Challa Dharma reddy | పరకాల, జూన్ 6 : బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గృహలక్ష్మి పథకంలో భాగంగా నియోజకవర్గ వ్యాప్తంగా ఎంపికైన లబ్ధిదారులను తీసేసి కాంగ్రెస్ పార్టీ అనుచరులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడం ఆ పార్టీ దుశ్చర్యలకు నిదర్శనమని మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న మాజీ ఎమ్మెల్యే ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల జాబితాపై స్పందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం కేసీఆర్ చొరవతో నియోజకవర్గంలో గృహాలక్ష్మీ పథకానికి 3000 మంది లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగిందన్నారు. వారికి అప్పటి జిల్లా కలెక్టర్లు లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేయగా చాలా మంది లబ్దిదారులు గృహలక్ష్మీ ఇంటి నిర్మాణాను ప్రారంభించి సొంతింటి నిర్మాణాన్ని చేపట్టి సగం పనులు పూర్తి చేసుకున్నారని పేర్కొన్నారు. కానీ మోసపూరిత, అమలు కానీ హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ గృహలక్ష్మి నిధులు ఆపేసిందని, దీంతో గృహలక్ష్మీ బిల్లులు వస్తాయని అప్పులు చేసి ఇంటి నిర్మాణలను చేపట్టిన లబ్దిదారులు రోడ్డున పడ్డారని విమర్శించారు. తమకు న్యాయం చేయాలని ఎన్ని సార్లు ప్రభుత్వానికి విన్నవించుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం లబ్దిదారులను పట్టించుకోకపోవడమే కాకుండా నిధులు మంజూరు చేయలేదని విమర్శించారు.
దీంతో పలువురు లబ్దిదారులు కోర్టును ఆశ్రయించడంతో లబ్ధిదారులకు అనుకూలంగా న్యాయస్థానం స్పందించి గృహలక్ష్మి లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల పథకంలో చేర్చి ఆర్థిక సాయం అందజేయాలని ఆదేశాలను సైతం కోర్టు జారీ చేసిందన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా గృహలక్ష్మీ లబ్దిదారులను ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు. కోర్టు తీర్పు తమకు వ్యతిరేకంగా రావడంతో స్థానిక ఎమ్మెల్యే అధికారంలో ఉన్నాము కదా అని బీఆర్ఎస్ ప్రభుత్వ హాయాంలో గృహాలక్ష్మీ పథకానికి ఎంపికైన అసలైన లబ్ధిదారులను పక్కన పెట్టి తమ పార్టీ కార్యకర్తలకు, అనుచరులను ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులగా ఎంపిక చేశారని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ కుల మతాలకు, రాజకీయాలకు అతీతంగా పారదర్శకంగా గృహలక్ష్మీ లబ్దిదారులను ఎంపిక చేయడం జరిగిందని, కానీ కాంగ్రెస్ పాలనలో మాత్రం తమ నాయకులకు కార్యకర్తలను, అనర్హులను ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులగా ఎంపిక చేశారని ఎద్దేవా చేశారు. ఇప్పటికైన కండ్లు తెరిచి అసలైన లబ్ధిదారులకు అండగా ఉండాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. లేనిపక్షంలో జిల్లాలోని లబ్ధిదారులందరితో కల్సి ధర్నాలు, రాస్తోరోకోలతో నిరసన తెలుపడంతో పాటు వారికి న్యాయం జరిగే వరకు పోరాడతామని హెచ్చరించారు.