నారాయణపేట, ఏప్రిల్ 16 : అధికారంలోకి వచ్చిన వెంటనే రుణమాఫీ చేస్తామని చెప్పిన కాంగ్రెస్.. ఇప్పుడు ఆగస్టు 15 వరకు గడువు తీసుకోవడం హాస్యాస్పదమని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఎంపీ ఎన్నికల ముందే రుణమాఫీ చేయని ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల ముందు చేస్తుందా? అని అనుమానం వ్యక్తం చేశారు.
నారాయణపేట జిల్లా కేంద్రంలోని సింగారం చౌరస్తా వద్ద ఉన్న బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం కార్యకర్తలతో విస్త్రృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ..గత ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ ఒక్కటిగా పనిచేసి ప్రజలను విభజించి ఓట్లు దండుకున్నాయని విమర్శించారు.తాగు,సాగునీరు, కరెంట్ కోసం ఈ పదేండ్లలో ఎప్పుడూ ధర్నాలు చేయలేదని, ఇప్పుడు కాంగ్రెస్ పాలకుల తీరు కారణంగా నిరసన బాట పట్టాల్సి వచ్చిందని అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటికావడం అసాధ్యమని ఆయన స్పష్టం చేశారు.
ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ కృషితోనే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం 90 శాతం పూర్తయిందన్నారు. తెలంగాణ రాకముందు, వచ్చాక ఎలా ఉందో ప్రజలు బేరీజు వేసుకోవాలని సూచించారు. ఈ ఎన్నికలో తనను మరోసారి గెలిపించాలని ఆయన కోరారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, అంజయ్య యాదవ్, మున్సిపల్ చైర్పర్సన్ అనసూయ తదితరులు పాల్గొన్నారు.