KCR | ప్రజలు ఎక్కడ చూసినా బీఆర్ఎస్ రావాలని కోరుకుంటున్నారని బీఆర్ఎస్ అధినేత తెలిపారు. తమ చర్యలతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్లో నమ్మకం కోల్పోవడమే దీనికి కారణమని చెప్పారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. రియల్ ఎస్టేట్ మొత్తం బ్రోకర్ దందానే అని ప్రశ్నించారు. అలాగే తాము ఫార్మా సిటీని ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందో వివరించారు.
‘ అనుకోకుండా కొన్ని ప్రాంతాలకు, కొన్ని రాష్ట్రాలకు కలిసొస్తాయి. నెహ్రూ ప్రధానిగా ఉన్న సమయంలో కలరా వ్యాధి వ్యాపించి ప్రజలు ఇబ్బడి ముబ్బడిగా చనిపోయారు. అప్పుడు ఎక్కడికక్కడ లోకలైజ్డ్ ప్రొడక్షన్ ఉండాలని ఐడీపీఎల్ అని పెట్టారు. వాటిని కొన్ని కీలక రాష్ట్రాల్లో పెట్టారు. అందులో ఒకటి హైదరాబాద్‌కు వచ్చింది. ఐడీపీఎల్ పుణ్యమా అని కొంతమంది నేర్చుకుని బయటకొచ్చి స్వయంగా కంపెనీలు పెట్టి విస్తరించారు. వాటిలో అంజిరెడ్డి ఒకరు.. ఆయన దగ్గర పనిచేసిన వాళ్లు కూడా బయటకొచ్చి వాళ్లు కూడా కంపెనీలు పెట్టారు. ఇలా హైదరాబాద్ నగరం మెడికల్, ఫార్మా హబ్‌గా మారింది. అలా ఫార్మా ఎకో హైదరాబాద్‌లో బిల్డ్ అవ్వడం వల్ల ఇబ్బడిముబ్బడిగా కంపెనీలు హైదరాబాద్‌కు వచ్చాయి. ఇప్పుడు మూడో వంతు ప్రపంచానికి జీనోమ్ వ్యాలీ నుంచే వ్యాక్సిన్ సరఫరా అవుతుంది.’ అని కేసీఆర్ తెలిపారు.
నిజాం కాలం నుంచి ఫార్మా కంపెనీలు వస్తూ వస్తూ.. హైదరాబాద్ ఫార్మారంగానికి బెస్ట్ డెస్టినేషన్‌గా మారిందని కేసీఆర్ తెలిపారు. అయితే ఆ కంపెనీల్లోని రసాయన కారకాలు ఇబ్బందిని కలిగిస్తాయి. దీని నుంచి హైదరాబాద్‌ను బయటపడాలి.. అలా అని ఫార్మాను వదులుకోలేం.. అందుకే నాలుగు టీమ్‌లను ఏర్పాటు చేసి ప్రత్యామ్నాయ మార్గాలను వెతికామని తెలిపారు. ‘ మందులు తయారుచేసే క్రమంలో కొంత వేస్టేజి ఉంటుంది.. దాన్ని ఎలా మేనేజ్ చేయాలంటే కొంత తెలివి కావాలి. ఒక ఫార్మా కంపెనీ ముందు నుంచి వెళ్తే మన దగ్గర వాసన వస్తది.. అదే వేరే దేశంలో అయితే అలా రాదు.. వాటి గురించి తెలుసుకోవడానికి ప్రపంచ దేశాలు తిప్పించాం. ప్రపంచవ్యాప్తంగా తిప్పి ఒక ఆలోచనకు వచ్చాం. ఈ క్రమంలోనే జడ్ఎల్బీ అని వచ్చింది.. అంటే జీరో లిక్విడ్ బేస్. వ్యర్థాలను జీరో లిక్విడ్ చేస్తారు. దాని వల్ల కాలుష్యం రాదు. అంతర్జాతీయంగా అది సక్సెస్ అయ్యింది. అయితే మనం ఆ సిస్టమ్ పెట్టుకోవాలని.. అలాగే ఫార్మా యూనివర్సిటీ పెట్టుకోవాలని అనుకున్నాం. ‘ అని కేసీఆర్ వివరించారు.
ఈ ఆలోచనతో హైదరాబాద్‌లోని ఫార్మా రంగానికి చెందిన వ్యాపారవేత్తలను నేనే స్వయంగా హెలికాప్టర్లో తీసుకెళ్లి ముచ్చర్లలోని స్థలాన్ని చూపించానని తెలిపారు. వాళ్లు కూడా ఆ స్థలం సెట్ అవుతుందని చెప్పడంతో ఫార్మా సిటీ నిర్మాణానికి రూపకల్పన చేశామన్నారు. దీనికోసం ఐదారు సంవత్సరాలు కష్టపడి, రైతాంగంతో ఘర్షణ పడకుండా 14 వేల ఎకరాలను సమీకరించామని తెలిపారు. 20 వేల ఎకరాలు లక్ష్యంగా పెట్టుకుంటే తాము అధికారంలో ఉన్న సమయంలో 14 వేల ఎకరాలను సమీకరించగలిగామని పేర్కొన్నారు. జీడిమెట్ల, చర్లపల్లిలోని ఫార్మా కంపెనీలను కూడా సంప్రదిస్తే ప్రత్యామ్నయ స్థలం చూపిస్తే తరలివెళ్లేందుకు సిద్ధమేనని సుముఖత వ్యక్తం చేశారని తెలిపారు. కామన్ అఫ్లియెటెడ్ ప్లాంట్స్ పెట్టి.. వ్యర్థాలను ఇష్టమొచ్చినట్లు వదిలేయకుండా రాష్ట్ర ప్రభుత్వం నిఘా ఉండేలా పెట్టుకున్నదే ఫార్మా సిటీ అని చెప్పారు. దానికి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కూడా వచ్చిందని అన్నారు. అలా హైదరాబాద్‌లోని ఫార్మా కంపెనీలు మొత్తం ఒకే దగ్గరికి తీసుకెళ్లి ఫార్మా సిటీ కట్టాలని ప్లాన్ చేశామని తెలిపారు. దాని పక్కనే మెడికల్ కాలేజీ కూడా మంజూరు చేశామని చెప్పారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దాన్ని ఏదైనాచేసి అమ్ముకోవాలని కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు.
ఇవాళ రాష్ట్రంలో ఏం జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డిని కేసీఆర్ ప్రశ్నించారు. నీ ఫ్యూచర్ సిటీ.. తొక్కలో సిటీ ఎవడికి కావాలన్నారు. హైదరాబాద్‌ను నువ్వేమైనా పెంచావా అని నిలదీశారు. 400 ఏండ్ల చరిత్రతో హైదరాబాద్ పెద్ద సిటీ అయ్యిందని తెలిపారు. ఇలా అన్ని రాష్ట్రాలకు పెద్ద సిటీలు తయారవవ్వని తెలిపారు. బెంగాల్‌కు కోల్‌కతా ఉంది.. మహారాష్ట్రకు ముంబై ఉంది.. మనకు హైదరాబాద్ ఉంది.. కర్ణాటకకు బెంగళూరు ఉంది.. తమిళనాడుకు చెన్నై ఉంది.. ఢిల్లీ ఇవి కాకుండా వేరే రాష్ట్రాలకు లేవు అని గుర్తుచేశారు. అంత చరిత్ర ఉన్న హైదరాబాద్ మహానగరాన్ని దృష్టిలో పెట్టుకుని ఫార్మా సిటీ తీసుకొచ్చామని తెలిపారు. ఇవాళ సిటీ మొత్తం గబ్బు లేచిపోవాలి.. నువ్వేమో ఫ్యూచర్ సిటీ.. తొక్కలో సిటీ అని దిక్కుమాలిన పాలసీలు తీసుకొస్తూ.. రియల్ ఎస్టేట్ బ్రోకర్ దందా చేస్తున్నావని మండిపడ్డారు.