హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ) : ‘తెలంగాణలో గ్రూప్-1 మెయిన్ పరీక్ష ల్లో దేశంలోనే అతి పెద్ద స్కామ్ జరిగింది. ఈ పరీక్షలపై హైకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టులాంటిది. సీఎం రేవంత్‌రెడ్డి ఈ పోస్టులను అమ్ముకున్నారు. ఈ పరీక్షలపై సత్వరమే సీబీఐతో దర్యాప్తు జరిపించా లి’ అని బీఆర్ఎస్ హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి డిమాండ్ చేశారు. హైదరాబాద్ తెలంగాణభవన్‌లో మంగళవారం ఆయన మీడియా తో మాట్లాడారు. టీజీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ లో తప్పులు జరిగాయని హైకోర్టు నమ్మిందని, అందుకే రీవాల్యుయేషన్ లేదా రీ ఎగ్జామ్ పెట్టాలని ఆదేశించిందని చెప్పారు. రీ వాల్యుయేషన్‌కు అంగీకరించబోమని, రీ ఎగ్జామ్ పెట్టాల్సిందేనని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ పెద్ద ఎత్తున డబ్బులు తీసుకుని గ్రూప్-1 పోస్టులను అమ్ముకున్నారని ఆరోపించారు. రేవంత్‌పై సీబీఐ విచారణను కేంద్ర మంత్రి బండి సంజయ్ కోరాలని సూచించారు. గ్రూప్-1పై తాను మాట్లాడితే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారని, ఇప్పుడు రేవంత్ ముఖం ఎకడ పెట్టుకుంటారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో పేపర్ లీక్ అయితే కేసీఆర్ పరీక్షనే రద్దుచేశారని, రేవంత్ ఎందుకు మెయిన్స్ రద్దు చేయలేదని నిలదీశారు. రేవంత్‌రెడ్డి సర్కారు గ్రూప్-1 ఎగ్జామ్‌ను మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేశారు.
గ్రూప్-1 పరీక్షల్లో గోల్‌మాల్‌పై సీఎం రేవంత్‌పై దేశద్రోహం కేసు పెట్టాలని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ పరీక్షలపై హైకోర్టు 8 నెలల్లో రీవాల్యూయేషన్ లేదా రీ ఎగ్జామ్ పెట్టాలని తీర్పు ఇచ్చిందని కానీ, తిరిగి పరీక్షలు నిర్వహించాల్సిందేనని డిమాండ్ చేశా రు. నిజాయితీగా పరీక్ష రాసిన వారికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని తెలిపారు. నాడు గ్రూప్-1 అవకతవకలపై ప్రశ్నిస్తే తనకు పరువు నష్టం నోటీసులు ఇచ్చారని, కౌశిక్‌రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టారని తెలిపారు. ఇప్పుడు హైకోర్టును ఏం చే స్తారని ప్రశ్నించారు. ‘ఈ తీర్పు కాంగ్రెస్ నయవంచనను తట్టుకొని నిలబడిన నిరుద్యోగ యువత విజయం. ఇండ్లవద్ద ఆరాటపడుతున్న అమ్మానాన్నల విజయం. అశోక్‌నగర్‌లో ఇరుకు గదుల్లో మగ్గుతూ పట్టుదలతో చదువుతున్న నిరుపేద యువత విజయం. కాంగ్రెస్ అరాచకాలకు అడ్డుగోడలా నిలుస్తున్న బీఆర్ఎస్ విజయం’ అని రాకేశ్‌రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ వచ్చాక న్యాయవ్యవస్థపై నమ్మకం కలుగుతున్నదని, నిబంధనలకు విరుద్ధంగా వెళ్తున్న ఈ సర్కారుకు అడుగడుగునా హైకోర్టు మొట్టికాయలు వేస్తున్నదని బీసీ కమిషన్ మాజీ సభ్యుడు ఉపేంద్రచారి తెలిపారు. సమావేశంలో బీఆర్ఎస్వీ ఉపాధ్యక్షుడు తుంగబాలు, నిఖిల్ పాల్గొన్నారు.