హైదరాబాద్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ) : మణుగూరు బీఆర్ఎస్ కార్యాలయంపై కాంగ్రెస్ గూండాల దాడి దుర్మార్గమని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ నేత, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. జూబ్లీహిల్స్‌లో ఓటమి భయంతోనే కాంగ్రెస్ నేతలు అసహనంతో రెచ్చిపోతున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్ పాలనలో శాంతియుతంగా ఉన్న తెలంగాణలో కాంగ్రెస్ రాగానే అలజడి మొదలైందని అన్నారు. మొన్న వచ్చిన సర్వే రిపోర్టులతో అధికారపార్టీలో కలవరం మొదలైందని విమర్శించారు. ఆదివారం తెలంగాణభవన్‌లో వద్దిరాజు విలేకరులతో మాట్లాడారు. రేగా కాంతారావు ప్రైవేట్ ప్రాపర్టీని కొనుగోలు చేసి అందులోనే నివసిస్తూ సగ భాగాన్ని పార్టీ ఆఫీసుగా మార్చుకున్నారని తెలిపారు. బీఆర్ఎస్ నేతలు లేని సమయంలో గూండాల ముసుగులో కాంగ్రెస్ నేతలు తమ పార్టీ కార్యాలయంపై దాడులకు ఒడిగట్టారని ధ్వజమెత్తారు. గతంలో సిద్దిపేట, సిరిసిల్లలో ఇదే తరహాలో హరీశ్‌రావు, కేటీఆర్ కార్యాలయాలపై దాడులు చేశారని గుర్తుచేశారు. గాంధీభవన్ సంస్కృతిని తీసుకువచ్చి రాష్ట్రాన్ని 20 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారని మండిపడ్డారు.
పాలన చేతగాక చేతులెత్తేసిన సీఎం రేవంత్‌రెడ్డి హోమంత్రిగా శాంతిభద్రతలు కాపాడడంలో దారుణంగా విఫలమయ్యారని వద్దిరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా నేరాలు నిత్యకృత్యమవుతుంటే ఆయన చేతులు ముడుచుకొని కూర్చున్నారని దుయ్యబట్టారు. పట్టపగలు కాంగ్రెస్ గూండాలు బీఆర్ఎస్ ఆఫీసుపై దాడులకు తెగబడుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. డీజీపీ శివధర్‌రెడ్డి ఏం చర్యలు తీసుకున్నారని నిలదీశారు. కొందరు పోలీసులు అధికారపార్టీకి అంటకాగుతూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ప్రశాంతంగా ఉన్న ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ గద్దెనెక్కిన తర్వాత శాంతిభద్రతలు గాడితప్పాయని వద్దిరాజు విమర్శించారు. అధికారపార్టీ కార్యకర్తలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ప్రజాస్వామ్యాన్ని చేతుల్లోకి తీసుకుంటున్నారని విరుచుకుపడ్డారు. ఇటీవల సీపీఎం రాష్ట్ర నేత రామారావు హత్యకు కాంగ్రెస్ నేతలే కారణమని వార్తలు వస్తున్నాయని గుర్తుచేశారు. ఇలాంటి పరిస్థితుల్లో సీపీఎం జూబ్లీహిల్స్‌లో హస్తంపార్టీకి మద్దతివ్వడం శోచనీయమని అన్నారు. తమపార్టీ నేతను హతమార్చారని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం మద్దతుపై పునరాలోచన చేయాలని డిమాండ్ చేశారు. జూబ్లీహిల్స్‌లో ముమ్మాటికీ బీఆర్ఎస్ విజ యం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అక్కడ గెలిచి కేసీఆర్‌కు బహుమతిగా ఇస్తామని వద్దిరాజు స్పష్టంచేశారు.
కాంగ్రెస్ రౌడీ మూకలు మణుగూరు బీఆర్ఎస్ కార్యాలయంపై దాడి చేసి ఫర్నిచర్‌ను తగలబెడుతుంటే పోలీసులు ఏం చేశారని ఎమ్మెల్సీ తాతా మధు ప్రశ్నించారు. శాంతిభద్రతలను గాలికొదిలిన పోలీసులు కాంగ్రెస్‌కు ఊడిగం చేస్తున్నారా? అని నిలదీశారు. గతంలో భువనగిరి, సిరిసిల్ల, సిద్దిపేటలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలపై దాడులు చేసినా కేసులెందుకు నమోదుచేయలేదని నిలదీశారు. రేగా కాంతారావు మణుగూరు బీఆర్ఎస్ ఆఫీసును హరికృష్ణ అనే వ్యక్తిదగ్గర కొనుగోలు చేశారని తెలిపారు. ఆయన నివాసంపై కాంగ్రెస్ నాయకులు దాడులు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. హస్తం పార్టీ కిరాయి గుండాలకు ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ భయపడబోదని తేల్చిచెప్పారు. దాడులు చేసిన వారిపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఉమ్మడి ఖమ్మం బీఆర్ఎస్ నాయకులు దిండిగాల రాజేందర్, బెల్లం వేణు, ఎం రాజాగౌడ్, మల్లెల రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు.
మణుగూరులో బీఆర్ఎస్ కార్యాలయంపై పకా ప్రణాళికతో, ప్రభుత్వ పెద్దల అండతోనే దాడి జరిగిందని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్‌రెడ్డి ఆరోపించారు. ఈ దాడి ప్రభుత్వ కనుసన్నల్లో జరగకపోతే దాడిలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులను తక్షణమే అరెస్ట్ చేసి, కేసు నమోదు చేసి జైలుకు పంపాలని ఆదివారం ఒక ప్రకటనలో డిమాండ్‌చేశారు. లేకుంటే ఊరుకోమని హెచ్చరించారు.