Harish Rao | హైదరాబాద్, జనవరి 4 (నమస్తే తెలంగాణ) : ‘అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు మాట్లాడి శాసనసభ వ్యవస్థను తప్పుదోవ పట్టించిన నీ నాలుక కోయాల్నా? ఎవరి నాలుక కోయాలి రేవంత్‌రెడ్డీ?’ అని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ హరీశ్‌రావు పీపీటీలో ప్రశ్నించారు. మనిషివైతే, చీమూనెత్తురు ఉన్నోడైతే నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి అప్పగించొద్దని నాటి సీఎం కేసీఆర్ స్పష్టంగా చెప్తే ఆయన వ్యాఖ్యలను రేవంత్‌రెడ్డి వక్రీకరించారని హరీశ్‌రావు నిప్పులు చెరిగారు. ట్రిబ్యునల్2 అవార్డు వచ్చేంత వరకు ప్రాజెక్టుల అప్పగించబోమని, అదీగాక ఆ అంశం సుప్రీంకోర్టులో ఉన్న నేపథ్యంలో ప్రాజెక్టుల అప్పగింత ప్రశ్నే ఉత్పన్నం కాబోదని, కరాఖండిగా నాడు కేంద్రానికి తేల్చిచెప్పారని గుర్తుచేశారు.
అపెక్స్ కౌన్సిల్ మీటింగ్‌లో కేంద్ర మంత్రికి గౌరవసూచకంగా చేసిన వ్యాఖ్యలను సైతం 299 టీఎంసీలకు ఒప్పుకున్నట్టు సీఎం రేవంత్‌రెడ్డి చిత్రీకరించారని ధ్వజమెత్తారు. మోకాలుకు బోడిగుండుకు లింకు పెట్టి రేవంత్‌రెడ్డి నిస్సిగ్గుగా, నిర్లజ్జగా అబద్ధాలు ఆడారని నిప్పులు చెరిగారు. తెలంగాణ నీటివాటా కోసం ఏపీ ముఖ్యమంత్రులు చంద్రబాబు, జగన్మోహన్రెడ్డి ఇద్దరినీ కేసీఆర్ నిలదీశారని వెల్లడించారు. ‘రాష్ట్రం ఏర్పడిన 42 రోజుల్లోనే నదీజలాల్లో మా వాటాను పునఃపంపిణీ చేయాలని కేసీఆర్ కేంద్రానికి లేఖ రాశారని, పోతిరెడ్డిపాడు విస్తరణ అక్రమమని రెండో అపెక్స్ కౌన్సిల్ మీటింగ్‌లో కేంద్ర మంత్రి ఎదుటే నాటి ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డిని కేసీఆర్ నిలదీశారని, ‘నాన్ బేసిన్‌కు నీళ్లు తీసుకుపోతున్నరు బిడ్డా.. నీళ్లు ఆపకపోతే అలంపూర్ వద్ద పెద్ద బరాజ్ కట్టి నీళ్లు గుంజుతా’ అని హెచ్చరించారని వివరించారు. ఆ అంశాన్ని నాడు కేసీఆర్ క్యాబినెట్లో పెట్టి, ఆమోదించి జీవో విడుదల చేశారని గుర్తుచేశారు. ఆనాడు చంద్రబాబు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును వ్యతిరేకిస్తే కేసీఆర్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి, గతంలో ఆ జిల్లాను దత్తత తీసుకున్నారని చెప్పి వారి నోరుమూయించారని గుర్తుచేశారు.
బీజేపీ మ్యానిఫెస్టో, కాంగ్రెస్ మ్యానిఫెస్టో చూపించారని, పాలమూరు ప్రాజెక్టుకు అనుమతులిస్తానని చెప్పిన మోదీ వీడియోను చూపించారని, కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ సైతం ఒప్పుకున్నదని, ఎట్లా పాలమూరు ప్రాజెక్టును అపుతరని మొదటి అపెక్స్ కౌన్సిల్ మీటింగ్‌లోనూ చంద్రబాబు ముఖం ఎదుటే కేసీఆర్ నిలదీశారని వివరించారు. ‘నిక్కచ్చిగా తెలంగాణ నీళ్ల కోసం పోరాడిండు కేసీఆర్. నీళ్ల విషయంలో కేసీఆర్ అన్యాయం చేస్తాడంటే ఎవరైనా మెడమీద తలకొయ ఉన్నోడు నమ్ముతరా? తెలంగాణ సాధనకు తన ప్రాణాన్ని పణంగా పెట్టిన కేసీఆర్ నీళ్లలో తెలంగాణకు అన్యాయం చేస్తరా? మనిషి అనేటోడు మాట్లాడే మాటేనా? అందరినీ తప్పుదోవ పట్టించేలా రేవంత్‌రెడ్డి నిన్న అసెంబ్లీలో చిల్లరగా మాట్లాడారు’ అని హరీశ్‌రావు ఆక్షేపించారు.
ప్రస్తుత ఏపీ సీఎంపై ఇంత ధైర్యంగా మాట్లాడే దమ్ము రేవంత్‌రెడ్డికి ఉందా? అని ప్రశ్నించారు. ‘శాసనసభలో అబద్ధాలకు ఆస్కారం లేదని సీఎం రేవంత్ చెబితే బుద్ధి వచ్చిందానుకున్నామని, కానీ, ప్రభుత్వ అదనపు కార్యదర్శి చెప్పిన మాటలను కేసీఆర్‌కు ఆపాదించారని విమర్శించారు. నిజమనే పదానికి ప్రాణమే ఉంటే శాసనసభలో రేవంత్‌రెడ్డి మాటలకు ఉరేసుకుంటుండేనని నిప్పులు చెరిగారు. “అసెంబ్లీలో అబద్ధాలు మాట్లాడి మొత్తం శాసనసభ వ్యవస్థను తప్పుదోవ పట్టించిన నీ నాలుక కోయాల్నా, ఎవరి నాలుక కోయాలో చెప్పు రేవంత్‌రెడ్డీ?. చీము నెత్తురు ఉన్నోడైతే, మనిషైతే, ఈ రకంగా శాసనసభను తప్పుదోవ పట్టించి, ఇంత ఘోరంగా ఎక్స్పోజు అయినోడు నేరుగా రాజ్‌భవన్‌కు పోయి రాజీనామా చేయాలి’ అని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.
గోదావరి నదీ జలాలపై శాశ్వత హక్కులు..
రాష్ర్టాన్ని సుదీర్ఘకాలం పరిపాలించిన కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాల కంటే కూడా పదేండ్ల బీఆర్ఎస్ సర్కార్ గోదావరి నదీ జలాలపై ఎక్కువ హక్కులు సాధించిందని హరీశ్‌రావు చెప్పారు. కాకతీయులు, నిజాం పాలన కాలంలో 1948 వరకు 252.78 టీఎంసీలకు, 60 ఏండ్ల కాంగ్రెస్, డీడీపీ పాలనలో 265.69 టీఎంసీలకు హక్కులు మాత్రమే వచ్చాయని, తొమ్మిదిన్నరేండ్ల బీఆర్ఎస్ పాలనలో 383.45 టీఎంసీలపై హక్కులను కేసీఆర్ సాధించారని వెల్లడించాఉ. 60 ఏళ్లలో సాధించిన దానికంటే 1.44 రెట్లు ఎక్కువ బీఆర్ఎస్ సాధించిందని, బీఆర్ఎస్ ప్రతిఏటా 40 టీఎంసీలు సాధిస్తే, కాంగ్రెస్, టీడీపీ 4.43 టీఎంసీలు సాధించాయని వివరించారు. భవిష్యత్‌లో ట్రిబ్యునల్ ఏర్పాటు చేసిన తెలంగాణకు ఇబ్బంది లేకుండా ఉండేలా గోదావరి నదీ జలాల్లో తెలంగాణ వాటాకు సంబంధించి 968 టీఎంసీలకు గాను ఇప్పటికే 933 టీఎంసీలకు హక్కులను కేసీఆర్ కల్పించారని, అదీ కేసీఆర్ దూరదృష్టికి నిదర్శనమని హరీశ్‌రావు కొనియాడారు.
అరేంజ్‌మెంట్‌కు.. అగ్రిమెంట్‌కు తేడా తెలియదా..
ఇక కృష్ణాలో ఉమ్మడి ఏపీకి ట్రిబ్యునల్-1 కేటాయించిన 811 నికర జలాల్లో తెలంగాణ వాటా 299 టీఎంసీలేనని, కానీ 490 టీఎంసీలకు ఉమ్మడి రాష్ట్రంలోనే అనుమతులు వచ్చినట్లు అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి మరో అబద్ధం చెప్పారని విమర్శించారు. ట్రిబ్యునల్-2 కేటాయించిన 191 టీఎంసీలు వరద జలాల మీద ఆధారపడ్డాయని, అవార్డు ఇంకా అమల్లోకి రాలేదని, వస్తే ఆ వాటా కూడా వస్తుందని హరీశ్‌రావు గుర్తుచేశారు. కానీ ఈ విషయాలను వక్రీకరించారని ధ్వజమెత్తారు. ఉమ్మడి రాష్ట్రంలో 68శాతం కృష్ణానదీ పరీవాహక ప్రాంతమున్న తెలంగాణకు 34శాతం జలాలను(299 టీఎంసీలు), అదే 32శాతం పరివాహక ప్రాంతమున్న ఏపీకి మాత్రం 66శాతం జలాలు (512 టీఎంసీలు) కేటాయించి తెలంగాణ గొంతు కోసింది కాంగ్రెస్సేనని నిప్పులు చెరిగారు.
ఆ లెక్కలనే 2013లో జరిగిన ఏపీ పునర్విభజన చట్టం ముసాయిదా బిల్లు చర్చ సందర్భంగా అసెంబ్లీలో పెట్టారని గుర్తుచేశారు. ఆ లెక్కల ఆధారంగానే రాష్ట్ర ఏర్పాటు అనంతరం తాత్కాలికంగా నీటివినియోగాల కోసం ఏడాది కాలపరిమితితో ఇరు రాష్ర్టాలు వర్కింగ్ అరెంజ్మెంట్ 2015-16లో చేసుకున్నాయని, అదీగాక అరెంజ్మెంట్ను ఏ వేదికపైనా చెల్లించకుండా నాటి తెలంగాణ సలహాదారు ఆర్ విద్యాసాగర్‌రావు కట్టుదిట్టమైన షరతులను కూడా విధించారని గుర్తుచేశారు.ఆ విషయం అనాటి సమావేశ మినిట్స్‌లో స్పష్టంగా పేర్కొన్నారని, దానిపై ఏపీ తరఫున సంతకం చేసింది చంద్రబాబు దాసుడు, ప్రస్తుత తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ సలహాదారుడైన ఆదిత్యనాథ్‌దాస్ అని గుర్తుచేశారు. కానీ అరేంజ్‌మెంట్‌కు, అగ్రిమెంట్‌కు మధ్య తేడా తెలియకుండా సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపణలు చేస్తున్నారని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు.

అవసరమైతే హత్యాయత్నం చేయిస్తడు
‘పైన రెండులైన్లు, కింది రెండులైన్లు కలిపి చదువుతడు. కింద రెండు లైన్లు, పైన కొన్ని లైన్లు కలుపుతడు. మీటింగ్ ప్రారంభంతో థ్యాంక్స్ చెప్తే.. 299 టీఎంసీలకు థ్యాంక్స్ చెప్పినట్టుగా ఆపాదిస్తడు. నిండు శాసనసభను తప్పుదోవ పట్టించినవ్. అసలు నీవ్వు మనిషివా? నాకు తెలుసు.. ఇట్లా మాట్లాడినందుకు నా మీద అక్రమ కేసులు పెట్టిస్తడు. దాడులు చేయిస్తడు, అవసరమైతే హత్యాయత్నం కూడా చేయిస్తడు. దానికి నేనేమీ భయపడను. గతంలో వరద బాధితులను పరామర్శించడానికి ఖమ్మం వెళ్తే అక్కడ రాళ్ల దాడి చేయించారు’ అని హరీశ్‌రావు పేర్కొన్నారు. ఎన్నికల ముందు తెలంగాణలోని దేవుళ్ల మీద ప్రమాణం చేసి ఒక్క హామీని కూడా అమలుచేయని సీఎం రేవంత్‌రెడ్డి మళ్లీ అసెంబ్లీ సాక్షిగా మరోసారి దేవుడి మీద ఆన అంటూ అసత్యాలే మాట్లాడారని హరీశ్‌రావు ఎద్దేవాచేశారు.
కృష్ణా నది నీటి వినియోగ సామర్థ్యంలో బీఆర్ఎస్ టాప్
రాష్ట్ర ఏర్పాటు సమయంలోనూ ఉమ్మడి పాలకులు తెలంగాణను అష్టదిగ్బంధనం చేశారని, ప్రాజెక్టు కట్టాలంటే కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ, అపెక్స్ కౌన్సిల్, సీడబ్ల్యూసీ అనుమతి తీసుకోవాలనే షరతులు, నీటి కేటాయింపులు చేసుకోవాలంటూ చక్రబంధం ఇరికించారని తెలిపారు. అనేక సవాళ్ల మధ్య కూడా కేసీఆర్ పాలమూరు- రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులను కట్టే ప్రయత్నం చేస్తూనే, పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టారని వివరించారు. ఫలితంగానే సాగర్ ప్రాజెక్టుతో కలుపుకొని కృషా నీటి వినియోగ సామర్థ్యం బీఆర్ఎస్ హయాంలో పెరిగిందని హరీశ్‌రావు చెప్పారు. ప్రాజెక్టుల అనుమతుల సాధనలోనూ బీఆర్ఎస్ సర్కార్ ముందున్నదని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేండ్లయినా ఒక్క ప్రాజెక్టు అనుమతించలేదని, కానీ పాలమూరు-రంగారెడ్డి, అంబేద్కర్-వార్ధా, కాళేశ్వరం అదనపు టీఎంసీ 3 ప్రాజెక్టుల డీపీఆర్‌లను వెనక్కి తీసుకువచ్చిందని విమర్శించారు. ఎంపీలుగా తమకు అనుభవం ఉన్నదని చెప్పుకొనే కాంగ్రెస్ నేతలు ఇందుకు సిగ్గుతో తలదించుకోవాలని ఘాటుగా విమర్శించారు.
నాగార్జునసాగర్ ప్రాజెక్టుతో కలుపుకొని కృష్ణానదిలో నీటి వినియోగంలో బీఆర్ఎస్ సర్కార్ టాప్‌లో ఉన్నది. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ హయాంలో వాడుకున్న నీళ్లు 228.9 టీఎంసీలు. అదే బీఆర్ఎస్ హయాంలో 2014 నుంచి 2023 వరకు వాడుకున్న నీళ్లు 284.8 టీఎంసీలు. బీఆర్ఎస్ హయాంలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేయడం వల్ల కృష్ణా నీటిలో మన వినియోగం పెరిగింది.-హరీశ్‌రావు
నాన్ బేసిన్‌కు నీళ్లు తీసుకుపోతున్నరు బిడ్డా.. నీళ్లు ఆపకపోతే అలంపూర్ వద్ద పెద్ద బరాజ్ కట్టి నీళ్లు గుంజుతానని కేసీఆర్ హెచ్చరించారు. ఈ అంశాన్ని నాడు కేసీఆర్ క్యాబినెట్లో పెట్టి, ఆమోదించి జీవో కూడా విడుదల చేశారు. కేసీఆర్.. వైఎస్ జగన్‌ను నిలదీసిన అంశాన్ని రేవంత్‌రెడ్డి పేర్కొనలేదు. ఏపీ సీఎంపై ఇంత ధైర్యంగా మాట్లాడే దమ్ము రేవంత్‌రెడ్డికి ఉన్నదా? -హరీశ్‌రావు
గోదావరిలో సాధించిన నీటి హక్కులు (టీఎంసీల్లో)
(కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు 60 ఏండ్లలో సాధించిన నీటి హక్కుల కంటే బీఆర్ఎస్ తొమ్మిదిన్నరేండ్లలో 1.4 రెట్లు ఎక్కువ సాధించింది. సగటున ఏటా కాంగ్రెస్, టీడీపీలు 4.43 టీఎంసీలు సాధిస్తే, బీఆర్ఎస్ 40.36 టీఎంసీలు సాధించింది.)
నీటి వినియోగాలు..
కృష్ణా జలాల కేటాయింపు
ప్రాజెక్టుల అనుమతుల సాధన
కృష్ణా, గోదావరి బీఆర్ఎస్ కాంగ్రెస్