BRS | హైదరాబాద్, జూన్ 6 (నమస్తే తెలంగాణ): పార్లమెంట్ ఎన్నికల్లో వెలువడిన ఫలితాలు, పార్టీ ఎదుర్కొన్న పరిస్థితిపై తెలంగాణ ఉద్యమ పార్టీ బీఆర్ఎస్లో సమాలోచనలు మొదలైనట్టు తెలుస్తున్నది. టీఆర్ఎస్ ఆవిర్భావం అనంతరం వచ్చిన ఏ ఎన్నికల్లోనూ ఎదురుకాని పరిస్థితి ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఎదురుకావడాన్ని పార్టీ అధినాయకత్వం తీవ్రంగా పరిగణిస్తున్నది. దేశంలో సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడుతున్న క్రమంలో ప్రస్తుతం ప్రాంతీయ పార్టీలదే పైచేయి అవుతున్నది. ఈ క్రమంలో బీఆర్ఎస్ అనుకున్న మేరకు సీట్లు సాధించి ఉంటే రాష్ట్ర హక్కుల సాధన కోసం పోరాడే అవకాశం లభించి ఉండేదన్న అభిప్రాయాలు పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. పార్టీ అధినేత కేసీఆర్ పాల్గొన్న రోడ్డుషోలు, బహిరంగ సభలకు ఇసుకవేస్తే రాలనంత జనం వచ్చారు. కానీ అవన్నీ ఓట్ల రూపంలో బదిలీ కాకపోవడంతో లోపం ఎక్కడ జరిగిందోనన్న చర్చ పార్టీ వర్గాల్లో సాగుతున్నది. ఐదు నెలల క్రితం అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు వచ్చిన ఓట్లు, లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులకు పోలైన ఓట్ల శాతంలో గణనీయమైన మార్పు కనిపిస్తున్నది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు వచ్చిన ఓట్లు లోక్‌సభ ఎన్నికల్లో కూడా వచ్చి ఉంటే.. కనీసం 5 నుంచి 6 స్థానాలు దక్కేవి. అప్పుడు తెలంగాణ హక్కుల రక్షణకు భరోసా లభించేది. ఇప్పుడు ఆ అవకాశాన్ని బీఆర్ఎస్ కోల్పోయిందా అంటూ గులాబీ శ్రేణులు చర్చించుకుంటున్నారు.

ఎన్నికల సందర్భంగా పార్టీ నుంచి వెళ్లిపోయిన వారెలాగూ వెళ్లిపోయారు.. కానీ పార్టీలోనే ఉంటూ వెన్నుపోటు పొడిచినవారెవరు? అన్న విషయాలను తీవ్రంగా పరిగణించి భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకోవాలని తెలంగాణ ఉద్యమకారులు, మేధావులు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌కు సూచించినట్టు విశ్వసనీయ సమాచారం. పార్టీలోనే ఉంటూ నష్టంచేసే వారిని మొదటి నుంచి ఉపేక్షిస్తుండటం వల్లనే ఈ స్థాయిలో నష్టం జరిగిందని, ఇకపై వారిపట్ల ఉదారంగా వ్యవహరించకుండా కఠినంగా వ్యవహరించాలని కేసీఆర్‌కు చెప్పినట్టు తెలిసింది. పార్టీలో, ప్రభుత్వంలో అన్నిరకాల అవకాశాలు, గౌరవాలు పొందినవారే పార్టీకి తీరని అన్యాయం చేశారని అటువంటి వారి పట్ల నిర్దయంగా ఉండాలని సూచించినట్టు సమాచారం.
మరోవైపు భవిష్యత్తు కార్యాచరణపై పార్టీముఖ్యనేతలతో కేసీఆర్ లోతైన సమాలోచనలు జరుపుతున్నట్టు విశ్వసనీయవర్గాల సమాచారం. లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాకపోవటం వల్ల రాజకీయాలకు దూరమైనట్టు కాదని, ప్రజల పక్షాన పోరాడటంలో వెనుకంజ వేసే ప్రసక్తే లేదని గులాబీశ్రేణుల్లో ఆత్మస్థయిర్యం నింపే ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ ఫిరాయింపుల చట్టానికి విరుద్ధంగా బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ చేర్చుకోవటాన్ని తీవ్రంగా పరిగణించి ఇప్పటికే పలు వేదికల మీద పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. పార్టీ మారిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిపై అనర్హతవేటు విషయంలో బీఆర్ఎస్ పార్టీ రాజీలేని పోరాటం చేయటంలో అలసత్వం చేయకూడదని ఈ దిశగా కార్యాచరణను రూపొందించాలని పలువురు పార్టీ ముఖ్యనేతలు కేసీఆర్‌కు సూచించినట్టు తెలుస్తున్నది. మొత్తంగా పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు సహా మాజీ మంత్రులు, ముఖ్యనేతలు భవిష్యత్తు కార్యాచరణపై మంతనాలు నెరుపుతున్నట్టు సమాచారం
పార్లమెంట్ ఎన్నికల అనంతరం రాష్ట్రంలో రాజకీయంగా అనుసరించాల్సిన వైఖరిపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ ముఖ్యనేతలతో సమాలోచనలు జరుపుతున్నారు. మాజీ మంత్రులు, ప్రస్తుత, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్యనేతలతో కేసీఆర్ దశలవారీగా మంతనాలు జరుపుతున్నట్టు సమాచారం. తమదే గెలుపు అని ఆశించిన అభ్యర్థులకు, ఆయా నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కష్టపడి పనిచేసిన ముఖ్యనాయకులకు కేసీఆర్ ఫోన్లు చేసి మాట్లాడుతున్నట్టు తెలిసింది. గెలిచిన నాడు పొంగిపోవడం, ఓడిపోతే కుంగిపోవడం రాజకీయ నాయకుల లక్షణం కాకూడదని, ప్రజలు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా మసలుకొని ముందుకుసాగాలని హితబోధ చేసినట్టు సమాచారం. అలాగే పార్టీ ఆవిర్భావం నుంచి ఇటువంటి గెలుపోటములు అనేకం చవిచూశామని, ఉత్థానపతనాలను బేరీజు వేసుకొని ముందుకు సాగడటమే తప్ప కుంగిపోకూడదని సూచించినట్టు తెలిసింది.