హైదరాబాద్ ఆగస్టు 21 (నమస్తేతెలంగాణ): పీఎం ఏక్తామాల్ ప్రాజెక్ట్ టెండర్లను వెంటనే రద్దు చేయాలని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా రేవంత్ సర్కార్ రియల్ ఎస్టేట్ దందాకు తెరలేపిందని ఆయన ఆరోపించారు. శనివారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేత మఠం భిక్షపతి, మహిళా నేత సుమిత్రాఆనంద్తో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద చేతివృత్తుల కళాకారుల మాల్‌ను బడాబాబులకు కట్టబెట్టేందుకు కుట్రలు చేస్తున్నదని ధ్వజమెత్తారు. ప్రాజెక్ట్ అనుమతులపై సీబీఐ, సీఏజీ, లోక్‌పాల్ ద్వారా సమగ్ర విచారణ జరిపించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఇప్పటికే లోకాయుక్తను కలిసి ఫిర్యాదు చేశామని, త్వరలోనే లోక్‌పాల్‌కు ఫిర్యాదు చేస్తామని ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన పీఎం ఏక్తామాల్‌ను రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బడాబాబులకు దోచిపెడుతున్న తీరును ఆధారాలతో ఎండగట్టారు. ఈ ప్రాజెక్ట్‌లో అక్రమాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేఖ రాసిన తర్వాతే కేంద్రం కండ్లు తెరిచిందని పేర్కొన్నారు. ఆగస్టు 19న రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాస్తూ ప్రాజె క్టులోని లోపాలు, డీపీఆర్‌లో తేడాలు, నిధుల వినియోగంపై నిలదీసిందని గుర్తుచేశారు. బీఆర్ఎస్ హయాంలో లిప్కోకు చెందిన 5.16 ఎకరాల స్థలం, 2,12, 842 చదరపు అడుగుల విస్తీర్ణం, రూ. 202 కోట్ల వ్యయంతో డీపీఆర్ రూపొందించి కేంద్రం నుంచి అనుమతులు సాధించామని, మొదటి విడుత కింద రూ. 101 కోట్లు విడుదలయ్యాయని వెల్లడించారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రం ఆమోదం లేకుండానే ఆరు ఫ్లోర్ల ప్రాజెక్టును ఏకంగా 43 ఫ్లోర్ల ట్విన్ టవర్లుగా మార్చిందని తెలిపారు. బిల్డప్ స్థలాన్ని 2 లక్షల స్క్వేర్ ఫీట్ల నుంచి 27 లక్షల స్క్వేర్ ఫీట్లకు పెంచి భారీ రియల్ ఎస్టేట్ దందాకు తెరలేపిందని ఆరోపించారు. జీహెచ్ఎంసీ అనుమతులు లేకుండా, డీపీఆర్ ఖరారు కాకుండానే పెద్ద పెద్ద గుంతలు తవ్వించారని, ఇందుకోసం ప్రారంభంలో రూ. 7.78 కోట్లకు టెండర్లు పిలిచి, తర్వాత రూ. 26. 04 కోట్లకు అంచనా వ్యయాన్ని పెంచి ప్రజాధనాన్ని కొల్లగొట్టారని విరుచుకుపడ్డారు. ఏక్తామాల్ ప్రాజెక్ట్ టెండర్ల ప్రీ బిడ్ కాన్ఫరెన్స్‌కు ఆర్ఎంజెడ్, ఎన్‌జేఆర్, కేఆర్సీ, బ్రిగేడ్, షాంగ్రిలా, ఎన్ఎస్ఎల్ ఇన్ఫ్రా లాంటి ఏడు నిర్మాణ సంస్థలు హాజరయ్యాయని తెలిపారు. అయితే వారిని బెదిరించి తప్పించి, ప్రీ-బిడ్‌కు హాజరుకాని అపర్ణ బిల్డర్‌ను తెరపైకి తెచ్చి వంశీరామ్ బిల్డర్స్‌తో జాయింట్ డెవలప్మెంట్ కన్సార్టియంగా మార్చారని సంచలన ఆరోపణలు చేశారు. మొత్తం 27లక్షల చదరపు అడుగుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చేది 9.18లక్షలు మాత్రమేనని, మిగిలిన 18 లక్షల స్క్వేర్‌ఫీట్ల అత్యంత విలువైన స్పేస్‌ను అపర్ణ, వంశీరామ్ కంపెనీలకు కట్టబెట్టేలా రహస్య ఒప్పందాలు చేసుకున్నారని ఆరోపించారు.

దళితుల అభ్యున్నతికి కేటాయించిన లిప్కో ఆధ్వర్యంలోని స్థలాన్ని గతంలో 33 ఏండ్లకు లీజుకు తీసుకున్నారని గుర్తుచేశారు. మల్కం చెరువు ఎదురుగా రూ.1300 కోట్ల విలువైన 6 ఎకరాల 12 గుంటల స్థలాన్ని నిబంధనలకు విరుద్ధంగా ఫ్రీ హోల్డ్ బదిలీ పేరిట ప్రైవేట్ బిల్డర్లకు కట్టబెడుతున్నదని నిప్పులు చెరిగారు. టెండర్లు ఖరారు కాకుండా, భవన నిర్మాణ ప్లాన్ ఆమోదం పొందకముందే కేంద్రం ఇచ్చిన నిధుల నుంచి రూ. 60 కోట్లను జీహెచ్ఎంసీ పర్మిషన్ ఫీజు కింద అడ్డగోలుగా చెల్లించారని దుయ్యబట్టారు. అసలు ప్రైవేట్ బిల్డర్లు కట్టాల్సిన పర్మిషన్ ఫీజును స్టేట్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ ఎందుకు చెల్లించిందని నిలదీశారు. టెండర్ ప్రక్రియను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.