Congress | హైదరాబాద్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): మహిళా కమిషన్ ఇచ్చిన నోటీసుపై వివరణ ఇచ్చేందుకు కేటీఆర్ శనివారం ఉదయం 11 గంటలకు రాష్ట్ర మహిళా కమిషన్ ఎదుట హాజరయ్యారు. కేటీఆర్‌కు సంఘీభావంగా ఎమ్మెల్సీ సత్యవతిరాథోడ్, ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు, మహిళా నాయకులు మాలె శరణ్యారెడ్డి తదితరులు వెంట వచ్చారు.
కేటీఆర్‌తోపాటు కార్యాలయం లోపలికి వెళ్లేందుకు వారికి అనుమతి ఇవ్వకపోవడంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అదే సమయంలో అక్కడే ఉన్న మహిళా కాంగ్రెస్ నేతలు దౌర్జన్యానికి దిగారు. మీడియా సాక్షిగా పోలీసుల అండతో రెచ్చిపోయారు. మహిళలకు కేటీఆర్ బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత నేతృత్వంలో ఆ పార్టీ శ్రేణులు బుద్ధభవన్ గేటును తోసుకొని దూసుకొచ్చారు.
అక్కడే ఉన్న బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, మహిళా నేతలకు గాజులు చూపిస్తూ కవ్వింపు చర్యలకు దిగారు. బీఆర్ఎస్కు, కేటీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వారిపైకి దూసుకెళ్లడంతో ఉద్రిక్తత నెలకొన్నది. కాంగ్రెస్‌కు పోటాపోటీగా బీఆర్ఎస్ మహిళా శ్రేణులు కూడా ఆందోళనకు దిగడంతో పరిస్థితి ఒక్కసారిగా గందరగోళంగా మారింది.
పరస్పరం తోపులాటలు, నినాదాలతో మహిళా కమిషన్ కార్యాలయం ఎదుట పరిస్థితి రణరంగంగా మారింది. ఈ సందర్భంగా మహిళా కాంగ్రెస్ నాయకులు పలువురు తమపై నెయిల్ కట్టర్ కత్తులతో దాడిచేశారని బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్లు ఆరోపించారు. గాయాలను మీడియాకు చూపించారు. మధ్యాహ్నం మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతతోపాటు ఇతర మహిళా నాయకులను పోలీసులు అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.
దొంగ పోలీసులపై చర్యలు తీసుకోవాలి: సునీతారావు
పోలీసులు తమను జుట్టు పట్టుకొని బూట్లతో తన్నారని, దీనిపై పోలీస్ కమిషనర్ విచారణ జరిపించి యూనిఫాం వేసుకున్న దొంగ పోలీసులపై చర్యలు తీసుకోవాలని మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు డిమాండ్ చేశారు. మహిళలకు కేటీఆర్ క్షమాపణ చెప్పాలంటూ శనివారం మహిళా కమిషన్ కార్యాలయం వద్ద జరిగిన ఆందోళన సందర్భంగా పోలీసులు తమపట్ల వ్యవహరించిన తీరును ఆమె ఖండించారు. సంఘటన అనంతరం గాంధీభవన్‌లో సునీతారావు విలేకరులతో మాట్లాడుతూ, తమపట్ల దురుసుగా వ్యవహరించిన పోలీసులపై సీఎం రేవంత్‌రెడ్డి చర్యలు తీసుకోవాలని కోరారు. పోలీసులు ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారా? అని ప్రశ్నించారు. ఓ మహిళా కార్యకర్తకు గాయాలు అయ్యాయని, వేలు విరిగిపోయిందని సునీతారావు తెలిపారు.