BRS Party | హైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికల ప్రచార వ్యూహంపై దృష్టి కేంద్రీకరించారు. పార్టీ తరఫున బరిలో నిలిచే ఎంపీ అభ్యర్థుల ఎంపిక, పార్లమెంట్, అసెంబ్లీ నియోజకర్గాలవారీగా సమీక్షలు, సన్నాహక సమావేశాలు పూర్తయిన నేపథ్యంలో నేరుగా ప్రజలతో మమేకం అయ్యేందుకు సిద్ధమవుతున్నాయి. ఉగాది పర్వదినం తరువాత ప్రచారపర్వాన్ని హోరెత్తించనున్నట్టు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించిన వ్యూహానికి, పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించనున్న ప్రచార వ్యూహానికి తేడా ఉంటుందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. రాష్ట్రంలోని అన్ని పార్లమెంట్ నియోజకవర్గాలు కవర్ అయ్యేలా కేసీఆర్ బస్సుయాత్ర చేపట్టే అవకాశాలు ఉన్నాయని, ఇందుకోసం రూట్‌మ్యాప్ సైతం సిద్ధమవుతున్నదని ఆ వర్గాలు తెలిపాయి.
బహిరంగసభలతోపాటు రోడ్‌షోలు, కార్నర్ మీటింగ్స్పై కేసీఆర్ దృష్టిపెడుతున్నట్టు సమాచారం. మరోవైపు కేటిఆర్, హరీశ్‌రావు మండల కేంద్రాలు, మున్సిపాలిటీ కేంద్రాల్లో రోడ్‌షోలు నిర్వహించేవిధంగా వ్యూహరచన చేస్తున్నట్టు తెలిసింది. తెలంగాణపై కాంగ్రెస్, బీజేపీ పన్నుతున్న కుట్రలను ప్రజలకు ఆధారాలతో సహా వివరించడం, తెలంగాణకు బీఆర్ఎస్ మాత్రమే టార్చ్‌బేరర్‌గా ఎలా పనిచేసింది? భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నదనే అంశాన్నే ప్రధాన ఎజెండాగా మలిచే అవకాశాలు ఉన్నాయని తెలుస్తున్నది. బీఆర్ఎస్ అధికారం కోల్పోయి, కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన 100 రోజుల్లోనే రాష్ట్రంలోని ఏయే వర్గాలు ఎలా నిర్లక్ష్యానికి గురయ్యాయి? ఎలా నిర్వీర్యమయ్యాయి? అనే అంశాన్ని కేసీఆర్ తనదైన శైలిలో ప్రజలకు వివరించనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ పార్టీ ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలులో వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యాచరణ రూపొందించినట్టు విశ్వసనీయవర్గాల సమాచారం.
కేసీఆర్ చేపట్టనున్న బస్సు యాత్ర పార్టీ క్యాడర్లో సమరోత్సాహం నింపేందుకు దోహదపడుతుందని పార్టీ నేతలు భావిస్తున్నారు. తక్కిన పార్టీలకు అవకాశవాద క్యాడర్ ఉంటే, తమకు మాత్రం అంకుశంలాంటి క్యాడర్ ఉన్నదని అనేక సందర్భాల్లో నిరూపితమైందని పార్టీ అగ్రనాయకత్వం ఉదహరిస్తున్నది. రాష్ట్రంలో మరే పార్టీకీ బలమైన పునాదిలేదని, తమకు మాత్రమే ఉన్నదని, అదే తమకు కొండంత బలమని గులాబీదళం ధీమాగా ఉన్నది. ఉగాది పండుగ తర్వాత ఎన్నికల శంఖారావం పూరిస్తామని, బీఆర్ఎస్ క్యాడర్ బలమేమిటో, సత్తా ఏమిటో చూపిస్తామని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు.