BRS | హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ): నిండు అమాస చీకట్లలో ఓ వేగుచుక్క విరిసింది. కాంగ్రెస్ అంధకార పాలనపై బీఆర్ఎస్ సమరశంఖం పూరించింది. కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రం.. కాంగ్రెస్ కబంధ హస్తాల్లో నలిగిపోతున్నదని, తెలంగాణను కాపాడుకుందామని ఉద్యమనేత కేసీఆర్ ఓ రణభేరిని మోగించారు. ఈ ఒక్కమాటతో యావత్తు తెలంగాణ ప్రజల్లో మళ్లీ ఓ ఆశాదీపం వెలిగింది. కాంగ్రెస్ ప్రజాకంటక పాలనకు చరమగీతం పాడడం ఖాయమని, హస్తం పార్టీ నేతలు ఇక అంతమయ్యే పాలనకు రోజులు లెక్కపెట్టుకోవాల్సిందేనని తెలంగాణవాదుల్లో అభిప్రాయం వ్యక్తమవుతున్నది. కేసీఆర్ ప్రసంగం ఆద్యంతం ప్రజాచైతన్యాన్ని రగిల్చేలా సాగిందని రాజకీయ విశ్లేషకుల్లో చెప్తున్నారు.
మళ్లీ బిగిసిన పిడికిలి
పదేండ్లపాటు అభివృద్ధికి తీరమై అలరారిన రాష్ర్టాన్ని అవినీతి కాసారం చేస్తున్న కాంగ్రెస్‌పై యుద్ధం బీఆర్ఎస్ ప్రకటించింది. రజతోత్సవ సభ నింపిన ఉత్సాహంతో కేసీఆర్ పూనుకుంటే.. పూనకాలే మరి! సారు దట్టి కట్టాడంటే.. పట్టు బిగించినట్టే!! అంటూ అభిమానులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. తెలంగాణ తలరాతను మార్చడానికి నిండు అమాసనాడు.. ఓరుగల్లులో పింక్మూన్ విరిసింది. వందల ఎకరాల్లో విద్యుత్ దీపకాంతుల్లో గులాబీ తోట మిరుమిట్లు గొలిపింది. తెలంగాణ ప్రజల బతుకులను ఎండమావిగా మార్చిన హస్తం పార్టీ విధానాలతో గుండె మండిన కేసీఆర్.. కాంగ్రెస్ రాక్షస పాలనకు చరమ గీతం పాడటానికి ఎల్కతుర్తి వేదికగా, లక్షలాది జనం సాక్షిగా సమర శంఖం పూరించారని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతున్నది.
మాటలే తూటాలు… ఓదార్పు మంత్రాలు
మీరు ధైర్యంగా ఉండండి.. మీ వెంట నేనుంటా. కాంగ్రెస్ పాలకులు చెడగొట్టినయన్నీ మళ్లీ మంచిగ చేసుకుందాం.. అందరి ముఖాల్లో చిరునవ్వులు చిందించే తెలంగాణను తయారు చేసుకుందాం ఇదీ కేసీఆర్ ఇచ్చిన భరోసా. రజతోత్సవ సభలో గంటకు పైగా సాగిన ఉద్యమనేత ప్రసంగంలో అధికారం పోయిందన్న అసహనం లేదు. తాను సాధించిన రాష్ట్రం ఆగమైపోతుందన్న ఆవేదనే ప్రతీ మాటలో ప్రతిధ్వనించింది. తాను తీర్చిదిద్దిన తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పాలనలో రోజురోజుకూ దివాలా తీస్తున్నదనే బాధే కనిపించింది. అలా అని కాంగ్రెస్ పాలకులను నిందించలేదు.. నిలదీశారు. తూలనాడలేదు.. తూర్పారబట్టారు. ప్రతీమాటా తూకమేసినట్టు పలికారు. పాలకులను ఎలా నిలదీయాలో చెప్తూ ప్రశ్నాస్ర్తాలను ప్రజలకు అందించారు. యుద్ధం ఎలా చేయాలో నేర్పించారు. కాంగ్రె స్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలతోనే చెప్పిస్తూ హస్తం నేతలకు సవాల్ విసిరారని, ఇది గొప్ప ఉద్యమపంథా అని విశ్లేషకులే చెప్తున్నారు.
కాంగ్రెస్‌కు కౌంట్‌డౌన్ స్టార్ట్
తెల్లవడ్డ తెలంగాణను కాంగ్రెస్ ఆగమాగం చేస్తున్నదనో, ఆవేశంతోని మర్లవడమనో కేసీఆర్ చెప్పలేదు. ప్రజలే ఆలోచించాలని చెప్పా రు. ఉద్యమానికి ఎలాగైతే మహాత్మా గాంధీ అహింసాయుత బాటను ఎంచుకున్నారో.. అదే పంథాలో కాంగ్రెస్ మెడలు వంచుదామ ని పిలుపునిచ్చారు. అటకెక్కిన సంక్షేమాన్ని, రాజ్యమేలుతున్న సంక్షోభాన్ని సంస్కరించుకుందాని ఆశలు చిగురింపచేశారు. మరో మూ డేండ్లు పకడ్బందీగా కాంగ్రెస్ అధికారంలోనే ఉండాలని, ప్రజలే తిరగబడే రోజు వస్తుందని తేల్చిచెప్పారు. ఇలా ఆద్యంతం ప్రజలను కార్యోన్ముఖులను చేసిన ప్రసంగం ప్రజలను తట్టిలేపిందని, దొంగ హామీలతో బోల్తాపడిన జనం.. మంచిరోజుల కోసం ఓపిక పట్టాలంటూ భరోసానిచ్చిందని అభిమానులు చెప్తున్నారు. కాంగ్రెస్‌కు కౌంట్‌డౌన్ స్టార్టయిందని అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు.