KCR | కేసీఆర్ ఒక్క ప్రెస్‌మీట్.. అనేక ప్రచారాలు పటాపంచలు చేసింది. అనేకానేక అసత్యాలను తునాతునకలు చేసింది. మొద్దునిద్ర సర్కార్ ముఖం మీద నీళ్లుకొట్టి నిద్రలేపిండు కేసీఆర్. ప్రజల ముందు దోషిగా నిలబెట్టిండు. దాంతో పాలమూరుపై సంజాయిషీ ఇచ్చుకోలేక ప్రభుత్వం ఆగమాగం అవుతున్నది. ఆదివారం సాయంత్రం నుంచీ సీఎం, మంత్రులు ఉక్కిరి బిక్కిరి అవుతున్న తీరు కండ్లముందు కనిపిస్తున్నది.
హైదరాబాద్, డిసెంబర్ 22(నమస్తే తెలంగాణ): కేసీఆర్ ఒక్కరే రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి చుక్కలు చూపించారు. రెండేండ్లు ఓపిగ్గా పరిశీలించిన కేసీఆర్.. కాంగ్రెస్ సర్కార్ ఒంటెత్తు పోకడలను ప్రజలకు తెలియజెప్పడానికి మీడియా ముందుకొస్తే రేవంత్‌రెడ్డి సహా మంత్రులంతా ఆగమాగం అయ్యారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రెండు గంటల ప్రెస్‌మీట్‌తో కాంగ్రెస్ ప్రభుత్వంలో అలజడి రేగింది. ప్రతి విషయాన్నీ లెక్కలు, వివరాలతో జనం ముందుంచిన కేసీఆర్ వాగ్ధాటికి ప్రభుత్వ పెద్దలంతా నోరెళ్లబెట్టారు. జనంలో ఇప్పటికే పలుచనయ్యాం., ఇంకా దిగజారుతామని ఆగమాగంగా ఎవరికి తోచినట్టు వారు ప్రెస్మీట్లు, చిట్‌చాట్‌లతో హడావుడి మీడియా ముందుకొచ్చారు. చేసిన తప్పులను కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో ఏం మాట్లాడుతున్నారో వారికే అర్థంగాక అభాసుపాలయ్యారు. అసలుసిసలైన ఒక్క నేత సంధించిన సవాళ్లు, సమస్యలను తట్టుకోలేక రేవంత్ సర్కార్ మూకుమ్మడిగా దాడికి దిగిందనే విషయం వాళ్ల అవివేకంతో వాళ్లే బట్టబయలు చేసుకున్నారు.
గంటల వ్యవధి.. ఎనిమిది మంది ప్రెస్‌మీట్
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఒక్కరు ఒకే ఒక ప్రెస్‌మీట్ పెట్టారు. ఆ ఒక్కడిని ఎదుర్కొనేందుకు సీఎంతో పాటు ఎనిమిది మంది మంత్రులు గంటల వ్యవధిలో వరుసగా ప్రెస్మీట్లు పెట్టారు. కేసీఆర్ సెగ కాంగ్రెస్ సర్కారుకు గట్టిగానే తగలడంతో అలజడి రేగింది. అందుకే అంతమంది మంత్రులు ఒకరి తర్వాత ఒకరు ప్రెస్మీట్లు, చిట్చాట్లు, ప్రకటనలతో ముప్పేట దాడికి దిగారు. అయితే అంతమందిలో ఒక్కరంటే ఒక్కరు కూడా కృష్ణా జలాలు, సర్కారు వైఫల్యాలపై కేసీఆర్ సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేదు సరికదా, పాత చింతకాయ పచ్చడిలా ఎన్నికలప్పుడు చేసిన అబద్ధాలతోనే మరోసారి ఎదురుదాడికి దిగి నవ్వులపాలయ్యారు.
తేలు కుట్టిన దొంగల్లా ప్రెస్మీట్లు
మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లా ప్రజలకు కృష్ణా జలాలు, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు కాంగ్రెస్ చేసిన అన్యాయాన్ని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదివారం సాయంత్రం ప్రెస్‌మీట్ నిర్వహించి ప్రజల ముందు ఎండగట్టారు. కాంగ్రెస్ సర్కారు తెలంగాణ ప్రజలకు చేస్తున్న అన్యాయాలపై సమర శంఖం పూరించారు. దీంతో తేలు కుట్టిన దొంగల్లా ఒకరి తర్వాత ఒకరు సీఎంతో పాటు మంత్రులు బయటికొచ్చారు. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క.. ఇలా ఒకరి తర్వాత ఒకరు మీడియా ముందుకువచ్చారు. కేసీఆర్ ప్రెస్‌మీట్ ముగియడమే ఆలస్యం మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రెస్‌మీట్ నిర్వహించారు.
అది పూర్తికాగానే రాత్రి పది గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి తన మద్దతు మీడియా ప్రతినిధులను ఇంటికి పిలిపించుకొని మరీ చిట్‌చాట్ పేరుతో కేసీఆర్‌పై ప్రేలాపనలు చేశారు. మరుసటి రోజు(సోమవారం) ఇతర మంత్రులూ దండయాత్ర మొదలు పెట్టారు. ఉదయమే గాంధీభవన్‌లో మంత్రులు జూపల్లి, పొన్నం, వాకిటి శ్రీహరి కలిసి ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఇది చాలదన్నట్టుగా మరోమంత్రి శ్రీధర్‌బాబు ప్రత్యేకంగా మరో ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఇక నీళ్ల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సోమవారం కూడా రెచ్చిపోయి, మరోసారి మీడియాతో చిట్‌చాట్ చేశారు. మంత్రి సీతక్క మీడియా ముందు తన అక్కసు వెళ్లగక్కారు. తానేం తక్కువ తినలేదన్నట్టుగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేసీఆర్‌ను విమర్శిస్తూ చాంతాడంత ప్రెస్‌నోట్ విడుదల చేశా రు. ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి తనవంతుగా ఓ చెయ్యేశారు. ఇలా ఒకరి తర్వాత ఒకరు గంటల వ్యవధిలోనే వరుస ప్రెస్మీట్లు నిర్వహించారు.
కేసీఆర్ ప్రశ్నలు.. మంత్రుల ఎదురుదాడి
ఆదివారం ప్రెస్‌మీట్ నిర్వహించిన కేసీఆర్, ఒక్క మంత్రిగానీ, నేతపైగానీ వ్యక్తిగత విమర్శలు చేయలేదు. కేవలం పాలమూరుకు జరిగిన అన్యాయం, రాష్ర్టానికి కాంగ్రెస్ సర్కారు చేస్తున్న ద్రోహంపైనే నిలదీశారు, సూటిగా ప్రశ్నించారు. పూర్తిగా అంకెలు, లెక్కలు, వాటాలతో వివరించారు. ఉద్యమనేతగా, ప్రతిపక్షనేతగా తన బాధ్యత నిర్వర్తించారు. అధికారంలో ఉన్న మంత్రులు మాత్రం ఆ బాధ్యతనూ విస్మరించారు. కేసీఆర్ సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఎదురుదాడిని ఎంచుకున్నారు. గతంలో మాదిరిగానే కేసీఆర్, ఆయన కుటుంబంపై వ్యక్తిగత దూషణలకు దిగారు. వాళ్ల తప్పులను కప్పిపుచ్చుకునేందుకు నానా ఇబ్బందులు పడ్డారు. సీఎం, నీళ్లమంత్రితో పాటు ఏ ఒక్క మంత్రి కూడా కేసీఆర్ ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయారు. సబ్జెక్టు లేకపోవడంతో సవాళ్లకే పరిమితమయ్యారు. కేసీఆర్ ప్రజల మధ్య తేల్చుకుందామని పిలుపునిస్తే ‘కాదుకాదు.. అసెంబ్లీలో మనంమనం మాట్లాడుకుందామంటూ’ సీఎం విజ్ఞప్తులు చేశారు. కేసీఆర్ ప్రజల్లోకి వెళ్లి కాంగ్రెస్ అన్యాయాలు, ఏపీ జలదోపిడీకి సర్కార్ సహకరిస్తున్న తీరును ఎండగడతారని, దాంతో మరింత వ్యతిరేకత తప్పదనే ఆందోళనతో కేసీఆర్‌పై వ్యక్తిగత దూషణలతో ఎదురుదాడికి దిగి, వాస్తవాలను కనుమరుగు చేసే ప్రయత్నం చేశారు.
కాంగ్రెస్‌తో గొంతు కలిపిన బీజేపీ
రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై ప్రతిపక్షపార్టీగా ప్రశ్నించాల్సిన బీజేపీ అధికార పార్టీకే వత్తాసు పలికింది. కాంగ్రెస్‌ను విమర్శించిన కేసీఆర్‌పైనే కమలం నేతలు విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ మంత్రులతో గొంతు కలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు, ఎంపీలు డీకే అరుణ, రఘునందన్‌రావు కేసీఆర్‌నే విమర్శించారు. కాంగ్రెస్ తప్పులను ఎత్తిచూపకుండా అధికార పార్టీ చర్యల్ని వెనకేసుకొని రావడంతో రాష్ట్రంలో కాంగ్రెస్,బీజేపీ మధ్య రహస్య బంధం మరోసారి బట్టబయలైంది. జల కేటాయింపుల్లో రాష్ర్టానికి అన్యాయం జరిగినా పర్వాలేదు కానీ తమ బీ-పార్టీకి ఇబ్బంది కావొద్దనేలా వాళ్లు వ్యవహరించడం విమర్శలకు తావిస్తున్నది.
జవాబు లేక..‘గుంపు’ దాడి!