హైదరాబాద్/ సిద్దిపేట, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ) : ‘చీప్ మినిస్టర్.. నా మాట గుర్తుంచుకో.. మేము మళ్లీ అధికారంలోకి వచ్చిన రోజే సచివాలయం పరిసరాల్లో చెత్తా చెదారాన్ని తొలగిస్తాం.. మీలాంటి ఢిల్లీ గులాం తెలంగాణ ఆత్మగౌరవాన్ని అర్థం చేసుకుంటారని ఆశించలేం’ అని ఎక్స్ వేదికగా బీఆర్ఎస్ వర్కిగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దెప్పిపొడిచారు. ‘బడి పిల్లల ముందు నీచమైన పదజాలాన్ని ఉపయోగించడం మీ నీచమైన ఆలోచనను సూచిస్తున్నది’ అంటూ విమర్శించారు. ‘మీరు మానసిక అనారోగ్యం నుంచి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా’ అంటూ ఎద్దేవాచేశారు.
హోదాకు తగినట్టు మాట్లాడు: దేశపతి
రాజీవ్‌గాంధీ జయంతిని పురస్కరించుకొని సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడిన తీరు వికృతంగా ఉన్నదని, పిల్లల ముందు ఆయన మాట్లాడిన తీరు బాగాలేదని, ముఖ్యమంత్రి హోదాకు తగినట్టు మాట్లాడాలని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ సూచించారు. మాజీ సీఎం కేసీఆర్ చనిపోవాలని రేవంత్‌రెడ్డి కోరుకోవడం తప్పు అని, రేవంత్‌రెడ్డి తెలంగాణ పరువు తీస్తున్నాడని మండిపడ్డారు. మేధావులైనా ఆయనకు తెలిసేలా చెప్పాలని కోరారు. మంగళవారం సిద్దిపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. హైదరాబాద్‌లోని అమరజ్యోతి, సెక్రటేరియట్ మధ్యలో ఉన్న ఐలాండ్‌లో కేసీఆర్ విగ్రహం పెడుతామని ఎవరూ అనలేదని, తెలంగాణ తల్లి విగ్రహాన్ని మాత్రమే పెట్టాలని నిర్ణయించామని చెప్పారు.
రాజీవ్‌గాంధీ విగ్రహం పెడుతామని సీఎం రేవంత్‌రెడ్డి అంటే మేధావులు, కవులు, కళాకారులు ఒత్తిడి తెచ్చారని, అందుకే ఆయన వెనక్కి తగ్గి సెక్రెటేరియట్‌లో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తామని ప్రకటించారని గుర్తుచేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై రేవంత్‌రెడ్డి మాట్లాడిన తీరు సభ్యసమాజం సహించని తీరుగా ఉందని మండిపడ్డారు. పుట్టిన గడ్డకు నమస్కరించని మూర్ఖుడు రేవంత్‌రెడ్డి అని, ఆయనకు పదవీ వ్యామోహం తప్ప.. ప్రజల కోసం పనిచేసే సోయి లేదని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి ఉద్యమంలో లేడని, తెలంగాణ ఆత్మలో అంతకంటే లేడని, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న బీఆర్ఎస్ కార్యకర్తకు కూడా రేవంత్‌రెడ్డి సరిపోడని ఎద్దేవాచేశారు. తెలంగాణలో కేసీఆర్ ఆనవాళ్లను తుడిపేయాలని కాంగ్రెస్ పార్టీ పగటి కలలు కంటున్నదని, తెలంగాణలో ఎక్కడచూసినా కేసీఆర్ ఆనవాళ్లు ఉన్నాయని గుర్తుచేశారు. అంబేద్కర్ విగ్రహంపై పువ్వు పెట్టే అవకాశం కూడా ఇవ్వలేదని గుర్తుచేశారు.
పంజాగుట్ట పీఎస్‌లో ఫిర్యాదు
ఖైరతాబాద్: కేసీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను బీఆర్ఎస్ నేతలు ఖండించారు. ఎమ్మెల్యే ముఠా గోపాల్, మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు దాసోజు శ్రవణ్ కుమార్, బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంగళవారం సోమాజిగూడలో జరిగిన రాజీవ్‌గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొన్న సీఎం ఉన్నతాధికారులు, విద్యార్థుల సమక్షంలో కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని, వ్యక్తిగత దూషణలకు పాల్పడ్డారని చెప్పారు. పడేండ్లపాటు గౌరవప్రదంగా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని తెలిపారు. కేసీఆర్ గౌరవాన్ని దెబ్బతీసేలా, అభ్యంతరకరంగా, హింసాత్మక ధోరణిలో మాట్లాడారని, ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టులాంటిదని, సీఎం రేవంత్‌పై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.