హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ పెద్దలే గద్దలుగా మారి ప్రజాధనాన్ని దోపిడీ చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. యథేచ్ఛగా నిబంధనలను కాలరాస్తూ, భూ కబ్జాలకు పాల్పడుతూ, అక్రమ మైనింగ్ చేస్తూ సర్కార్ సొమ్మును దిగమింగుతున్నారని నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వాటా లు పంచుకుంటూ లూటీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రక్షించాల్సిన పాలకులే భక్షకులుగా మారితే ఇక ప్రజలకెవరు దిక్కని ఆవేదన వ్యక్తంచేశారు. పొంగులేటికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ అక్రమాలు చేసిందని అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకొన్న ముఖ్యమంత్రి సభాసంఘం వేయమంటే పారిపోయారని దెప్పిపొడిచారు. అక్రమాలు నిగ్గుతేల్చాలని అడిగిన ప్రతిపక్షం గొంతునొక్కి డైవర్షన్ డ్రామాలకు తెరలేపారని దుయ్యబట్టారు. మంత్రి పొంగులేటి భూ కబ్జాలు, రాఘవ కన్స్ట్రక్షన్స్ అక్రమ మైనింగ్‌పై సోమవారం గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేసిన అనంతరం లోక్‌భవన్ వద్ద కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో రేవంత్ సర్కార్ సాగిస్తున్న అరాచక పాలనపై గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. పొంగులేటికి చెందిన రాఘవ కంపెనీ నిబంధనలను తుంగలో తొక్కి జంటజలాశయాలైన హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్, అవుటర్ రింగ్‌రోడ్డు పరిధిలో అక్రమ మైనింగ్ చేస్తున్నదని ఆరోపించారు.
రాఘవ కంపెనీ అక్రమ మైనింగ్‌పై బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు ఆధారాలతో బట్టబయలు చేశారని కేటీఆర్ గుర్తుచేశారు. ఆత్మరక్షణలో పడ్డ అధికారపక్షం ఎదురుదాడికి దిగి తప్పించుకున్నదని మండిపడ్డారు. అక్రమాలను ఒప్పుకొన్న సీఎం రేవంత్‌రెడ్డి సీబీసీఐడీ విచారణ చేయిస్తామనడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్ర హోంమంత్రి కింద పనిచేసే పోలీసుల దర్యాప్తుతో ఒరిగేదేమీ ఉండదని స్పష్టంచేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రిని పోలీసులు ప్రశ్నించడం సాధ్యమవుతుందా? అని ప్రశ్నించారు. అందుకే బీఆర్ఎస్ హౌస్ కమిటీ లేదంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, లేదంటే మంత్రిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశామని గుర్తుచేశారు. కానీ తమ గొంతు నొక్కి, సభానాయకుడైన రేవంత్‌రెడ్డి అడ్డదిడ్డంగా మాట్లాడి.. అబద్ధాలు చెప్పి మభ్యపెట్టేందుకు యత్నించారని ధ్వజమెత్తారు. రాఘవ అక్రమాలపై నిగ్గుతేల్చాలని అడిగితే అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. మండలిలో ప్రశ్నించిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను సైతం బయటకు పంపించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాలకుడు కాదు. బ్లాక్ మెయిల్‌కు బ్రాండ్ అంబాసిడర్. రైట్ టూ ఇన్ఫర్మేషన్ యాక్ట్‌ను రూట్ టూ ఇన్కంగా మార్చుకున్న ఘనుడు. ఇందిరమ్మ పాలన తెస్తామని చెప్పినట్టే ఆనాటి ఎమర్జెన్సీ రోజులు తెచ్చిండు. ప్రజాపాలన పేరిట నిర్బంధ పాలన నడుపుతున్నడు.
– కేటీఆర్
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాలకుడు కాదని, బ్లాక్ మెయిల్‌కు బ్రాండ్ అంబాసిడర్ అని కేటీఆర్ అభివర్ణించారు. రైట్ టూ ఇన్ఫర్మేషన్ యాక్ట్‌ను రూట్ టూ ఇన్కంగా మార్చుకున్న ఘనుడని విరుచుకుపడ్డారు. ఇందిరమ్మ పాలన తెస్తామని చెప్పినట్లే ఆనాటి ఎమర్జెన్సీ రోజులు తీసుకువచ్చారని విమర్శించారు. ప్రజాపాలన పేరిట నిర్బంధ పాలన నడుపుతున్నారని తూర్పారబట్టారు. రేవంత్ పాలనలో అక్రమ మైనింగ్, భూకబ్జాలకు అడ్డుకట్ట పడదని భావించే గవర్నర్ తలుపులు తట్టామని స్పష్టంచేశారు. తమ వినతులపై గవర్నర్ సైతం సానుకూలంగా స్పందించారని ఆశిస్తున్నట్టు తెలిపారు.
రేవంత్ సర్కార్ అక్రమాలను అడ్డుకోవాల్సిన బీజేపీ అధికార పార్టీకి వంతపాడటం దురదృష్టకరమని కేటీఆర్ వాపోయారు. అసెంబ్లీలో నిలదీయకుండా మౌనం వహించడంలోని ఆంతర్యమేంటని ప్రశ్నించారు. ఏదేమైనా ప్రభుత్వ పెద్దలు చేస్తున్న అక్రమాలను వదిలిపెట్టబోమని తేల్చిచెప్పారు. రేవంత్ సూచన మేరకు ఇప్పటికే 14 కుంభకోణాలపై విచారణ జరపాలని లేఖ రాసిన విషయాన్ని ప్రస్తావించారు. ఆయనకు చిత్తశుద్ధి ఉంటే విచారణ జరిపి ప్రజాధనాన్ని కాపాడాలని డిమాండ్ చేశారు. కానీ అసెంబ్లీలో ఆయన వ్యవహరించిన తీరును చూసిన తర్వాత నమ్మకం పోయిందని చెప్పారు. ఏదేమైనా ప్రజాపాలన పేరిట సాగిస్తున్న ప్రభుత్వ దోపిడీని ప్రజాక్షేత్రంలో ఎండగడుతామని హెచ్చరించారు. భవిష్యత్తులోనూ కాంగ్రెస్ స్కామ్‌లను వెలికితీసి ప్రజాధనాన్ని కాపాడుతామని స్పష్టంచేశారు. ఇందుకు సంబంధించి త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు.
హౌస్ కమిటీలకు విలువలేదని డిప్యూ టీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబు సభాసాక్షిగా చెప్పడం విడ్డూరమని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ‘కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ పార్లమెంట్లో హౌస్ కమిటీలు వేయాలని డిమాండ్ చేస్తరు.. ఇక్కడేమో ముఖ్యమంత్రి, మంత్రులు ఒప్పుకోమంటరు.. ఇదేం పద్ధతి? అక్కడ ఒకతీరు..ఇక్కడ మరో తీరా? రాహుల్ మాట్లాడితే సబబు.. మేం మాట్లాడితే తప్పా? అని ప్రశ్నాస్త్రాలు సంధించారు.