KCR | పాలమూరు జిల్లాకు జరుగుతున్న అన్యాయంపై బీఆర్ఎస్ అధినేత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండేళ్ల నుంచి మౌనంగా ఉన్నానని.. ఇక తప్పనిసరి పరిస్థితి అని బయల్దేరానని తెలిపారు. అటు కేంద్రాన్ని, ఇటు రాష్ట్రాన్ని ఎండగడతానని పేర్కొన్నారు. పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో గ్రామగ్రామాన ప్రజా ఉద్యమాలు చేస్తాం.. బహిరంగ సభలు పెడతామని తెలిపారు. వాటికి తానే స్వయంగా హాజరవుతానని తెలిపారు. ప్రజాక్షేత్రంలో నిష్క్రియ ప్రభుత్వాన్ని నిలదీస్తామని స్పష్టం చేశారు. ఇవాల్టి దాకా వేరు కథ.. రేపట్నుంచి వేరే.. తోలుతీస్తామని హెచ్చరించారు.
హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ఎల్పీ, రాష్ట్ర కార్యవర్గంతో కేసీఆర్ సమావేశమై దిశా నిర్దేశం చేశారు. అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ తెచ్చిన పార్టీగా, ప్రధాన ప్రతిపక్షంగా తమపై రెండు బాధ్యతలు ఉన్నాయని తెలిపారు. మేం అడ్డం పొడువు మాట్లాడి, కారుకూతలు కూసి ఏదో చేస్తామంటే ఇక నడవదని అన్నారు. ఇవాల్టి దాకా వేరు కథ.. రేపట్నుంచి వేరే.. తోలుతీస్తామని హెచ్చరించారు. ప్రజల్లో ఎక్కడికక్కడ నిలబెడతామని అన్నారు.
తొందరపడి ఏ పని చేయట్లేదని.. అక్కసుతో మాట్లాడట్లేదని కేసీఆర్ తెలిపారు. అనేక రకాల సమస్యలపై బీఆర్ఎస్ పార్టీ పోరాడుతూనే ఉందని పేర్కొన్నారు. కానీ ఇప్పుడు రాష్ట్రం మొత్తానికే ముప్పు వచ్చే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. అటు గోదావరి మీద చంద్రబాబు దోపిడీ చేస్తుంటే దాని మీద చప్పుడు లేదు.. ఇటు కృష్ణాలో పాలమూరు ఎత్తిపోతల మీద ఘోరం జరుగుతుంటే దీనిపైనా చప్పుడు లేదు.. మరి రాష్ట్ర ప్రభుత్వం ఎవరి ప్రయోజనాల కోసం ఉన్నట్లు అని ప్రశ్నించారు. ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందని నిలదీశారు. అందుకే ఈ పిరిస్థితుల్లో నేనే స్వయంగా రంగంలోకి దిగాలని అనుకున్నా అని స్పష్టం చేశారు. ఇవాళ మీటింగ్లో డిసైడ్ అయినమని తెలిపారు. రెండు మూడు రోజుల్లో ఆయా జిల్లా నాయకులతో సమావేశమై, కచ్చితంగా పెద్ద ఎత్తున గ్రామగ్రామాన సభలు పెడతాం.. కవులు, గాయకులను తట్టి లేపుతామని తెలిపారు.. అక్కడి ప్రజలకు జరిగే అన్యాయాన్ని జలదోపిడీని అరకట్టాలని మీడియాను కూడా విజ్ఞప్తి చేశారు.. ఇన్ని రోజులు ఒకరకంగా పోయాం.. ఇక తప్పేటట్లు లేదు.. తెలంగాణ కోసం ఎవరితోనైనా కొట్లాడతామని స్పష్టం చేశారు. భయపడమని అన్నారు. రాష్ట్రాన్ని రక్షించుకోవాలని.. మా కండ్ల ముందే ఇంత దుర్మార్గం జరుగుతుంటే కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉండాలని ప్రశ్నించారు.