KCR | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీకి బయల్దేరారు. అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు నిన్న సాయంత్రం ఎర్రవల్లి వ్యవసాయక్షేత్రం నుంచి హైదరాబాద్ నందినగర్‌లోని తన నివాసానికి కేసీఆర్ వచ్చారు. నందినగర్ నివాసం నుంచి కాసేపటి క్రితం ఆయన అసెంబ్లీకి బయల్దేరారు.
ఇదిలా ఉంటే.. కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు రావాలంటూ బయట సవాల్ విసురుతున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు వాస్తవిక పరిసిత్థిలోకి వచ్చే సరికి వెనుకడుగు వేస్తున్నట్టు తెలుస్తున్నది. కేసీఆర్ అసెంబ్లీకి హాజరయ్యేందుకు ఆదివారం రాత్రే ఎర్రవల్లి నివాసం నుంచి బంజారాహిల్స్‌లోని నివాసానికి చేరుకోవడంతో మంత్రివర్గంలో అలజడి మొదలైనట్టు తెలిసింది. ప్రజా ప్రభుత్వం పేరుతో ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కాంగ్రెస్ సర్కార్‌ను సభలోనే గట్టిగా నిలదీయాలని కేసీఆర్ నిర్ణయించి, పార్టీ సభ్యులను సిద్ధంచేసిన నేపథ్యంలో ప్రభుత్వం ఆత్మరక్షణలో పడినట్టు కనిపిస్తున్నది.
దక్షిణ తెలంగాణకు జీవనాడి అయిన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు గురించి అసెంబ్లీలో ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని, అవసరమైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని ప్రధాన ప్రతిపక్షం డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో అధికార పక్షం అప్రమత్తమైనట్టు తెలిసింది. కేసీఆర్‌తో సబ్జెక్టు మాట్లాడటం కష్టమని, ఆ స్థాయిని తాము అందుకోలేమనే ఆందోళనతో అధికారపక్షం ఉన్నట్టు తెలిసింది. సాగునీటిపై షార్ట్ డిస్కషన్‌ను అనుమతించి సాధ్యమైనంత వరకు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వివరణతోనే నెట్టుకురావాలని నిర్ణయించినట్టు తెలిసింది. అసెంబ్లీ సమావేశాలను ఎక్కువ రోజులు సాగదీయకుండా రెండు, మూడు రోజుల్లోనే ముగించాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఇదిలా ఉండగా, అసెంబ్లీ చరిత్రలో మొదటిసారిగా జ్యుడీషియరీ క్యాడర్ నుంచి వచ్చిన అధికారి (ఆర్ తిరుపతి) అసెంబ్లీ కార్యదర్శి హోదాలో శాసనసభను నడిపించబోవడం విశేషం. ఇప్పటి వరకు అసెంబ్లీ క్యాడర్ అధికారులే ఈ బాధ్యత నిర్వర్తించేవారు.
నీళ్ల చర్చ ఒక్క రోజుకు మించకుండా..
అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి? ఏయే అంశాలను ప్రధాన ఎజెండాలో చేర్చాలనే అంశాలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. ఎజెండా ఖరారు చేసి అసెంబ్లీ సైట్లో పెడతారేమోనని ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆదివారం పొద్దుపోయే వరకు ఎదురుచూశారు. కానీ, అందులో అటువంటి సమాచారమేదీ పొందుపరచలేదు. తొలిరోజు మాజీ మంత్రి దామోదర్‌రెడ్డి, చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మారెడ్డికి సంతాప తీర్మానం ప్రవేశపెడతారు. డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్ ఇచ్చి, రామచంద్రునాయక్ నామినేషన్‌ను స్వీకరిస్తారు. అనంతరం సభ వాయిదా వేసి బిజినెస్ అడ్వయిజరీ కమిటీ (బీఏసీ) సమావేశం నిర్వహిస్తారు. బీఏసీలోనే ఎన్నిరోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలో నిర్ణయిస్తారు. జనవరి 2,3 తేదీల్లో ఏదోఒకరోజు కృష్ణా, గోదావరి జలాలపై చర్చ పెట్టాలని నిర్ణయించే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది.
ఆ ఒక్కరోజు కూడా కృష్ణా జలాల పంపిణీలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్ణయాల వల్ల తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని విమర్శిస్తూ, ఆ ఒక్క పాయింట్ మీదనే స్టిక్ ఆన్ అయి చర్చ కొనసాగించాలని అధికారపక్షం నిర్ణయించినట్టు తెలిసింది. ఉమ్మడి రాష్ట్రానికి బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 811 టీఎంసీల కృష్ణా జలాల్లో తెలంగాణకు 299 టీఎంసీలకు ఒప్పుకుంటూ 2015లో అగ్రిమెంట్ చేసుకున్నారనే వాదనను ముందుపెట్టి, నాటి ఇంటర్‌స్టేట్ మీటింగ్ మినిట్స్లోని కొన్ని అంశాలను తీసుకొని చర్చను పొడిగించాలని, ఈ ఒక్క పాయింట్ మీదనే సభా సమయం సరిపెట్టాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది. ఆదివారం సాయంత్రం ఢిల్లీ నుంచి వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి.. కాంగ్రెస్ ఫార్మేషన్ కార్యక్రమాలకు కూడా హాజరుకాకుండా ఈ అంశం మీదనే సుదీర్ఘ కసరత్తు చేసినట్టు తెలిసింది. అంతకుమించి చర్చకు అవకాశం ఇవ్వవద్దని నిర్ణయించినట్టు తెలిసింది.
గతంలో తొడగొట్టి కేరళకు.. ఇప్పుడు ఢిల్లీకి!
అసెంబ్లీ సమావేశాలకు ఎమ్మెల్యేలను, మంత్రులను సన్నద్ధం చేయాల్సిన సమయంలో సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ వెళ్లిపోయారని కాంగ్రెస్ నేతలే నిష్టూరమాడుతున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను సమావేశానికి పిలిచి, ప్రతిపక్షాన్ని ఎలా ఎదుర్కోవాలో సీనియర్ల ద్వారా శిక్షణ ఇప్పించాల్సిందిపోయి ఢిల్లీలో తిరుగుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అంటున్నారు. గత అసెంబ్లీ సమావేశాల్లో కాళేశ్వరం నివేదికపై చర్చ పెడతామని సవాల్ విసిరిన సీఎం రేవంత్‌రెడ్డి.. తీరా సమావేశం మొదలయ్యాక ఏదో కార్యక్రమం ఉన్నదని ఉదయాన్నే కేరళ రాష్ట్ర పర్యటనకు వెళ్లారని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గుర్తుచేసుకుంటున్నారు. కాళేశ్వరం రిపోర్డుపై మాజీ మంత్రి హరీశ్‌రావు సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, రిపోర్టు వివరాలు అర్థంకాక మంత్రులందరూ ఉకిరిబికిరి అయ్యారని, మళ్లీ ఇప్పుడు నీళ్ల సబ్జెక్టు మీదనే బీఆర్ఎస్ పట్టుపడుతున్న నేపథ్యంలో మంత్రులు ఆందోళనతో ఉన్నట్టు తెలిసింది. కాంగ్రెస్ నేతలు చెక్‌డ్యాంలు పేల్చి వేసి, ఇసుక దందా చేసుకుంటున్నారంటూ ఇరిగేషన్ శాఖ ప్రాథమిక నివేదిక ఇచ్చిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు చెడుగుడు ఆడుకుంటారని మంత్రులు ఆందోళనతో ఉన్నట్టు తెలిసింది.
సుశిక్షితులుగా రంగంలోకి బీఆర్ఎస్ నేతలు
మరోవైపు, శుక్రవారం ఎర్రవల్లిలో బీఆర్ఎస్ నేతలతో సమావేశమైన కేసీఆర్.. అసెంబ్లీ సమావేశాల్లో పార్టీ పరంగా అనుసరించే వ్యూహంపై దిశానిర్దేశం చేశారు. రొడ్డకొట్టుడు ఎజెండాతో కాకుండా ప్రజా సమస్యలపై సమగ్రంగా చర్చించేందుకు వీలుగా ఎజెండా ఖరారు చేస్తే స్వయంగా కేసీఆర్ సభకు వెళ్లడానికి సిద్ధమైనట్టు సమాచారం. ప్రజా సమస్యలపై సమగ్రంగా చర్చించేందుకు వీలుగా అసెంబ్లీ సమావేశాలను కనీసం 15 రోజులకు తగ్గకుండా నిర్వహించాలని, ప్రతి అంశంపై పూర్తిస్థాయి చర్చ జరుపాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తున్నది. ప్రధానంగా రైతాంగ సమస్యలపై అసెంబ్లీలో బలంగా పోరాడాలని, ఫార్మాసిటీ, హిల్ట్‌పాలసీపై సమగ్ర చర్చకు గట్టిగా పట్టుపట్టాలని నిర్ణయించినట్టు తెలిసింది. అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్‌ను నిలదీయాలని కేసీఆర్ వ్యూహ రచన చేసినట్టు తెలిసింది. తెలంగాణకు రావాల్సిన నీటి హకులను పరిరక్షించుకునే బాధ్యత బీఆర్ఎస్పైనే ఉంటుందని, రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని అసెంబ్లీ వేదికగా ప్రజలకు వివరిద్దామని వెల్లడించినట్టు తెలిసింది. ఇక ఊరుకునే ప్రసక్తే లేదని, అసెంబ్లీలోనే ద్రోహాన్ని బట్టబయలు చేసి ప్రజల ముందు పెట్టాలని నిర్ణయించినట్టు సమాచారం.