నమస్తే తెలంగాణ నెట్వర్క్, జూలై 6 : సింగరేణి గనుల వేలంపై రెండో రోజూ నిరసనలు కొనసాగాయి. టీబీజీకేఎస్‌తోపాటు బీఆర్ఎస్ నాయకులు శనివారం ఆయా ప్రాంతాల్లో పెద్దఎత్తున ఆందోళనలు చేపట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ ర్యాలీలు, ధర్నాలు నిర్వహించారు. బొగ్గు బ్లాకులను సింగరేణికే కేటాయించాలని డిమాండ్ చేస్తూ జీఎంలకు వినతిపత్రాలు అందజేశారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌లో మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు, టీబీజీకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో జీఎం ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించారు.
ఈ నెల 9న గోదావరిఖనిలో నిర్వహించే మహాధర్నాకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యేలు, హాజరవుతున్నారని, కార్మికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని టీబీజీకేఎస్, బీఆర్ఎస్ నాయకులు పిలుపునిచ్చారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా బెల్లంపల్లి ఏరియాలోని గోలేటి జీఎం కార్యాలయం వద్ద, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం, ఇల్లెందులో ధర్నాలు చేశారు. పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్‌లోని ఆర్జీ-1 గోదావరిఖనిలో, ఆర్జీ-2 యైటింక్లయిన్‌కాలనీ, ఆర్జీ-3 సెంటనరీకాలనీ, భూపాలపల్లిలోని జీఎం కార్యాలయం ఎదుట బైటాయించారు. ఆర్జీ-1 జీఎం ఆఫీస్ ఎదుట ధర్నాలో టీబీజీకేఎస్ శ్రేణులతోపాటు మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పాల్గొన్నారు. ఏఐటీయూసీ ఆధ్వర్యం లో భూపాలపల్లి జీఎం కార్యాలయం, కొత్తగూడెంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు.