KCR | హైదరాబాద్ : బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆ పార్టీ అధినేత కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. 104 మంది ఎమ్మెల్యేలున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్నే కూల్చేందుకు బీజేపీ యత్నించింది. 64 మందే ఎమ్మెల్యేలున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీజేపీని బతకనిస్తుందా..? అని కేసీఆర్ అన్నారు.
రాష్ట్రంలో భవిష్యత్ బీఆర్ఎస్దే.. రాబోయే ఎన్నికల్లో గెలుపు కూడా మనదే అని కేసీఆర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని కేసీఆర్ తెలిపారు. గట్టిగా పోరాడితే లోక్‌సభ ఎన్నికల్లో మంచి ఫలితాలు వస్తాయి. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన నేతలు బాధపడుతున్నారు. అధికారం ఉందని కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే ఇక్కడంతా బీజేపీ కథ నడుస్తోందని ఓ నాయకుడు తనతో వాపోయాడు. 20 మంది ఎమ్మెల్యేలను తీసుకొని రావాలా సార్ అని ఓ సీనియర్ కీలక నేత తనను సంప్రదించాడు. ఇప్పుడే వద్దని వారించానని కేసీఆర్ తెలిపారు. కాంగ్రెస్‌లో టీమ్ వర్క్ లేదు.. స్థిరత్వం లేదు. ఇప్పటి వరకు 8 లోక్‌సభ సీట్లలో గెలుస్తామని సర్వేలు చెబుతున్నాయి. మరో మూడు స్థానాల్లో విజయావకాశాలు ఉన్నాయని కేసీఆర్ స్పష్టం చేశారు.
లోక్‌సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయం గందరగోళం ఏర్పడే అవకాశం ఉందన్నారు. ఏ రాజకీయ గందరగోళం జరిగినా బీఆర్ఎస్కే మేలు జరుగుతుంది. ఉద్యమకాలం నాటి కేసీఆర్‌ను మళ్లీ చూస్తారు. బస్సు యాత్ర రూట్ మ్యాప్ ఇవాళ ఖరారవుతుంది. కాంగ్రెస్‌పై తీవ్ర వ్యతిరేకత ప్రారంభమైంది.. రానున్న రోజులు మనవే. పార్లమెంట్లో మన గళం వినిపించాల్సిన అవసరం ఉంది. కొందరు నేతలు పార్టీని వీడి వెళ్లినంత మాత్రానా బీఆర్ఎస్కు నష్టం ఏమీ లేదు అని కేసీఆర్ స్పష్టం చేశారు.
రైతు సమస్యలు అజెండాగా ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లాలి. రైతు సమస్యలపై పోస్టుకార్డు ఉద్యమం ఉధృతం చేయాలి. ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో లక్ష పోస్టుకార్డులు రాయాలి. రైతుల కల్లాల కాడికి వెళ్లి రూ. 500 బోనస్‌పై ప్రభుత్వాన్ని నిలదీయాలి. ప్రభుత్వ హామీలను కాంగ్రెస్ పార్టీకి గుర్తు చేయాలి. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది. దాన్ని అనుకూలంగా మలుచుకోవాలి అని కేసీఆర్ సూచించారు.
బస్సు యాత్రం చేద్దాం.. జనం నుంచి మంచి స్పందన వస్తోందని కేసీఆర్ తెలిపారు. ఈ నెల 22 నుంచి రోడ్డు షోలు నిర్వహిస్తామన్నారు. ఒక్కో లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని రెండు, మూడు అసెంబ్లీ ఏరియాల్లో రోడ్‌షోలు ఉంటాయన్నారు. రోజుకు రెండు, మూడు రోడ్‌షోలు ఉంటాయన్నారు. ఉదయం సమయంలో రైతుల వద్దకు వెళ్లాలని నిర్ణయించారు. సాయంత్రం వేళ రోడ్డు షోలు, కార్నర్ మీటింగ్స్ నిర్వహించనున్నారు. వరంగల్, ఖమ్మం, మహబూబ్‌నగర్ సెంటర్లలో భారీ బహిరంగ సభలు నిర్వహించనున్నట్లు కేసీఆర్ పేర్కొన్నారు.