దేవరుప్పుల, మే 3 : ‘ఉమ్మడి రాష్ట్రంలో అష్టకష్టాలు పడ్డ తెలంగాణ రైతాంగాన్ని స్వరాష్ట్రంలో తలెత్తుకొని తిరిగేలా చేసినం. నేడు కాంగ్రెస్ పాలనలో మళ్లీ పాత రోజుల నాటి దుస్థితి దాపురించింది. రైతులు అన్యాయమైపోతుండ్రు దయాకర్’ అంటూ ఎర్రబెల్లి దయాకర్రావుతో ఫోన్లో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వాపోయారు. శనివారం రాత్రి ఎర్రబెల్లికి ఫోన్ చేసిన కేసీఆర్ ఈ నెల 6న వరంగల్లో జరుగనున్న రైతు సదస్సుపై వాకబు చేశారు. ‘రైతులు మళ్లా ఆగమైండ్రు. రెండున్నరేండ్లలోనే కాంగ్రెసోళ్లు వ్యవసాయాన్ని అతలాకుతలం చేసిండ్రు.. వ్యవసాయంలో దేశానికే తెలంగాణను ఆదర్శంగా నిలిపినం. రైతు బిడ్డ అంటే పిల్లనిచ్చే పరిస్థితి తెచ్చినం.
కథ మళ్లా మొదటికి వచ్చింది. ఈ నెల 6న జరిగే రైతు సదస్సుకు రైతులు భారీగా తరలేలా చూడండి. రైతులతోనే మాట్లాడించండి’ అని కేసీఆర్ సూచించినట్టు ఎర్రబెల్లి తెలిపారు. రైతులు కాంగ్రెస్ పార్టీకి ఓటేసినందుకు పశ్చాత్తాప పడుతున్నారని, ఒక్క రైతులే కాక, అన్ని వర్గాల ప్రజలు రేవంత్రెడ్డి మాటలకు మోసపోయామని వాపోతున్నారని కేసీఆర్కు వివరించినట్టు చెప్పారు. ప్రస్తుతం నడుస్తున్న ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాల పరిస్థితిపై వివరించినట్టు తెలిపారు. బస్తాలు, హమాలీ, లారీ కిరాయి అన్నీ మక్క రైతుల మీదనే వేస్తున్నారని చెప్పారు. ‘కేసీఆర్ను ఓడగొట్టి ఆగమవుతున్నం.. అరిగోస పడుతున్నం’ అని ఎక్కడికి వెళ్లినా రైతులు మొత్తుకుంటున్నట్టు కేసీఆర్కు వివరించానని తెలిపారు.