KCR | హైదరాబాద్ : ఆదివాసీల ఆరాధ్య దైవం నాగోబా జాతర ప్రారంభమవుతున్న సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఆదివాసీల ఐక్యతకు ప్రతీక నాగోబా జాతర అని కేసీఆర్ పేర్కొన్నారు.
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ వేదికగా నేటి నుంచి ఫిబ్రవరి 4వ తేదీ వరకు నాగోబా జాతర కొనసాగనుంది. తెలంగాణలో జరిగే ఈ ఆదివాసీ సంబురం తెలంగాణలో రెండో అతిపెద్ద జాతరగా పేరొందింది. మెస్రం వంశీయులు మంగళవారం నాగోబా జాతర పూజలను ప్రారంభించారు. గంగా జలాన్ని, ఆలయ ప్రాంగణంలోని మురాడి వద్దకు మెస్రం వంశీయులు తీసుకొచ్చారు. గ్రామంలోని పాత ఆలయం నుంచి నాగోబా విగ్రహాన్ని ఊరేగింపుగా గర్భగుడిలో భద్రపరిచారు. అనంతరం ఆలయ సమీపంలోని కోనేరు నుంచి మట్టి కుండల్లో నీటిని తీసుకువచ్చి పుట్టలు చేస్తారు.
అర్ధరాత్రి 11:30 సమయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం జాతర ప్రారంభం కానుంది. పూజా కార్యక్రమంలో జిల్లా అధికారులతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు మెస్రం వంశీయులు పాల్గొంటారు. ఐదు రోజులపాటు జరిగే జాతరలో తెలుగు రాష్ట్రాల నుంచి కాక మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిషా రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు హాజరవుతారు.
ఏటా పుష్యమాసంలో నెలవంక తొంగి చూడటంతోనే.. నాగోబా జాతరకు సన్నాహాలు మొదలవుతాయి. నెలవంక కనిపించిన రెండో రోజు మెస్రం వంశీయులు నాగోబాకు తొలిపూజలు చేస్తారు. తర్వాత ప్రత్యేకంగా తయారుచేసిన ప్రచార రథంలో వారం రోజులు గ్రామాల్లో తిరుగుతూ… జాతరకు హాజరు కావాల్సిందిగా మెస్రం వంశీయులను ఆహ్వానిస్తారు. జాతరకు పక్షం రోజుల ముందు ఈ మహత్తర క్రతువుకు శ్రీకారం చుడతారు. తమ దైవం నాగోబాకు అభిషేకానికి గానూ గంగాజలం తీసుకురావడానికి మెస్రం వంశీయులు ప్రయాణం అవుతారు. కేస్లాపూర్ నుంచి జన్నారం మండలం కలమడుగు వరకు దాదాపు వంద కిలోమీటర్లు కాలినడకన బయల్దేరి వెళ్తారు. అడవి దారిలో చెప్పుల్లేకుండా నడక సాగిస్తారు. అక్కడి హస్తలమడుగు దగ్గర పంచలింగాలకు పూజ చేసి 151 కలశాలతో గోదావరి జలాలను తీసుకొని కాలినడకన తిరుగు ప్రయాణం అవుతారు.
ఇవి కూడా చదవండి..