు వెళ్లారు. సీఎం ఢిల్లీలో చిత్రవిచిత్రంగా మాట్లాడారు. ఫిరాయింపులపై సీఎం మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయి. అందరూ నవ్వుకుంటున్నారు. పార్టీలో చేరడానికి కండువాలు ప్రామాణికం కాకపోతే మరేవి ప్రామాణికం..? పార్టీ మారిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ టికెట్‌పై ఎంపీలుగా పోటీ చేయడం, ప్రచారం చేయడం సీఎంకు కనిపించడం లేదా..? సీఎంకు ప్రజలు అమాయకులుగా కనిపిస్తున్నారా..? ఏదీ మాట్లాడినా చెల్లుతుందా..? సీఎం ఇంత నిస్సిగ్గుగా మాట్లాడతారా..? అని మాజీ ఎమ్మెల్యే మండిపడ్డారు.
కడియం శ్రీహరితో పాటు సభలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి ఆయన అభివృద్ధి కోసం కాంగ్రెస్‌లో చేరారని చెప్పింది నిజం కాదా..? కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ను ఎందుకు విమర్శిస్తున్నారు? వారు బీఆర్ఎస్లో ఉంటే బీఆర్ఎస్ను ఎందుకు విమర్శిస్తారు..? గతంలో మేము పార్టీ మారినపుడు రాజ్యాంగ బద్దంగా నిబంధనల ప్రకారం వ్యవహరించాం. ఇప్పటికైనా సీఎం నిబంధనలకు లోబడి నడుచుకోవాలి. స్పీకర్ దగ్గర విషయం పెండింగ్‌లో ఉంది. ఆయన నిర్ణయం కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. ఎపుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ పార్టీకి ఓటమి తప్పదు. రేవంత్ పని అయిపోయింది అని గండ్ర వెంకట రమణారెడ్డి పేర్కొన్నారు.